Monday, April 22, 2024
Monday, April 22, 2024

తొలి ఎయిర్‌ మెయిల్‌కు నూటపదేళ్లు!

సుమారు నూటపదేళ్ళ క్రితం కచ్చితంగా చెప్పాలంటే 1911 ఫిబ్రవరి 18వ తేదీన అలహాబాద్‌ నుంచి నైనికి బయలుదేరేందుకు విమానం సిద్ధంగా ఉంది. సుమారు పదిహేను కేజీల బరువున్న ఆరు వేల ఉత్తరాలు, పార్సిళ్లను రవాణా చేసేందుకు ఉద్దేశించిన ఆ విమానం తన పదునెనిమిది కిలోమీటర్ల గమ్యాన్ని ఇరవై ఏడు నిమిషాలలో పూర్తిచేసుకుని ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ మెయిల్‌ విమానంగా ప్రఖ్యాతి గాంచింది. భారతదేశానికి లభించిన ఈ పేరు ప్రఖ్యాతి వెనుక ఎన్నో ప్రస్థానాలతో కూడిన సుదీర్ఘ చరిత్ర ఉంది. తొలి టపాగా చెప్పుకునే పావురాల టపా క్రీస్తు పూర్వమే ప్రారంభమైంది. అశ్వ, కాలినడక తపాల రవాణా అల్లాఉద్దీన్‌ ఖిల్జీ హయాంలో 1296 ప్రాంతంలో ఆరంభమైంది. క్రమేపీ బాబర్‌ తదితరుల చొరవతో ఆ వ్యవస్థ సమాచారం చేరవేతలో గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ పూర్తిస్థాయిలో 1774లో కలకత్తాలో మొదటి పోస్టాఫీసును ఏర్పాటు చేసింది. 1854లో వచ్చిన ఇండియా పోస్టాఫీసు యాక్ట్‌తో ఈ వ్యవస్థకు చట్టబద్దమైన అండ లభించింది. చట్టం ఏర్పడిన అయిదారేళ్లకే పోస్టల్‌ మాన్యువల్స్‌ను ప్రచురించటంతో తపాలా శాఖకు పటిష్టత చేకూరింది. ఎన్వలప్‌ 1873లో ప్రవేశించగా, సామాన్యులకోసం అతి తక్కువ ధరకే పోస్ట్‌కార్డ్‌ 1879లో అందుబాటులోకి వచ్చింది. మొదటి స్టాంపు 1852లో, రెవిన్యూ స్టాంపు 1886లో పరిచయం కాగా 1935లో ఇండియన్‌ పోస్టల్‌ ఆర్డర్‌ వంటి వాటితో తపాల శాఖ ప్రజాసేవలో తన పరిధిని మరింత విస్తరించింది. 1882లో వచ్చిన పోస్టల్‌ సేవింగ్స్‌ అతి తక్కువ కాలంలోనే ఆకర్షణీయమైన, లాభసాటి పథకాలతో ప్రజలలోకి చొచ్చుకుపోయి భారతీయుల హృదయాలలో తపాలా శాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కారణభూతమైంది. తదుపరి ప్రపంచవ్యాప్తంగా తపాల వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు యానియన్‌ పోస్టల్‌ యానియన్‌ (యుపియు) ఏర్పడిరది. అది ఏర్పడిన రెండేళ్లకే యూనియన్‌లో మన దేశం ప్రధాన పాత్ర తీసుకున్నది. భారత ప్రతినిధి ఆనంద మోహన్‌ సూచన మేరకు 1962లో టోక్యోలో జరిగిన ఓ సమావేశంలో అక్టోబరు 9న ప్రపంచ తపాల దినంగా పరిగణించాలని యుపియు నిర్ణయించింది.
