Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెట్రోల్‌, డీజిల్‌పై గతేడాది పెంచిన ధరలు ఉపసంహరించండి

కాంగ్రెస్‌ డిమాండ్‌
న్యూదిల్లీ : గత ఏడాది కాలంలో పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన అన్ని పన్నులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ శనివారం డిమాండ్‌ చేసింది. అలాగే ప్రభుత్వం మార్చి 2022 లోపు ఉచిత రేషన్‌ పథకాన్ని నిలుపుదల చేయవద్దని కోరింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా మాట్లాడుతూ కోవిడ్‌ పేరుతో ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 చొప్పున పెంచిందని, జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నందున వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. ‘కోవిడ్‌కు ముందు కాలంలో రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు చేయడం గురించి ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడానికి మీరు కోవిడ్‌ను సాకుగా ఉపయోగించుకున్నారు. కోవిడ్‌ ముగిసి, జీఎస్‌టీ వసూళ్లు సాధారణ స్థితికి చేరుకున్నందున దయచేసి వెంటనే దాన్ని ఉపసంహరించుకోండి’ అని ఆయన విలేకరులకు తెలిపారు. ‘గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద పేదలకు పంపిణీ చేసే ఆహార ధాన్యాలను నవంబర్‌లో నిలిపివేయకూడదని కూడా మేము డిమాండ్‌ చేస్తున్నాము. ఇది మార్చి 31, 2022 వరకు కొనసాగించాలి. ఎందుకంటే మనమంతా తాజా ఆకలి సూచికలో భారతదేశం స్థానాన్ని చూశాము’ అని ఖేరా అన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇంధనంపై వ్యాట్‌ రేట్లను తగ్గించడంపై అడిగిన ప్రశ్నకు ఖేరా మాట్లాడుతూ దీనిపై చర్చ జరుగుతోందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే బీజేపీ, దాని మిత్రపక్షాలకు 27 రాష్ట్రాలు ఉన్నాయని, కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాలు ఉన్నాయని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడానికి సెంట్రల్‌ ఎక్సైజ్‌ కారణమని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది.
దీంతో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ వారం ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాయి. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా రాణించకపోవడంతో బీజేపీ ప్రభుత్వాలు అలా చేశాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై మరిన్ని పన్నులను ఉపసంహరించుకోవాలని ఖేరా డిమాండ్‌ చేశారు. ప్రజల ఆగ్రహం కారణంగా రాబోయే ఎన్నికలలో మరింత దారుణమైన ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img