Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

గుజరాత్‌లో ఎన్నికలు బహిష్కరించిన 7 గ్రామాలు

సార్వత్రిక ఎన్నికల మూడవ దశలో భాగంగా గుజరాత్‌లోని సుమారు ఏడు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. నదిపై వంతెన నిర్మాణం, తాగు నీరు సౌకర్యం, రోడ్డు వేయడం తదితర హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యానికిగాను ఈ గ్రామాల ప్రజలు మంగళవారం పోలింగ్‌లో పాల్గొనలేదు. కొన్ని గ్రామాలు పూర్తిగా మరికొన్ని ఊర్లు పాక్షికంగా ఎన్నికలను బహిష్కరించాయి. తమ గోడు పట్టనప్పుడు ఓటు వేయడం ఎందుకని ప్రశ్నించారు. అధికారులు, అభ్యర్థుల బుజ్జగింపులకు లొంగలేదు. తమ నిర్ణయానికి కట్టుబడిన మూడు గ్రామాలలో ఒక్క ఓటు పోలు కాలేదు. భరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామం, సూరత్‌ జిల్లాలోని సనాధర, బనాస్కాంతా జిల్లాలోని భఖారి గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో ఓటింగ్‌ను బహిష్కరించారు. జునాగఢ్‌ జిల్లాలోని భట్గామ్‌, మహిసాగర్‌ జిల్లాలోని బదోలీ, కుంజారా గ్రామాల వారు పాక్షికంగా ఎన్నికలను బహిష్కరించారు. బర్దోలి లోక్‌సభ స్థానం పరిధిలోని సనాధరా గ్రామంలో 320 ఓట్లు ఉండగా, పూర్తిగా ఎన్నికలు బహిష్కరించిన గ్రామాలు కలిపి వెయ్యికిపైగానే ఓట్లు ఉన్నాయి. పటన్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బఖ్రీ గ్రామంలోని 300 మంది ఓటర్లు సంయుక్తంగా ఎన్నికలను బహిష్కరించారు.
తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా వారు ఓటు వేయలేదు. భరూచ్‌ పరిధిలోని కేసర్‌ గ్రామంలోని 350 మంది ఓటర్లు కూడా ఎన్నికలను బహిష్కరించారు. బదోలీలో 790 మందికిగాను 34 మందే ఓటు వేయగా కుంజారా గ్రామంలో 734 మంది ఓటర్లు ఉంటే ముగ్గురు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గ్రామీణ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించడం గతంలోనూ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img