Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆల్ట్‌ న్యూస్‌ జుబేర్‌కి తాత్కాలిక బెయిల్‌

న్యూదిల్లీ: మత విశ్వాసాలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దాఖలైన కేసులో ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌కి సుప్రీంకోర్టు శుక్రవారం ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ని మంజూరు చేసింది. దిల్లీ కోర్టు పరిధిని వీడి వెళ్లకూడదని, ఈ కేసుకు సంబంధించి ట్విట్టర్‌లో ఎటువంటి పోస్టులు పెట్టవద్దని జుబేర్‌కు షరతు విధించింది. న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, జేకే మహేశ్వరిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ జుబేర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణ ఇతర ధర్మాసనంలో జరుగుతుందని తెలిపింది. సీతాపూర్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి తన మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులు ఉన్నాయని, దిల్లీలో అతనిపై నమోదైన కేసుకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీతాపూర్‌లో నమోదైన కేసులో దర్యాప్తుపై స్టే లేదని, అవసరమైతే ల్యాప్‌టాప్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా…దిల్లీ కోర్టు ఆదేశం ప్రకారం జుబేర్‌ కస్టడీలోనే ఉంటారని చెప్పారు. సీతాపూర్‌ కోర్టు గురువారం తన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిందని, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అటకెక్కించారని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడని వివరించారు. జూన్‌ 1న హిందూ శ్రీసేన సీతాపూర్‌ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌ శరణ్‌ చేసిన ఫిర్యాదుపై ఉత్తరప్రదేశ్‌లో జుబేర్‌పై ఐపీసీ సెక్షన్‌ 295ఏ (మత భావాలను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్య), ఐటీ చట్టంలోని ఐపీసీ సెక్షన్‌ 67 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. జుబేర్‌ తన ట్వీట్లలో ఒకదాని ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణపై జూన్‌ 27న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జుబేర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గోన్సాల్వేస్‌ మాట్లాడుతూ అతను తన ట్వీట్‌లను అంగీకరిస్తున్నాడని, అయితే ఈ ట్వీట్‌లు ఎటువంటి నేరాన్ని బహిర్గతం చేయలేదని, ద్వేషపూరిత ప్రసంగాల నేరాలను మాత్రమే ఎత్తి చూపారని, పోలీసులు నేరస్థులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. జుబేర్‌ ప్రాణాలకు ముప్పు ఉందని, ఇది జీవించే హక్కుకు సంబంధించిన ప్రశ్న అయినందున అతనికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని గోన్సాల్వెస్‌ అన్నారు. తదుపరి విచారణ తేదీకి ముందు ఉత్తరప్రదేశ్‌ కోర్టు అనువదించిన ఉత్తర్వును ఇతర పత్రాలతో సహా దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img