Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. మే నెలలో 13 ఏండ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు

దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. అంతలోనే కుండపోత వర్షం కురుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా తెలంగాణ‌, ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఇంతలోనే భారీ పొగ మంచు రాజధాని ప్రాంతాన్ని కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవహించింది. దీంతో వాహనదారులు దారి కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా ఢిల్లీలో మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. నగరంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఎండలు మండిపోయే మే నెలలో సాధారణంగా ఇటువంటి వాతావరణ పరిస్థితులు చాలా తక్కువ. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం.. పగటిపూట, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉండటంతో పొగమంచు ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఢిల్లీలో విజబిలిటీ 501 నుంచి 1,000 మీటర్లుగా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. అంతకంటే దూరంలోని వాహనాలు కనిపించని పరిస్థితి. ఇక ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. అక్కడ నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు 24 గంటల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఢిల్లీలో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే తొమ్మిది డిగ్రీలు తక్కువ. ఇదిలా ఉంటే.. గురువారం కనిష్ట ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీల సెల్సియస్ కాగా.. దీనిని గత 13 సంవత్సరాల్లో మే నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతగా చెబుతున్నారు. ఇక, ఢిల్లీలో శుక్రవారం నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img