Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

బీజేపీ అసమర్థపాలనతో పెరిగిన సమస్యలు

డా. అఖిలప్రియ

దేశంలో పెరుగుతున్న అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, విభజన రాజకీయాలు, ప్రైవేటీకరణ, ఉత్పాదకత, ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, సమాజంలో సామరస్యత లోపించడం అభద్రతా భావంపై రాహుల్‌ గాంధీ పౌర ప్రజా సంఘాలతో కలసి ఫోకస్‌ పెడుతూ ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ సర్కారు తీరుపై అసంతృప్తితో ఉన్న సాధారణ ప్రజలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి స్పందన రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలో ప్రస్ఫుటమైనది. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో గరిష్ఠ నిరుద్యోగ రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జాబ్‌ మార్కెట్‌లోకి వస్తున్న కోట్లాది మంది యువతకు ఉద్యోగాలను కల్పించడం బీజేపీ సర్కార్‌కు ప్రధాన చాలెంజ్‌లుగా ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎక్కువగా ఎత్తిచూపుతోంది. దీన్ని మోదీ ప్రభుత్వ వైఫల్యంగా ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.
దేశంలోని మోదీ పాలన నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నది. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు, ప్రైవేటీకరణే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వడం వెరసి భారత్‌లో నిరుద్యోగం ఏటికేడూ పెరిగిపోతున్నది. ఈ సారికూడా భారత్‌లో గతేడాది డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు 8.30 శాతానికి పెరిగింది. ఇది 16 నెలల గరిష్టం కావడం గమనార్హం. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (సీఎంఐఈ) నుంచి వెలువడిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
సీఎంఐ సమాచారం ప్రకారం.. భారత్‌లో నిరుద్యోగ రేటు గతేడాది నవంబర్‌లో 8 శాతంగా ఉన్నది. అయితే, అది డిసెంబర్‌లో 8.30 శాతానికి పెరగడం గమనార్హం. ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగ రేటు నవంబర్‌లో 8.96 శాతం నమోదు కాగా.. అది డిసెంబర్‌లో 10.09 శాతానికి ఎగబాకింది. అయితే, గ్రామీణ భారతంలో మాత్రం నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. ఇది నవంబర్‌లో 7.55 శాతం నుంచి డిసెంబర్‌లో 7.44 శాతానికి పడిపోయింది. కాగా, డిసెంబర్‌లో పెరిగిన నిరుద్యోగ రేటు హర్యానాలో అధికంగా 37.4 శాతంగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్‌ (28.5 శాతం), ఢల్లీి(20.8 శాతం)లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా చదువుకున్న వారిలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. సెప్టెంబరు-డిసెంబర్‌ 2022లో ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 6.15 శాతంగా ఉంది. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారిలో నిరుద్యోగం రేటు అత్యధికంగా 35.1 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల్లో 73 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
సాధారణంగా భారతదేశంలో ఎక్కువ విద్యావంతులైన సమూహాలలో నిరుద్యోగం రేటు ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తాము. ఎందుకంటే విద్యావంతులు ఉపాధిని వెతుక్కునే అవకాశం ఎక్కువ. సాంకేతికంగా, విద్యావంతులు అధిక కార్మిక భాగస్వామ్య రేటును కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు ఎక్కువగా ఉండటం బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్‌ సమస్యలు చర్చనీయాంశమవుతున్న తరుణంలో దేశంలోని నిరుద్యోగం రేటు, కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ముందు నిరుద్యోగం 7శాతం ఆరు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం సమర్పించిన గణాంకాల ప్రకారం, తెలంగాణలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 5.2 శాతం, నగర నిరుద్యోగిత రేటు 10.2 శాతం, 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో మొత్తం నిరుద్యోగిత రేటు 7 శాతం ఉందని ఆవర్తన శ్రామిక శక్తి సూచిక చూపిస్తున్నది. మరోవైపు తెలంగాణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన నోటిఫికేషన్లు రద్దు చేయడం, జరిగిన పరీక్షలలో పేపర్‌ లీక్‌ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగి, ప్రజల ఆదాయ వనరులు తరుగుతున్నాయి. ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేటాయింపులు పడిపోతున్నాయి. రైతులు, ఇతర అన్ని తరగతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రజల అప్పులు పెరుగుతున్నాయి. శత కోటీశ్వరుల అప్పులు రద్దు అవుతున్నాయి.వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యలో ఉన్న కుబేరుల సంపద అంతు లేకుండా పెరుగుతున్నది ఎవరి మద్దతుతో ఇలా జరుగుతున్నది అనే సత్యం ప్రజలు తెలుసు కుంటున్నారు. రానున్న ఎన్నికల్లో విజ్ఞత కలిగిన ప్రజలు అవకాశవాద మతతత్వ పార్టీలకు బుద్ధి చెబుతారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img