Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతుల డిమాండ్లు నెరవేర్చకుంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు


కేంద్రమంత్రిగా అజయ్‌ మిశ్రా పనికిరాడు
మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు

జైపూర్‌ : రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన చేస్తున్న రైతుల డిమాండ్లను నెరవేర్చాలని సత్య పాల్‌ మాలిక్‌ ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌.. చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతుల సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే.. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదంటూ స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గ్రామాల్లోకి కూడా నాయకులు ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. తాను మీరట్‌నుంచి వచ్చానని, రైతుల సమస్యను పరిష్కరించకపోతే.. తన ప్రాంతంలోని ఏ గ్రామంలో కూడా బీజేపీ నాయకులు ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. ఒక్క మీరట్‌లోనే కాదు ముజఫర్‌నగర్‌, బాగ్‌పత్‌ ఇలా రైతు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించలేరంటూ ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కొందరి మాటలు విని రైతు సమస్యను సాగదీస్తోందని.. ఇలాంటి వారి వల్లే మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటిస్తే ఆటోమేటిక్‌గా రైతు ఉద్యమం ముగుస్తుందంటూ ఆయన సలహా ఇచ్చారు. ఎంఎస్‌పీ ఇస్తామని హామీ ఇవ్వడానికి కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు. రాజస్థాన్‌లోని రaుంరaును ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు 10 నెలలుగా ఇళ్లు, కుటుంబాలను వదిలి వీధుల్లో కూర్చున్నారని.. వారి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరారు. మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడ్డానని.. రైతుల కోసం ప్రధాని, హోం మంత్రితో పోరాడానంటూ పేర్కొన్నారు. ఉద్యమంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఎవరైనా కోరితే, అందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సత్యపాల్‌ మాలిక్‌ స్పష్టంచేశారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనపై విలేకరులు ప్రశ్నించగా, ఘటన జరిగిన మరుసటి రోజునే అజయ్‌ మిశ్రా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఆయన కేంద్ర మంత్రి పదవికి పనికిరారంటూ వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతుగా పదవిని వదులుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతం తన పదవిని వదులుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే వదులుకుంటానని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత సత్యపాల్‌ మాలిక్‌ రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img