Friday, May 31, 2024
Friday, May 31, 2024

మరో సాంస్కృతిక విప్లవం అవసరం

బండారు రాధాకృష్ణ

ప్రస్తుతం సంస్కృతి గురించి ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సంస్కృతికి నాగరికతకు తేడా తెలియని వ్యాఖ్యానాలు వింటున్నాం. సంస్కృతి మనిషి భావ సంస్కరణకు సంబంధించిందే కాని వేష భాషలకు సంబంధించింది కాదు. తరతరాలుగా మానవుని ఆలోచనలు మారు తూనే ఉన్నాయి. ఆ మారే భావాలు పురోగతి వైపా, తిరోగమనం వైపా అనేది ఆలోచించవలసిన విషయం. జరిగే మార్పు మంచికా, చెడుకా అనేది ముఖ్యం. మానవ సంక్షేమానికి అభ్యుదయానికి అనువైనది మాత్రమే సంస్కృతిగా పరిగణిస్తారు. ప్రాకృత భాషను సంస్కరించగా ఏర్పడిన భాష సంస్కృతం. ఆ సంస్కృత భాషలో ఎన్నో అభూత కల్పనలతో సాహిత్యాన్ని సృష్టించి సంస్కారానికి సీలు వేసి మనుషులను నాలుగు రకాలుగా విభజించి చాతుర్‌ వర్ణం పేరిట అంతరాలు పెంచారు. సాంస్కృతిక విప్లవం అంటే భావ విప్లవం తప్ప మరొకటి కాదని గుర్తించాలి. మను ధర్మం పేరిట మతాలను తద్వారా భావ దాస్యాన్ని పెంచి పోషించి మనిషిని పరాధీనుడుగా పాలకులు, పీఠాధిపతులు మారుస్తు న్నారు. జ్యోతిష్యాన్ని, మంత్ర తంత్ర మహిమలను దేవుళ్ల దర్శనానికి వెళుతున్న పాలకులు ముఖ్యంగా బీజేపీ నాయకులు పెంచి పోషిస్తున్నారు. మనిషి పుట్టు కకు ముందే ఉన్న పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశాలకు గ్రహా లుగా పేరుపెట్టి వాటి రహస్యాలు శోధిస్తూ చంద్రునిపై కాలిడి సూర్యుని పరిశోధించే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలించాలని మనిషి చేసిన దేవుణ్ణి కోరుకోవడం విచిత్రమే మరి.
మనిషి కట్టుబొట్టు, వేషధారణలు నాగరికతకు చెందినవే కాని సంస్కృతికి చెందినవి కావు. నాగరికత అంటే మనిషి జీవన విధానం. అవి పట్టణాలలో ఒక రకంగాను, పల్లెల్లో ఒక రకంగా ఉంటాయి. నగరాలలో నేడు విలసిల్లె అనాగరికమైనవి కూడ నాగరికతగా పరిగణిస్తున్నారు. తండ్రీ కొడుకులు కల్సి మద్యం సేవించడం కూడ నాగరికతగా మారింది. గతంలో కత్తులు, బల్లాలు వాడితే ఈనాడు ఆయుధాలు తయారు చేయడం నాగరిక మానవుని లక్షణంగా మారింది. గతంలో యజ్ఞాలకు పశువులను వధించేవారు. ఇప్పుడు పశువధ నిషేధం కోరుతున్నాం. ఆనాటి తుపాకులు నుండి ఈనాటి అణుబాంబుల వరకు ప్రజాస్వామ్యం పేరిట అధికార పీఠం కోసం ఆయుధాలను ఆట వస్తువులుగా మార్చారు. గతంలో రాజులవలె ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముసుగేసి యుద్ధ భేరీలు మోగిస్తున్నారు. శతాబ్ధి కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కోట్లాది మంది చనిపోయారు. ఎంతో సంపద, పశు నష్టం జరిగినా యింకా ప్రస్తుత నాగరిక ప్రపంచానికి జ్ఞానోదయం కాలేదు. ఈ రోజుకూ యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. సరిహద్దుల మధ్య తగాదా వస్తే అక్కడి ప్రజలే పరిష్క రించుకోవాలి. కాని సరిహద్దు దేశాలు యుద్ధ భేరీలు మోగిస్తున్నాయి. ప్రజా స్వామ్యంలో నశించాల్సిన సామ్రాజ్యవాదం ముదిరి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం అమానుషం. మరో యుద్ధమే వస్తే సర్వనాశనమై మిగిలిన అతి తక్కువ మంది తిరిగి ఆటవిక దశలోకి చేరుకోవలసి వస్తుంది. ఈ విషయంపై ప్రగతివాదులు మేధావులు ఆలోచించవలసిన సమయమిది. ప్రజాస్వామ్యంలో పాలనాధికారం ప్రజలకు అందనంత దూరంగా మారింది. దాంతో ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నియంతృత్వం అనుభవించక తప్పని పరిస్థితి. శాస్త్ర విజ్ఞానం పెరుగుతోంది కాని దాంతో పాటు తత్వ విచారణ పెరగటం లేదు. బతకడానికి ఉద్యోగం కోసం చదువుతున్నారు గాని జ్ఞానాభివృద్ధికి కాదు. మనుషుల మధ్య కుల మతాలు అడ్డుగోడలు పెరుగుతున్నాయి. దీన్ని విద్యా ధికులు సంస్కృతి సంస్కారం అనలేరు.
