Monday, April 22, 2024
Monday, April 22, 2024

ప్రజా సేవకుడు మహబూబ్‌ ఆదం

మహబూబ్‌ ఆజం

బ్రిటిష్‌ ప్రభుత్వ పోలీసులు, గూఢచారుల దృష్టిలో పడకుండా ప్రజల్లోకి, ఉద్యమకారుల వద్దకు జాతీయోద్యమ కార్యకలాపా వివరాలను అతి రహస్యంగా తీసుకెళ్ళే సాహసోసేతులు, సమర్థులు స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతోమంది ఉండేవారు. అలాంటి కార్యకర్తలలో ఎన్నదగిన వారు షేక్‌ మహబూబ్‌ ఆదం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా రొంపిచెర్ల గ్రామంలో షేక్‌ శిలార్‌, జైనబ్బీలకు 1917లో డిసెంబరు1న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన తెనాలి పట్టణంలో అక్క, బావల ఇంట పెరిగారు. హైస్కూలు విద్యార్థిగా తెనాలిలో మహాత్మాగాంధీ మార్గానికి ఆకర్షితులై ఖద్దరు ధరించారు. మహాత్ముడు ఇచ్చిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, రాష్ట్రంలో రహస్యంగా రాజకీయ శిక్షణా తరగతుల నిర్వహణకు నాయకులు నడుం కట్టారు. ఈ మేరకు తెనాలిలో జరగనున్న రహస్య సభల సమాచారాన్ని జాతీయ కాంగ్రెస్‌ ప్రతినిధులకు చేరవేసి ప్రతినిధుల సమీకరణ కోసం తన గురువైన మంత్రవాది వెంకటరత్నం, సహ విద్యార్థులు టి. వెంకటేశ్వరరావు (విజయవాడ ప్రథమ మేయర్‌) రాజారావులతో కలిసి పోలీసుల కళ్ళు కప్పి, కాలి నడకన గ్రామాలు చుట్టేస్తూ మారువేషాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన షేక్‌ మహబూబ్‌ ఆదం విద్యార్థి దశలోనే ఎంతో పోరాట పటిమను ప్రదర్శించారు. గుంటూరు ఎ.సి. కాలేజీలో బి.ఎ. పూర్తి కాగానే విజయవాడలోని సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో హెడ్‌ క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు కానీ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ సేవల కన్నా ప్రజా సేవలో గడపటం మిన్నగా భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య మాటపై పూర్తికాలపు కమ్యూనిస్టుగా మారారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో చురుకైన పాత్ర నిర్వహించడంతో పోలీసుల నిర్బంధాలను, కడలూరు, రాజమండ్రి జైలులో జైలుశిక్షలకు గురయ్యారు. అప్పుడే పేరులోని కులానికి ప్రాతినిధ్యం వహించే ‘షేక్‌’ను బహిష్కరించి కేవలం మహబూబ్‌ ఆదంగానే స్థిరపడ్డారు. 1937లో కొత్తపట్నం, 1938లో మంతెనవారి పాలెం వేసవి రాజకీయ పాఠశాలల్లో పాల్గొన్నారు. మంతెనవారిపాలెం రాజకీయ పాఠశాలలో సుశిక్షితులైన తర్వాత ఆనాటి రాజకీయ అధ్యాపకులు, సహచరులెందరో మిత్రులయ్యారు. అప్పట్లో పార్టీ ఆదేశానుసారం ప్రముఖ పార్టీగా విరాజిల్లుతున్న ముస్లిం లీగ్‌లో చేరి ఆ పార్టీలోని స్థానిక కార్యకర్తలను వేర్పాటువాద భావాల నుంచి దూరం చేయడానికి ప్రయత్నించారు. స్వాతంత్య్రం వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్‌ జాతిపిత మహమ్మద్‌ అలీ జిన్నా, పండిట్‌ నెహ్రూ తదితర నాయకులను కలుసుకున్నారు. స్వాతంత్య్రానంతరం కమ్యూనిస్టుపార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న ఆదం పలుమార్లు జైలుశిక్షలు అనుభవించారు. ‘కనిపిస్తే కాల్చివేత’ ఆర్డర్స్‌ రావడంతో ప్యాంట్‌, చొక్కా వదిలి ఫుల్‌ చొక్కా, పంచెలతో వేషం మార్చి గుంటూరు జిల్లా కొండవీడు కొండల్లో దాదాపు రెండేళ్ళు అజ్ఞాతవాసం గడిపారు. ఆదం జీవితంలో ఎక్కువభాగం ప్రజా సంఘాలకే పరిమితం అయ్యారు. ఇస్కఫ్‌లో తన జీవితాంతం సేవలు అందించారు. ఎ.పి. ఇస్కఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఆదం ‘శాంతిస్నేహం’ అనే పత్రికకు ఎనలేని సేవలు అందించారు. 1973లో సోవియట్‌ యూని యన్‌లో పర్యటించారు. ఇస్కఫ్‌తో పాటు ఇండో`బల్గేరియా, శాంతి స్నేహం వంటి పలు సంఘాలలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. 1965లో పొన్నం వీర రాఘవయ్య, ఎల్‌.చిరంజీవిరావు, కొల్లి రామ కోటేశ్వరరావుల సహాయసహకారాలతో ఇస్కఫ్‌ తరపున రష్యన్‌ బోధనా సంస్థను విజయవాడలో ఏర్పాటు చేసి రష్యన్‌ భాషను నేర్పించారు. రష్యన్‌ రాయబారిని ఒప్పించి సినిమా ప్రొజెక్టర్‌ను తెప్పించి ఇస్కఫ్‌ తరపున వీది óవీధిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు ఇస్కఫ్‌ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలలో చైతన్యం తీసుకు రావడానికి ఎనలేని కృషి చేశారు. మహాశయుడు వి.ఐ.లెనిన్‌ కంచు విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేసేందుకు రష్యా నుంచి దాన్ని విజయవాడకు తెప్పించడంలో మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు, నగర పాలక సంస్థ సహాయసహకారాలతో అవిరళ కృషి చేశారు. దాన్ని విజయవాడలో ప్రతిష్టించడానికి ఇస్కఫ్‌ నుంచి కృషి సల్పారు. పాలస్తీనా సమస్యపై ఊరూరా ఉద్యమాలు నడిపారు. పాలస్తీనా నాయకుడైన యాసర్‌ అరాఫత్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి నిజాం కాలేజీలో గొప్ప బహిరంగ సభను జరిపిన ఘనాపాటి మహబూబ్‌ ఆదం. 1972లో స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయనను గుర్తించి గౌరవిస్తూ తామ్రపత్రం, రాజకీయ పెన్షన్‌, 10 ఎకరాల భూమి అందజేయడానికి అప్పటి ప్రధానమంత్రి ఆహ్వానించగా ‘‘దేశం కోసం పోరాడాం తప్ప తామ్రపత్రం ఇతర సదుపాయాల స్వీకరణకు కాదంటూ’’ ప్రభుత్వ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు మహబూబ్‌ ఆదం. అటు స్వాతంత్య్ర సమర యోధునిగా దేశం కోసం, ఇటు కమ్యూనిస్టుగా సామాన్య పేద ప్రజల కోసం జీవితాంతం శ్రమించిన ఆదం 1997 సెప్టెంబరు 7న కన్నుమూశారు.
(నేడు ఆదం వర్థంతి)
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్టు, 9959498786

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img