Friday, May 10, 2024
Friday, May 10, 2024

బెంగళూరులో రైతునేతకు అవమానం

రాకేశ్‌ తికైత్‌పై సిరా చల్లిన నిరసనకారులు
బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రైతు సంఘం నేత రాకేశ్‌ తికైత్‌పై దాడి జరిగింది. ఓ కార్యక్రమానికి హాజరైన తికైత్‌… మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా కొంతమంది నిరసనకారులు ఆయన ముఖంపై నల్ల సిరా చల్లారు. ఆయన పక్కనే ఉన్న యుధ్వీర్‌ సింగ్‌ ముఖంపై కూడా సిరా చల్లారు. అంతటితో ఆగకుండా వేదికపైకి కుర్చీలు విసిరారు. ఊహించని ఘటనతో ముందు దిగ్భ్రాంతి చెందిన తికైత్‌ అనుచరులు దుండగులపై ఎదురుదాడికి దిగి వారితో తలపడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పక్షాల వారు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. కొడిహల్లి చంద్రశేఖర్‌ అనే కర్ణాటక రైతు నేత డబ్బు తీసుకుంటూ… ఓ ఛానెల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన ఘటనకు సంబంధించి రాకేశ్‌ తికైత్‌, యుధ్వీర్‌ సింగ్‌లు వివరణ ఇస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. జరిగిన ఘటనపై తికైత్‌ స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ కార్యక్రమానికి పోలీసులు రక్షణ కల్పించలేదని, ప్రభుత్వం కనుసన్నల్లోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. మరోవైపు దాడికి కారణంగా భావిస్తున్న స్థానిక రైతు నేత చంద్రశేఖర్‌ అనుచరులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img