రానురాను మారుతున్న పరిస్థితులు, క్షణక్షణానికి కొత్త  యలు పోతున్న సాంకేతికతలు తపాలశాఖకు అనేకానేక సవాళ్లను విసరటం మొదలుపెట్టాయి. ఆదాయాన్ని పెంచుకునే దారి తెలియక కూడలిలో నిలబడి దిక్కులు చూసే పరిస్థితి భారత తపాలా శాఖకు ఏర్పడిరది. మెసేజ్‌లు, ఇమెయిళ్లు, వాట్సప్‌ల కాలంలో ఉత్తరాల చిరునామాయే కనిపించడం లేదు. బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ఫండ్స్‌ల ధాటికి సేవింగ్స్‌ పథకాలూ వెలవెల పోతున్నాయి. దీనికి తోడు రేయింబవళ్లు పనిచేసే కొరియర్‌ సర్వీసులు తపాలశాఖకు మరొక శిరోభారంగా తయారయ్యాయి. దీనిని గమనించిన తపాలా శాఖ సత్వరచర్యలు మొదలు పెట్టింది. సమాచార, పొదుపు వ్యవస్థల్లో త్వరితగతిన వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని రెండు మూడు దశాబ్దాల నుండి తనను తాను అప్‌డేట్‌ చేసుకుంటూ పాత ముఖచిత్రానికి కొత్త హంగులు దిద్దటం ఆరంభించింది. అందులో భాగంగా ప్రవేశపెట్టిన స్పీడ్‌ పోస్టు దినదినాభివృద్ధి చెందుతూ 2014 సంవత్సరంలో 788 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టింది. కేవలం నాలుగేళ్లకే అది 1682 కోట్ల రూపాయల స్థాయికి చేరింది. దీని స్ఫూర్తితో తపాలా శాఖ వరుస పథకాలతో తన దూకుడు పెంచింది. కేవలం ఆధార్‌ ఆధారంగా ఏ బ్యాంకు ఖాతా నుంచైనా నగదు విత్‌డ్రా చేసుకొన గలిగేందుకు ప్రవేశపెట్టిన ఎఇపియస్‌కు గ్రామీణ ప్రాంతాలలో విశేష ఆదరణ లభిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్న గ్రామీణ పోస్టల్‌ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ తపాలా శాఖకు అతి ముఖ్య ఆదాయ వనరుగా అభివృద్ధి చెందుతున్నది. వీటన్నిటినీ మించి 74 సేవలతో గ్రామీణ ప్రాంత పోస్టాఫీసు లలో పరిచయమవుతున్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ తపాల శాఖ తీరుతెన్నులను పూర్తిస్థాయిలో మార్చగలదన్న నమ్మకం కలుగుతున్నది. ఇవేగాక వీటిని మించిన పథకాలతో సాగుతున్న ప్రస్థానంలో కాస్త ఆగి కొన్ని విషయాలలో అంటే క్షేత్రస్థాయి కార్మికుల, వారిని పర్యవేక్షించే పైస్థాయి అధికారుల పరస్పర అనుసంధానం విషయంలో మరింత శ్రద్ధ వహించవలిసి ఉంది. ఈ పథకాల అమలుకు చాలినంత సిబ్బంది, వారికి ఈ పథకాలకు సంబంధించిన పరిపూర్ణ శిక్షణ, అడపాదడపా తగినన్ని ప్రోత్సాహకాలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. తపాలా శాఖలో ప్రవేశిస్తున్న విద్యాధికులైన యువతరం సహాయసహకారాలతో ఇప్పుడిప్పుడే ఈ అంశాల అమలుకు ప్రయత్నిస్తున్నది భారత తపాలశాఖ. అతి త్వరలో తన గమ్యాన్ని చేరుకుని లాభాల బాటలో ప్రయాణించి ప్రజాసేవలో గత వైభవ దీప్తులను పొందగలదని ఈ ప్రపంచ తపాలా దినం సందర్భంగా ఆశిద్దాం. (రేపు ప్రపంచ తపాలా దినం) ఆర్‌.వి. రాఘవరావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img