Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘సింఘు’ హత్యా ఘటనపై వీడియో క్లిప్పింగ్‌ను పరిశీలిస్తున్నాం

హరియాణా పోలీసులు
చండీగఢ్‌ : సింఘు వద్ద హత్యకు గురైన వ్యక్తి మృతి చెందడానికి ముందు కొన్ని విషయాలు చెప్పినట్లు గా వైరల్‌ అయిన వీడియో వాస్తవికతను హరియాణా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి గురువారం తెలిపారు. ‘‘ఈ వీడియో బుధవారం నుంచి సర్క్యులేట్‌ అవుతోంది.. ఈ క్లిప్పింగ్‌ కచ్చితత్వాన్ని ధృవీకరించే పనిలో మేము ఉన్నాము.. దీనిలో బాధితుడు తన చుట్టూ ఉన్న జనంతో తనకు ఎవరో రూ. 30,000 ఇచ్చినట్లు చెప్పాడు. కానీ ఏ ప్రయోజనం కోసం అనేది స్పష్టంగా లేదు’’ అని ఖారోడా, సోనిపట్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ మయాంక్‌ గుప్తా గురువారం వెల్లడిరచారు. హరియాణా ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి గతంలో ఏర్పాటు చేసిన రెండు సిట్‌లలో ఒకదానికి గుప్తా నేతృత్వం వహిస్తున్నారు. ‘అతను ఒత్తిడితో ఇలా చెబుతున్నాడా అనేది కూడా స్పష్టంగా లేదు’ అని గుప్తా పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం దర్యాప్తును నిర్వహించడానికి ఒక సిట్‌ ఏర్పాటు చేయగా, గుప్తా నేతృత్వంలోని సిట్‌ సోషల్‌ మీడియాలో ప్రసారమైన వీడియోల దర్యాప్తు కోసం ఏర్పాటయింది. ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోందని, పోలీసులు దానిని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నారని గుప్తా చెప్పారు. ‘‘చలామణిలో ఉన్న వివిధ వీడియోల ఆధారంగా, ఈ సంఘటనలో వారి ప్రమేయం కోసం మేము మరింత మందిని గుర్తించాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది ’’ అని ఆయన చెప్పారు. సింఘులోని రైతుల నిరసన స్థలం వద్ద హత్యకు గురైన దళిత కార్మికుడిని ప్రలోభపెట్టి దిల్లీ`హరియాణా సరిహద్దుకు తీసుకెళ్లారన్న అతడి సోదరి ఫిర్యాదు పై దర్యాప్తు చేయడానికి పంజాబ్‌ ప్రభుత్వం కూడా బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.పంజాబ్‌లోని తార్న్‌ తరణ్‌లోని ఓ గ్రామానికి చెందిన లఖ్‌బీర్‌సింగ్‌ అక్టోబర్‌ 15 న హత్యకు గురయ్యాడు. అతడి దేహాన్ని సింఘు సరిహద్దు వద్ద ఒక బారికేడ్‌కి వేలాడదీశారు. పదునైన ఆయుధాలతో పొడిచిన గాయాలు అతడి దేహంపై కనిపించాయి. ఈ దారుణ హత్యకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు అరెస్టయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img