Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

మహోదయపు దీప్తి – మహాత్ముని స్ఫూర్తి

వి.యస్‌.ఆర్‌.యస్‌. సోమయాజులు

భారతీయులకు చరిత్రలో తరాలకు తరగని మహోన్నత సంస్కృతి వారసత్వ సంపదలు. పురాణేతిహాసాలు, భిన్నత్వంలో ఏకత్వం, నాగరికతలున్నాయి. చారిత్రక యుగాలు నాటి నుండి వర్తమాన కాలం వరకు వారివారి ప్రతిభావ్యుత్పత్తులను మేధోశీలత, త్యాగగుణ సంపన్నతలు తమ ముందు తరానికి అందించిన మహనీయులెందరో ఉన్నారు. అలాంటిజాతి జాగృత వైతాళికులమహోదయం, వైతాళికోద్యమం జాతిపితగా మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీకి దక్కింది. భారతదేశం స్వాతంత్య్ర సముపార్జనలో సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీర్చిదిద్దినారు. ఆనాటి జాతిపిత స్ఫూర్తి మహోన్నతమైనది. సత్యం, అహింస, శాంతి ప్రబోధాలు తన నిత్యసత్యకర్మాచరణలకు ఆలంబనలు. గాంధీ ఒక రకంగా నిత్యసత్యవ్రతుడు.
మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటానికి దివ్య చరితునిగా నిలవడానికి సల్పిన అవిరళ కృషి ప్రశంసనీయం. అహింసా మార్గంలోనే జాతిని నడి పించిన ‘‘జాతిపిత’’ సార్ధకనామమయ్యింది. మనిషిని మనిషిగా గుర్తించా లంటారు. మానవీయతే మతమనిచాటారు. గాంధీఆలోచనలను, ఆశయాలనే ఆచరణయోగ్యంగా అభ్యుదయం వైపు నడిపిచిన యోగి గాంధీజి తెల్ల దొరలను తరిమి కొట్టేందుకు ఉప్పు సత్యాగ్రహం, దండి పాదయాత్ర, స్వదేశీ వస్తు ఉత్పత్తులు, గ్రామ స్వరాజ్యం కుటీర పరిశ్రమలు వంటి ఎన్నో ఉన్నాయి. మహాత్మాగాంధీ గురించి ‘ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌’ యిలా అన్నారు. ‘‘రక్తమాంసాలు గల ఇలాంటి వ్యక్తి భూమి మీద నడియాడారంటే ముందు తరాల వారు నమ్మలేరు’’. బాపూజిని స్మరిస్తూ దేశ మహోన్నతంగా దేశాభివృద్ధికి శ్రమించాలి. ఆధ్మాత్మిక జీవితంలో తత్త్వ బోధనకు సర్వమత సారాల్ని గాంధి గ్రహించారు. క్రీస్తును ఉత్తమ పవిత్ర నామ సంరక్షక బోధనాచతురునిగా భావించారు. దానికి తన గ్రంధ పఠన అనుభవం ఆధారం. అన్ని మతాలవారు ఇతర మతాల స్వారస్యాన్ని గ్రహించ గల మన్నారు. ఎవరైనా నీకు మంచినీరు ఇచ్చినపుడు వారికి తిరిగి ఆ నీరే ఇస్తే సరిపోదు. వారికి చెడు చేయకుండా మంచి చేయడం కావాలి. తత్వవేత్త టాల్‌ స్టాయ్‌ అన్నట్లుగా ‘‘ప్రేమ రాజ్యం – రాజ్యాధికారం రాజునకు గల ప్రేమతత్వం నీలో మూర్తి భావించాలి’’. సరైన ఆత్మ పరిశీలనతోనే స్వీయ విజ్ఞానం సాధించగలవని బలంగా విశ్వసించారు. హరిజన పత్రికలో ఇలా అంటారు. ‘‘మనుగడలో మానవీయతను అన్ని విధాలా చాటే మతాలు – వాటి నీతిరీతులు-ఋజువర్తనగల మతవిశ్వాసాలు,ఆచరణలో క్రియాశీలకంగా మనిషిలో వివేక జ్ఞానాలకు ప్రాదు కొల్పుతాయి’’. ఒక మంచినీటి కుండ లోని నీరు ఆరోజుకి సరిపోతుంది. కాని ప్రేమతో ఏవరికైనా శుభాకాంక్షలు చెబితే అది మీ ఆకాంక్షల్ని ఎదుటివారిలో నీ పట్ల కృతజ్ఞులై ఉండేట్లు చేస్తుంది. ఒక పైసా సహాయం ఇస్తే చాలు అది నీకు బంగారం కానుకగా తిరిగి చేరుతుంది. అలా చేరవచ్చునన్నగుణం వితరణశీలతకు ముఖ్యం.