సమాజంలో మనుషుల మధ్య అవగాహన, సుహృద్భావన, పరస్పర సహకారం వల్ల ఒకరునొకరు గౌరవించుకోవడంతో శాంతియుత సహజీవనం సాగుతుంది. కాని ప్రస్తుత సమాజంలో అది కొరవడిరది. గతంలో ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రస్తుతం లంచం ఉద్యోగ లక్షణంగా మారింది. అవినీతిని అరికట్టకుండా పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు సంస్కృతి గూర్చి మాట్లాడుతారు. వివేకం పెరిగెే విద్యా విధానం ప్రస్తుతం లేదు. ఇప్పటికీ భారత, రామాయణాలకు సంబంధించినవి పాఠ్యపుస్తకాలలో పెట్టి విద్యార్థి దశ నుండే మూఢ నమ్మకాలలో ముంచడం భారతీయుల సంస్కృతిగా పేర్కొనడం విచార కరం. ప్రతి రాజకీయ నాయకుడు సమాజం మారాలంటాడు. ప్రజలు మార కుండా సమాజం ఎలా మారుతుందో అర్థం కాదు. ప్రజలే లేని సమాజానికి వారి విజ్ఞప్తులనుకోవాలి. గతంలో హరిదాసులు తాము చెప్పేది వినేవారికే గాని తమకు కాదనేవారట. అలా ఉన్నాయి మన నేతల నినాదాలు. అందుకే మనిషి సంస్కారవంతుడుగా మారాలి. మతపరమైన నాగరికత అందుకు అంగీకరిం చదు. మూఢాచారాలను వదిలి స్వతంత్రంగా ఆలోచించాలి. ఎంత కాలం పట్టినా సాంస్కృతికోద్యమకారులు అందుకు పూనుకోవాలి. మత సాహిత్యం, మూఢాచార ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అధికారం కోసం వాటిని రాజ కీయులు పెంచి పోషిస్తున్నారు. తమిళనాడులో రామస్వామి నాయకర్‌, మన త్రిపురనేని రామస్వామి, గురజాడ, రాజారామ్మోహనరాయ్‌, వీరేశలింగం చేసిన కృషి గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం పుష్కరాల పేరిట చేసిన హడావిడి ఫలి తంగా సంభవించిన మరణాలు గుర్తు తెచ్చుకోవాలి. ప్రగతివాద సాహిత్యవాదు లు పరాధీనుడైన బానిస మనస్తత్వంలో ఉన్న వారి కోసం రచనలు చేయాలి. ఇప్పటికీ విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలను మతం ఒప్పుకోదు. బానిసత్వం నుండి మనిషిని మార్చడానికి ప్రగతివాదులు ముందుకు రావాలి. మానవ జీవితంపై అడుగడుగునా మతప్రభావం పడుతూనే ఉంది. గతంలో ఉద్యమాలు, ధర్నాలు సామాజిక న్యాయం కోసం కాగా నేటి నాయకులు అధికారం కోసం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదో ఒక రకమైన ఆందోళన పరిపాటిగా మారింది. అంతరించి పోవలసిన మతం పునరుజ్జీవం కోసం కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది.
శాస్త్ర విజ్ఞానానికి చుక్కెదురైన జ్యోతిష్యం, వాస్తు, పౌరోహిత్యం కోర్సులు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేశ పెడుతుంటే సమాజం ముందుకా, వెనక్కా అనే ఆవేదన కలుగుతోంది. వాటివల్ల విద్యార్థులు ప్రశ్నించడం మానివేసి వాటిని అనుసరించి ఆచరిస్తున్నారు. ప్రజల్లో అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని దొంగబాబాలు పెరిగిపోయి భక్తి పేరిట దోచుకోవడమేకాక మానభంగాలకు వెనుకాడటం లేదు. అటువంటి బాబాల దగ్గర ఆశీస్సుల కోసం ప్రజాప్రతినిధులు క్యూ కట్టడంతో పాటు ప్రజల ఆస్తులు వేలాది ఎకరాలు వారికి ధారాదత్తం చేస్తున్నారు. ఇటీవల అతి ఘోరమైన దేరాబాబా వికృత చేష్టలు చూశాం. మూఢాచారాలను ప్రశ్నించిన సంస్కర్తలను అతి ఘోరంగా చంపుతున్నారీ మతవాదులు. కల్బుర్గీ, పన్సారే, గౌరీ లంకేష్‌ హత్యలే అందుకు నిదర్శనం. ఏది సంస్కృతో ఏది కాదో విద్యార్థులకు తెలియపరచాలి. ప్రస్తుతం హేతుతత్వం అణగారిన దశలో ఉంది. దాన్ని మేల్కొలిపి ప్రతి వ్యక్తికి ప్రశ్నించడం నేర్పాలి. తద్వారా వివేకవంతుడవుతాడు. కాబట్టి అందుకనుగుణమైన కార్యచరణ ప్రగతిశీలురు చేపట్టవలసిన అవసరం ఉంది. 50 ఏళ్ల క్రిందట కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన సాంస్కృతిక విప్లవం గుర్తుకు తెచ్చుకుని ముందుకు సాగవలసిన అవసరం ఉంది. మరో సాంస్కృతిక విప్లవానికి సమయం ఆసన్నమైంది.
వ్యాస రచయిత సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img