Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇప్పటికే సెంచరీ కొట్టాం

నాలుగు దశల్లో పూర్తి మెజారిటీ
యూపీలో విజయంపై అఖిలేశ్‌ ధీమా

ఫిరోజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో తొలి రెండు దశల పోలింగ్‌లో తమ పార్టీ ఇప్పటికే సెంచరీ కొట్టిందని, నాలుగో దశ నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొదటి రెండు దశల్లో 113 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగ్గా, మూడో దశలో ఫిబ్రవరి 20న, నాలుగో దశలో ఫిబ్రవరి 23న 59 స్థానాల చొప్పున పోలింగ్‌ జరగనుంది. ‘ఇప్పటికే మొదటి రెండు దశల్లో కలిపి సెంచరీ కొట్టాం… నాలుగో దశ పోలింగ్‌ పూర్తయ్యేసరికి సమాజ్‌వాదీ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం ఉంటుంది’ అని గురువారం ఫిరోజాబాద్‌లోని నాసిర్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఎస్పీ చీఫ్‌ అన్నారు.
ఫిరోజాబాద్‌ స్థానానికి కూడా మూడో దశలో పోలింగ్‌ జరగనుంది. ఫిరోజాబాద్‌ ప్రజలు ఈసారి బీజేపీకి కళ్లు తెరిపిస్తారని ఎస్పీ చీఫ్‌ అన్నారు. ఎస్పీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కుల గణన, అన్ని కులాలకు సమాన ప్రాతినిథ్యం, గౌరవం కల్పిస్తామని యాదవ్‌ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కాపాడేందుకు, అవమానానికి గురైన వెనుకబడిన, దళితులు, మైనారిటీల గౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. ఓ మాఫియా డాన్‌కు క్రికెట్‌ ఆడే అవకాశాన్ని కల్పించే వారిని క్రిమినల్స్‌గా యాదవ్‌ అభివర్ణించారు. తూర్పు యూపీకి చెందిన రాజకీయవేత్తగా మారిన ఓ డాన్‌ క్రికెట్‌ ఆడుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘నేను మళ్లీ చెబుతున్నాను, చట్టాన్ని ఉల్లంఘించడం లేదా దాని ప్రకారం నడుచుకోని వారు సమాజ్‌ వాదీ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రజలకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. ‘వారి ప్రసంగాలు వినండి… చిన్న నాయకుడు చిన్న అబద్ధాలు చెబుతాడు, పెద్దనాయకుడు పెద్ద అబద్ధాలు చెబుతాడు, అతి పెద్ద నాయకుడు అతిపెద్ద అబద్ధాలు చెబుతున్నాడు’ అని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.
యూపీని రక్షించడంలో సహాయం చేయాలని అఖిలేశ్‌ ప్రజలను కోరారు. ములాయం సింగ్‌ యాదవ్‌ పోరాడిన సోషలిస్ట్‌ సూత్రాలపై పని చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగాల్లో ఎవరికీ రిజర్వేషన్లు దక్కకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం విమానాశ్రయాలు, రైళ్లు, రైల్వేలతో సహా అన్నింటిని అమ్ముతోందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img