Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్‌

తృణమూల్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు
ప్రతిపక్ష హోదా కోల్పోయిన హస్తం
షిల్లాంగ్‌ :
మేఘాలయలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండగా అందులో 12 మంది గురువారం తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా నాయకత్వంలో ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీ ఫిరాయించారు. ముందుగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ముకుల్‌ సంగ్మా తన మద్దతుదారులైన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ మెత్బా లింగ్డోకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ ప్రకటించింది. దీంతో మేఘాలయ అసెంబ్లీలో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌… కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకున్నది. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే దిశగా టీఎంసీ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బృందం వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సంగ్మా తన అనుచరులతో కలిసి టీఎంసీలో చేరినట్లు తెలుస్తున్నది. శాసనసభలో ప్రతిపక్షనేత అయిన ముకుల్‌ సంగ్మా.. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు విన్సెంట్‌ హెచ్‌ పాలాతో ఆయనకు పొసగడం లేదు. అయితే పార్టీ పెద్దల సూచనతో ఇద్దరు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే సంగ్మా.. పార్టీని కుదిపేశారు. మరోవైపు జాతీయస్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చిన మమతా బెనర్జీ.. వివిధ పార్టీల నాయకులను కలవడానికి దిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో మేఘాలయలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ను తృణమూల్‌ చీల్చడం విశేషం. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం ఎలా అనే అంశంపై తామంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే మమతా బెనర్జీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ముకుల్‌ సంగ్మా చెప్పారు. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి బాధ్యతతో, నిబద్ధతతో సేవ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలేకరుల సమావేశంలో సంగ్మా చెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల జాబితాను స్పీకర్‌ మెత్బా లింగ్డోకు సమర్పించారు
ప్రశాంత్‌కిశోర్‌ పనేనా?
ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీని వీడి తృణమూల్‌ గూటికి చేరారు. ప్రతిపక్ష హోదా సైతం గల్లంతైంది. రాత్రికి రాత్రే మారిన సమీకరణాలు.. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో హస్తం పార్టీ అస్తవ్యస్తానికి కారణాలను పరిశీలిస్తే…ప్రశాంత్‌ కిశోర్‌ పేరు వినిపిస్తోంది. ఆయన వ్యూహానికి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ కోట పేకమేడలా కూలిపోయింది. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షం తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కొంతమంది ఆ తర్వాత పార్టీ మారగా..కాంగ్రెస్‌ సంఖ్యాబలం 17కు తగ్గింది. ఇప్పుడు ఇందులోని 12 మంది టీఎంసీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తృణమూల్‌ రాత్రికి రాత్రే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img