Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

మోదీ ప్రభుత్వం పారిపోయింది

పార్లమెంటు వాయిదాపై కాంగ్రెస్‌ ఫైర్‌
ధరల పెరుగుదలపై వీధుల్లోకొస్తామని హెచ్చరిక

న్యూదిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చించడానికి భయపడి పారిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. షెడ్యూల్‌ కంటే ముందే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను ముగించడాన్ని ఆ పార్టీ తప్పు బట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ… లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ధరల పెరుగుదలపై చర్చకు, రాజ్యసభ బీఏసీ సమావేశంలో కీలక బిల్లుల కోసం ప్రభుత్వం సమయం కేటాయించినప్పటికీ ఆ విధంగా చేయలేదని పేర్కొన్నారు. సభను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్న చౌదరి, ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందన్నారు. కాగా ధరల పెరుగుదలపై చర్చ జరపకుండా ప్రభుత్వం పారిపోతోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. ఈ అంశంపై వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడిరచారు. శుక్రవారం వరకు ఎజెండా ఇచ్చినప్పటికీ రెండు రోజుల ముందే పార్లమెంటు మూతపడిరదని, పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యల పరిష్కారంపై మోదీ ప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టమైందని ఖర్గే అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరాం రమేశ్‌ మాట్లాడుతూ… వివిధ బిల్లులకు బీఏసీ సమయం కేటాయించిందని, ప్రతిపక్షాలు వాటిపై చర్చకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అయితే సభను వాయిదా వేస్తున్నట్లు బుధవారం తెలిసిందన్నారు. ‘ప్రతిపక్షాలన్నీ ధరల పెరుగుదలపై చర్చను కోరుతున్నందున ప్రభుత్వం పారిపోతోంది…చర్చ జరగడం వారికి ఇష్టం లేదు. మేము కూడా రైతు సంఘాలతో ఒప్పందంపై చర్చ జరగాలని కోరుకున్నప్పటికీ ప్రభుత్వం దానిని నివారించాలనుకుంటోంది’ అని రమేష్‌ అన్నారు. ప్రభుత్వం సభను వాయిదా వేయడంతో రెండు రోజులు వృథా అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యమే తప్ప తమది కాదని పేర్కొన్నారు. సభా నాయకుడు పీయూష్‌ గోయల్‌ తప్పిపోయారంటూ రమేష్‌ ఎద్దేవా చేశారు. ‘అరుణ్‌ జైట్లీ, థావర్‌ చంద్‌ గెహ్లాట్‌లను మేము చూశాం… ఇద్దరూ ఎప్పుడూ సభలో ఉండేవారు. సభా నాయకుడికి హాజరు కావడం బాధ్యత. సభానాయకుడు కనిపించకుండా పోవడం ఇదే తొలిసారి. ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని కేవలం నాలుగైదు సార్లు వచ్చుంటారు’ అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img