Friday, May 31, 2024
Friday, May 31, 2024

చట్టసభల తీరు మారాలి

ఐ.ప్రసాదరావు

ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక చట్టసభలు. మనదేశ పరిధిలో పార్లమెంటు, వివిధరాష్ట్రాల్లో శాసనసభలు, శాసనమండళ్ల్ల ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికోసం అనేక చట్టాలుచేస్తూ ఉంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రెండుదశాబ్దాలకాలంలో పార్లమెంటు, శాసనసభలు గౌరవప్రదమైన రీతిలో లోతైనచర్చలు జరిపి చట్టాలు తయారుచేసేవారు. ముఖ్యంగా ప్రతి పక్ష నాయకులు సూచించే మంచిసలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని చట్టాలు పకడ్బందీగా తయారుచేసేవారు. తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్‌కూడా వివిధ అంశాల్లో ప్రతిపక్షపార్టీల నేతలు ఇచ్చే సూచనలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతంచేస్తుంది. అయితే, ఇటీవలికాలంలో పార్లమెంటు సమావేశాలు, వివిధ రాష్ట్రాల శాసనసభల సమావేశాల్లో తరచూ ఘర్షణ వాతావరణం, వాయిదాలపర్వం కొనసాగుతోంది. కొన్ని ముఖ్యమైన బిల్లులు కూడా సరైన చర్చలు లేకుండా చట్టాలుగా రూపుదిద్దుకుంటూ, తరువాత కోర్టులచుట్టూ ప్రదక్షిణలుచేసే పరిస్థితి. ఎందుకు వస్తుందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆలోచనచేయాలి. దిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు చేసిన చట్టాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆయా గవర్నర్లు తొక్కిపెడుతూ ఇబ్బంది కలుగ చేస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే వైస్‌ ఛాన్సలర్ల నియామకాల్లో కూడా గవర్నర్లు తలదూరుస్తూ, కేంద్ర ప్రభుత్వ పరోక్ష సహకారంతో ముఖ్యమంత్రులను, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయా గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారు. రాజ్యాంగం-కోర్టుల మధ్య వివాదాలు పేరుకుపోతూ, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో (కేంద్రంలో కూడా) పాలకులు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా, పరిపాలనలో మాత్రం నియంతలుగా వ్యవహరిస్తూ, మనదేశ ప్రజాస్వామ్యవ్యవస్థకు పెను సవాల్‌గా మారారు.
ప్రస్తుతం మనదేశంలో జరిగే పార్లమెంట్‌ సమావేశాలకు సగటున ప్రతీ నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. అనగా ప్రజలనుంచి పన్నులురూపంలో కొన్ని కోట్లరూపాయలు వసూలు చేస్తూ, ఆ రాబడిలో కొంతభాగం వివిధ రకాల మంచి చట్టాలు తయారుచేసే నిమిత్తం చట్టసభలు సమావేశమవుతాయి. అయితే, ఈ చట్టసభలు చేస్తున్న చట్టాలు ఎంత పటిష్ఠంగా, ఉపయోగపడే విధంగా వస్తున్నాయో…? మనం చూస్తూనేఉన్నాం. దాదాపు ఇటీవలవస్తున్న చట్టాలు అన్నీ తరచూ న్యాయ స్థానాల ముందుకు వస్తున్నాయి. అనేక లోపాలుతో, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వస్తున్నాయి. చట్టసభల్లో సరైన చర్చలు లేకుండా మెజారిటీ ఉందని ఏకపక్షంగా చట్టాలుచేయడం ద్వారా సమస్యలు పెరుగుతున్నాయి. విద్యా విధానం-2020 చట్టమే తాజా ఉదాహరణ. కేవలం కేంద్ర కేబినెట్‌ ఆమోదంద్వారా విద్యాచట్టం చేయడం గమనార్హం…కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు, ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని చట్టాలు తాజా ఉదాహరణ…
రాజ్యాంగ సూచనలు ప్రకారం, ప్రతీ సంవత్సరం పార్లమెంట్‌ 120 రోజులు, రాజ్యసభ 100 సిట్టింగ్‌లు జరగాలి. ప్రజలకు అవసరమైన మంచి చట్టాలు తయారు చేయాలి. చర్చలు జరగాలి. విపక్షాలు సూచనలు సలహాలు అవసరమైన సందర్భాల్లో పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా చట్టాలు తయారుచేయాలి. అయితే ఇటీవల కాలంలో తరచూ చట్టసభల్లో గందరగోళం, వాయిదాలు, అరుపులు, కేకలు, సభలను స్తంభింపచేయటంతో విలువైన సభాసమయం వృధా అవుతోంది. చాలాసార్లు కేంద్రం ఇందుకు కారణం అవుతోంది. అవగాహన లేనివారు, ఎదుటివారి చెప్పే విషయాలు వంటపట్టించుకోనివారు ఎక్కువగా చట్టసభల్లో అడుగుపెట్టడం జరుగుతోంది. దీంతో సరైన పద్ధతిలో చట్టాలు తయారు కావడంలేదు. మంచి చట్టాలు తయారు చేయడానికి, సమస్యలు పరిష్కారం చేయడానికి రాజ్యాంగం పార్లమెంట్‌కు అనేక సదుపాయాలు కలుగచేసింది. జీరో అవర్‌, లఘు ప్రశ్నలు, జవాబులు, ప్రశ్నోత్తరాల సమయం ఇలా అనేక సౌకర్యాలు ఇచ్చారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు ఓరిమితో, అవగాహనతో చర్చలు చేయాలి. అప్పుడు మాత్రమే మంచి చట్టాలువస్తే ప్రజలకు, దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి.
చట్టసభలద్వారా మంచిచట్టాలు రావాలంటే ఇకనైనా కొన్ని నియమా లను పాటించడం మంచిది. ప్రజాప్రతినిధులు అందరూ సరైన అవగాహన కలిగిఉండాలి. పరుష పదజాలం, విద్వేష ప్రసంగాలు చేయరాదు. సభా నియమాలు పాటించాలి. గౌరవప్రదమైన ప్రవర్తన కలిగిఉండాలి. విపక్షాలు సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకోవాలి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించాలి. సమావేశాలకు డుమ్మా కొట్టరాదు. సమావేశాలను ఎడిట్‌ లేకుండా లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలి. అప్పుడు మాత్రమే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏమి చేస్తున్నారో ప్రజలందరికీ ప్రత్యక్షంగా తెలుస్తుంది. బాధ్యతగా ఉంటారు. పారదర్శకత తెలుస్తుంది. మంచి ప్రవర్తన, విజ్ఞానం కలవారు ప్రజాప్రతి నిధులుగా ఎన్నిక కావడం కోసం పార్టీలు, ప్రజలు అవకాశం ఇవ్వాలి. అవినీతి, బంధుప్రీతికి లొంగరాదు. నీతి, నిజాయితీలకు పట్టం కట్టాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యవ్యవస్థకు మంచిభవిష్యత్తు ఇవ్వగలం. ముఖ్యంగా వయో జనులు, పౌరులు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి…. ఓటు ద్వారానే ప్రజల తమకలలను, భవిష్యత్తును తీర్చుదిద్దుకో గలరు. భారత రాజ్యాంగ ఆశయాలను అందుకోగలం.
సెల్‌: 9948272919

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img