శారీరక, మానసిక చింతనకు తన ఆశ్రమ దీక్ష ఎక్కువగా సాధ్యపడిర దని గాంధీ భావించారు. ఆ విధి విధానం ఎన్ని రోజులైనా సరే తన అనుభూతిని శాంతి ఆచరణ రూపంలో కనిపిస్తుంది. అస్థిర పరచకుండా చిత్త చాంచల్యం కలగని మనో చింతనను స్వావలంబన చేసుకోవడంలో కృతకృత్యుల్ని చేస్తుంది. బయట ఎన్ని ఆటంకాలు ఎదురైన తన దరికి చేరనీయని ప్రశాంతచిత్తం వదనం అవసరం. ఆశ్రమవాసంలో సాధ్య పడిరదని తెలిపారు. ఎవరైనా సేవను ఒక ఆయుధంగా చేసుకున్న నాడు సేవలో కలిగే ఆనందం పొందుతారన్నారు. అదే ప్రతిఫలా పేక్షలేని ఆనందాలను భూతివరమౌతుందన్నారు. సమన్వయ దృష్టిని సారించి సాగించాల్సి ఉంటూ సంకుచితంగా ఆలోచనలేకుండా ఆత్మగతం – మనో నేత్రంతో చూసినప్పుడే నిజమైన మానవ సేవా భావం దర్శించగలమన్న ఉద్భోదన మానవాళికి మనుగడకు తోడవుతుంది. అవలంబించిన అన్నిమతాల సారమొక్కటే. ఒక ఆలోచన సాకారం కావడానికి చేసే ప్రయత్నం, లక్ష్య సాకార సాదృశ్యాలవుతుండాలి. ఈ విషయంలో శాస్త్ర విజ్ఞానం పై నమ్మకం గల వైద్యుడు, శాస్త్రాన్ని నమ్మే ఆచార్యులు మత భావనల పట్ల వారి వారి విశ్వాసాలను వేరువేరుగా ప్రకటిస్తూనే ఉండడం మౌలికంగా ఆక్షేపణీయం కాదు.
మన జీవన విధానమే మనకు ఆదర్శం. మనం చెక్కు చెదరని భావనా బలంతో నడవగలిగినప్పుడు ఆ మార్గంలో బైబిల్‌, ఖురానా, గీతల సారాంశం మిళితమైనప్పుడు అది సర్వకాలీన సార్వజనీన సందేశాత్మకమైన జీవనానందన్నిస్తుంది. సంశయాల్నించి దూరం చేస్తుంది అని అన్నారు.
ఒక వ్యక్తి సామాజిక న్యాయాలను చట్టాలను పట్టించుకోకుండా అసామాజిక తత్వాన్ని అనుసరించినా అది సమాజానికి హానికరమే. ఒక ఆదర్శ జీవిగా మన్ననలు పొందాలి. నిజ ప్రమాణాలకు నిల్చేలా ప్రేమ, కరుణ, దయ, దాన గుణం అలవర్చుకోవాలి. ఇంద్రియ సుఖాలను పరి త్యజించాలి. అలా శరారాన్ని, బుద్ధిని, మనసుని, ఆత్మలను కాపాడుకోగలిగినాడు – స్థిరమైన, ఆదర్శమైన పవిత్ర జీవనం వ్యక్తిత్వం నిలబడతాయంటారు. మనం ఏ ధర్మాలను నమ్ముకున్నా నైతిక విలువలు పాటించడం సర్వజనహితంగా జీవనం గడపటం ముఖ్యమని మహాత్ముని గ్రంధాలు అనేక భాషలలో వెలువడిచాటాయి. మతాల మౌలికత్వం – ప్రపంచ వ్యవస్థ పోకడలను సమబుద్ధితో ఆలోచించిన మేధావి గాంధీ.
వ్యాస రచయిత ఫోన్‌ : 9441148158

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img