Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రజల మనిషి నల్లకన్ను

సీపీఐ కార్యాలయానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం స్టాలిన్‌
చెన్నై : సీపీఐ ప్రముఖ నాయకుడు ఆర్‌.నల్లకన్నుకు పార్టీలకతీతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పాలక డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు ఆదివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నల్లకన్ను 97వ పుట్టినరోజు వేడుకలు సీపీఐ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. నల్లకన్ను సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ తమిళుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. పేదలు, అట్టడుగు ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం విశేష కృషి చేసినట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి నల్లకన్నుకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళ సమాజానికి మరిన్ని సేవలు అందించడానికి నల్లకన్ను ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకున్నారు. సామాజిక జీవనంలో నల్లకన్ను అంతటి నిరాడంబరుడు ఎవరూ కనిపించబోరని సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. సమగ్రత, సమైక్యతకు ఆయన ఓ చిహ్నమని పేర్కొన్నారు. ఆయన అనుభవాలు, త్యాగాలు, విజ్ఞత ద్వారా తమిళ సమాజానికి మరిన్ని సేవలు అందించాలని స్టాలిన్‌ ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్టాలిన్‌ వెంట జలవనరుల శాఖమంత్రి దురై మురుగన్‌, దేవదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ఉన్నారు. సీపీఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ముతరాసన్‌, తిర్పూరు ఎంపీ కె.సుబ్బరాయన్‌, సీపీఐ రాష్ట్ర నాయకుడు సి.మహేంద్రన్‌ ఉన్నారు. నల్లకన్ను మంచి ఆరోగ్యంతో జీవించాలని ఏఐఏడీఎంకే కోఆర్డినేటర్‌ ఓ.పన్నీరుసెల్వం ట్వీట్‌ చేశారు. రానున్న కాలంలోనూ ఆయన ఉత్సాహంగా ప్రజాసేవ చేయాలని కోరారు. జయలలిత నెచ్చెలి వీకే శశికళ, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం నాయకుడు టీటీవీ దినకరన్‌, ఇతర పార్టీల నాయకులు సీపీఐ సీనియర్‌ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img