Friday, September 30, 2022
Friday, September 30, 2022

ఉరితాళ్లు!

కూన అజయ్బాబు

జరిగిన కథ 1 : రాజారామ్‌ (పేరు మార్చాం) కరోనాతో ఆసుపత్రిపాలయ్యాడు. ఆక్సిజన్‌ అందక 2021 ఏప్రిల్‌ 25న చనిపోయాడు. భార్య సుమిత్రకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఏ ఏటి ఒడ్డునో, నదీ తీరంలోనో అతని శవాన్ని తగలబెట్టారు. ఇక అక్కడి నుంచి సుమిత్ర కష్టాలు మొదలయ్యాయి. ఆసుపత్రి వారు ఇచ్చిన డెత్‌ సర్టిఫికెట్‌లో రాజారామ్‌ పేరు తప్పుపడిరది. దాన్ని సరిచేస్తేనే ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందుతుంది. మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం అడిగింది. ‘రిజిస్టర్డ్‌ కాంటాక్ట్‌’లో సరి చేయాలని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియకు నాలుగు వారాలు పట్టింది. చివరకు జులై నాటికి ఆమెకు ధృవీకరణ పత్రం చేతికి వచ్చింది. అంటే మూడు నెలలు పట్టింది. ఆ తర్వాత ఆమె కథ పురపాలక సంఘానికి చేరింది. డెత్‌ సర్టిఫికెట్‌ చెల్లుబాటు అయ్యేలా చూడాలంటే అక్కడ కూడా మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పారు. ఆ విధంగా కార్యాలయాల చుట్టూ ఆమె తిరిగింది. కొవిడ్‌ పరిహారం రావాలంటే లంచాలు ఇచ్చుకోవాలని అధికారులు తేల్చి చెప్పారు. తాను, 17 ఏళ్ల తన కుమారుడు బతకడానికే ఇబ్బంది పడుతున్నామని, ఈ తరుణంలో తాము లంచాలు ఎలా ఇచ్చుకోగలమని ఆమె కాళ్లావేళ్లా పడిరది. చివరకు పురపాలక సిబ్బంది దయచూపి, పరిహారం వచ్చాక తమకు కమీషన్‌ ఇచ్చుకోవాలని చెప్పింది. ఆమెకు ఒప్పుకోక తప్పలేదు. ఇంత జరిగినా పరిహారం ఇంకా ఆమె చేతికందలేదు. కరోనాతో మృతిచెందిన కుటుంబానికి రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్‌) నుంచి కనీసం రూ. 50 వేలు అయినా ఇవ్వడానికి సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఒప్పుకుంది. అయినప్పటికీ ఏ ఒక్కరికీ కరోనా పరిహారాలు అందలేదు. సుమిత్ర నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే వుంది.
జరిగిన కథ 2 : కరీమ్‌ (పేరు మార్చాం) అనే వ్యక్తి కొవిడ్‌తో చనిపోయాడు. ఆమె భార్య హసీనా, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పైగా ఆమె గర్భవతి కూడా. నాల్గవ సంతానం కోసం నిరీక్షణ! ఇప్పుడు తన భర్త కరోనాతోనే చనిపోయినట్లు ఆమె నిరూపించుకోవాలి. కరోనా డెత్‌ సర్టిఫికెట్‌ నెలరోజుల్లోపే ఇస్తారు. ఆ తర్వాత ఇవ్వరట! ఇదిగాక నివాస ధృవీకరణ, చనిపోయింది తన భర్తే అని ధృవీకరించే ‘సంబంధ’ సర్టిఫికెట్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. హసీనాకు ఇల్లు తప్ప పెద్దగా బయటకు వెళ్లిన సందర్భాలు లేవు. పిల్లలంతా చిన్నవారే. అయినప్పటికీ, హసీనా తిరిగి తిరిగి చివరకు కొన్ని పత్రాలు సమర్పించింది. కానీ అధికారుల నుంచి పరిహారం ‘తిరస్కరించారు’ అని సమాధానం వచ్చింది. ఆమె మళ్లీ దరఖాస్తు పెట్టుకున్నది. ఆమె పిల్లలు 2021 ఏప్రిల్‌ 26 నుంచి సరైన తిండి కూడా తినడం లేదు. దాతలిచ్చిన డబ్బులతో ఆమె ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే వుంది.
జరిగిన కథ 3 : వీర్రాజు (పేరు మార్చాం) భార్య రాణి కథ కూడా పైన పేర్కొన్న రెండు కథల తరహాలోనే వుంది. కాకపోతే ఈ కథలో కొత్త అంశమేమిటంటే, భర్త మరణంతో ఒంటరి మహిళగా మారిన రాణికి స్థానిక కార్పొరేటర్‌ మొదలుకొని అధికారుల వరకు అందరి నుంచి లైంగిక వేధింపులు విపరీతంగా ఎదురయ్యాయి. చూడటానికి ఆమె కాస్త అందంగా ఉండటమే ఆమె చేసిన నేరం. సుమిత్ర, హసీనాల కన్నా రాణి మరింత తీవ్రమైన వేదనకు గురవుతోంది.
కొవిడ్‌ నేపథ్యంలో ఇలాంటి కథలు, కథనాలు ఎన్నో ఎన్నెన్నో! ఈ కథలన్నింటిలోనూ మహిళలే బాధితులు. కులమతాలను బట్టి సర్టిఫికెట్ల జారీ జరుగుతోందన్న ఆరోపణ కూడా వస్తోంది. అవిభాజ్య హిందూ కుటుంబాల్లో వారసుల విషయంలోనూ మహిళలు ఈ సరికొత్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హిందూవారసత్వ చట్టం మహిళలను ఏకాకులను చేసిన ఉదంతాలు అధికంగా కన్పిస్తున్నాయి. ధృవీకరణ పత్రాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళలు ఈ ప్రయత్నంలో చవిచూస్తున్న లైంగిక వేధింపులు అతిపెద్ద సమస్యగా మారింది. కరోనా మరణం క్షణాల్లో బతుకును తారుమారు చేస్తోంది. పనిచేసే చేయి విరిగిపోతే శరీరం పరిస్థితి ఎలా వుంటుందో అందరికీ తెలుసు. అలాగే ఇంట్లో యజమాని మరణిస్తే, ఇల్లాలు, పిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, కరోనా పరిహారాల చెల్లింపు విషయంలో ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం వుంది. ఒక ప్రాణం పోయినందుకు బాధ ఉండనే వుంది. కానీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు మిగిలిన ప్రాణాలకు ఉరితాళ్లుగా మారితే ఆ బాధ వర్ణనాతీతం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img