Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఉత్తరాఖండ్‌ బస్సు ప్రమాదంలో 26కి చేరిన మృతులు

ముగిసిన సహాయ చర్యలు
డెహ్రాడూన్‌:ఉత్తరఖండ్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. మృతదేహాల వెలికితీత, సహాయ కార్యక్రమాలు ముగిశాయి. డ్రైవర్‌తో సహా 30 మంది యాత్రీకులు బస్సులో ఉండగా అందులో 26 మంది చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉత్తరాఖండ్‌ పోలీసులు సోమవారం తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందినవారు. ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాత్రికి రాత్రే డెహ్రాడున్‌ చేరుకున్నారు. అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సోమవారం ఉదయం ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాగా డ్రైవర్‌ నిద్రే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్టీరింగ్‌పైనే నిద్రలోకి జారుకున్నాడని, విశ్రాంతి లేకుండా మూడవ ట్రిప్‌కు వెళ్లాడని ఉత్తరఖండ్‌ అధికారులకు సమాచారం అందింది. కాగా ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని పన్నా నుండి యమునోత్రికి యాత్రీకులను తీసుకువెళుతున్న బస్సు… డంటా ప్రాంతంలో అత్యంత లోతైన లోయలో పడిపోవడంతో 26 మంది మృతి చెందగా, నలుగురు గాయాలతో బయటపడ్డారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటన గురించి దమ్తా ప్రాంత గ్రామస్తులు మొదట తెలుసుకున్నారు. అధికారులకు సమాచారం అందించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన అరగంటలోనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే ప్రయాణీకుల్లో ఎక్కువ మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు రిఖాన్‌ ఖడ్‌లో హోటల్‌ నడుపుతున్న వీరేంద్ర పన్వార్‌ తెలిపారు. ‘అక్కడక్కడా పడివున్న అవయవాలు మృతదేహాలను నేను చూశాను. వాటిలో కొన్ని కొండగట్టులో చెట్లకు వేలాడుతున్నాయి’ అని ప్రమాద ప్రత్యక్ష సాక్షి, జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్‌ సింగ్‌ రావత్‌ చెప్పారు. తాను బస్సు వెనుకనే తన వాహనాన్ని నడుపుతున్నానని, నేను దానిని అధిగమించేలోపు అది పెద్ద శబ్దంతో లోయలో పడిపోయింది’ అని రావత్‌ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామికి ఫోన్‌ చేసి మాట్లాడానని అమిత్‌ షా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా బస్సు ప్రమాద మృతదేహాలను భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) విమానంలో మధ్య ప్రదేశ్‌కు తరలించాలన్న తన అభ్యర్థనను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమోదించినట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img