Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మధ్యాహ్న భోజనంలో మాంసాహారం నిలిపివేత

కేంద్రానికి సుప్రీం నోటీసులు


న్యూదిల్లీ: పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం మెనూ నుంచి చికెన్‌ సహా గుడ్లు, మాంసం ఉత్పత్తులను తొలగించాలన్న లక్షద్వీప్‌ అధికార యంత్రాంగం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, ఇతరులకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని ఆదేశించింది. అంతేకాకుండా డెయిరీ ఫారాలు కూడా మూసివేయాలన్న నిర్ణయాన్ని పిటిషనర్‌ సవాల్‌ చేశారు. లక్షద్వీప్‌ అధికార యంత్రాంగం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్నలతో కూడిన ధర్మాసనం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌కు నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబరులో ప్రఫుల్‌ ఖొడా పటేల్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పశసంవర్ధకశాఖ నిర్వహిస్తున్న డెయిరీ ఫారాలను మూసివేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, లక్షద్వీప్‌ ప్రజల ఆహార అలవాట్లపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ అహ్మద్‌ అజ్మల్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం 2021 సెప్టెంబరులో కొట్టేసింది. లక్షద్వీప్‌లో గల అన్ని డెయిరీ ఫారాలను తక్షణమే మూసివేయాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టరు 2021 మే 21న జారీ చేసిన ఆదేశాలను అహ్మద్‌ సవాల్‌ చేశారు. గోవులు, బర్రెల వధపై నిషేధానికి ఉద్దేశించిన ప్రతిపాదిత పశు సంవరక్షణ(నియంత్రణ) బిల్లు`2021ను అమలు చేసే ఉద్దేశంతోనే ఇలాంటి ఆదేశాలు ఇచ్చారని అహ్మద్‌ ఆరోపించారు. లక్షద్వీప్‌లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అందించే ఆహారంలో చికెన్‌, ఇతర మాంసాహార ఉత్పత్తులను తొలగించాలన్న అధికార యంత్రాంగం నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img