Friday, May 31, 2024
Friday, May 31, 2024

యూరప్‌లో బలపడుతున్న వామపక్షం

సాత్యకి చక్రవర్తి

అట్టడుగు స్థాయిలో, మున్సిపాలిటీల్లో ప్రజల డిమాండ్లను తీర్చేందుకు గట్టి కృషి చేయడం ద్వారా మాత్రమే వామపక్ష రాజకీయాలు పురోగమించగలవనే విషయాన్ని ఈ ఎన్నికల్లో విజయం రుజువు చేస్తోందంటున్నారు ఆస్ట్రియా కమ్యూనిస్టు నాయకులు. ఇది సుదీర్ఘ కాల ప్రక్రియ అయినప్పటికీ ఈ గట్టి కృషి ఫలితం మనకు జాతీయ స్థాయిలో కనిపిస్తుందని చెబుతున్నారు.

యూరప్‌లో వామపక్షం బలపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. ఈ ఖండంలోని అనేక దేశాల్లో నూతన వామపక్ష గాలులు విస్తరిస్తు న్నాయి. ఈ క్రమంలో జర్మనీ, నార్వే, బెల్జియంల్లో స్థానికం నుంచి జాతీయ స్థాయి వరకూ ఎన్నికల్లో వామపక్షాలకు ఇప్పటికే సానుకూల ఫలితాలు రాగా ఇప్పుడు ఈ జాబితాలోకి ఆస్ట్రియా చేరింది. ఆస్ట్రియాలో వియన్నా తర్వాత రెండో అతి పెద్ద నగరంగా ఉన్న గ్రజ్‌లో ఆదివారం జరిగిన మేయర్‌ ఎన్నికల్లో ‘ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ (కెపిఒ)’కి అనుకూలంగా ప్రజాతీర్పు వెలువడిరది.
ఆస్ట్రియాలో కరుడు గట్టిన మితవాద పార్టీ అధికారంలో ఉంది. యుద్ధా నంతర కాలంలో ‘రెడ్‌ వియన్నా’గా పిలిపించుకున్న వియన్నాలోనూ ప్రస్తుతం సంప్రదాయవాదులు తిష్ట వేశారు. అయినా ఆస్ట్రియా కమ్యూనిస్టులు గ్రజ్‌లో పాగా వేయగలిగారు. ఇతర వామపక్ష కూటములకు చెందిన సోషలిస్టులతో కలిసి స్థానికంగా పనిచేయడం ద్వారా ప్రజాదరణ చూరగొన్నారు. మేయర్‌ ఎన్ని కల్లో విజయం సాధించడం ద్వారా సంప్రదాయ ఆస్ట్రియా పీపుల్స్‌ పార్టీ (ఒవిపి)ని గట్టి దెబ్బ కొట్టారు. ఆస్ట్రియాలో వామపక్ష రాజకీయాలకు వియన్నా నిరాశ కల్పిస్తున్న దశలో గ్రజ్‌ ఈ ఏడాది ‘రెడ్‌ సిటీ’గా మారింది. గ్రజ్‌ ఎన్నికల్లో వామపక్షం విజయం సాధించడం వెనక రాబర్ట్‌ క్రోట్జర్‌ (34) లాంటి యువకులు చాలామంది ఉన్నారు. గ్రజ్‌లో 2017లో జరిగిన సెనేట్‌ ఎన్నికల్లో గెలుపొందిన అతి పిన్న వయస్కుడిగానూ క్రోట్జర్‌ రికార్డు సృష్టించారు. కమ్యూనిస్టు ఉద్యమం సంక్షోభంలో ఉన్న 1990వ దశకం ప్రారంభ కాలంలోని రాజకీయ ధోరణులను గ్రజ్‌ ఎన్నికల విజయం గుర్తు చేస్తోందని అమెరికా మ్యాగ్‌జైన్‌ జాకోబిన్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రోట్జర్‌ పేర్కొన్నాడు. ప్రజల నిత్య జీవిత సమస్యల పరిష్కారంతోపాటు శ్రామికోద్యమ డిమాండ్లపై పోరాడడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళగలిగామని చెప్పారు. భారీగా పెరిగిన ఇంటి అద్దెలపై చేసిన ముమ్మర ఉద్యమం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. నగర కౌన్సిల్‌లో దీనికి సంబంధించిన బిల్లుతో పాటు ప్రజా సమస్యలపై ఇంకా అనేక బిల్లులను కెపిఒ ప్రవేశపెట్టిందని చెప్పారు. వేలాదిమంది సంతకాల సేకరణతో మళ్ళీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఏకగ్రీవంగా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడిరదని వివరించారు. 1998 తర్వాత కెపిఒ మంచి ఓటింగ్‌ శాతాన్ని సాధించిన తొలి ఎన్నికలు ఇవే.
వామపక్ష రాజకీయాలకు ఓర్పు అవసరమని, దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనితనం ముఖ్యమనే విషయాన్ని ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయని కెపిఒ నాయకుడు పేర్కొన్నారు. కెపిఒ పాలక కూటమి పార్టీల్లో ఒకటిగా ఎప్పుడూ లేకపోయినప్పటికీ ఈ పార్టీ 1998 నుండీ సిటీ ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతలు నిర్వహిస్తూనే ఉందని వివరించారు. పార్టీల ఓటు శాతం ఆధారంగానగర సెనేట్‌ సీట్లు కేటాయింపు కారణంగా ఇది సాధ్యమైంది. గత నాలుగున్నరేళ్ళుగా మితవాద కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ కెపిఒ ప్రజాప్రతినిధులు విజయవంతంగా కొనసాగుతున్నారు.
కెపిఒ పాలనలో కొత్తగా సైకిల్‌ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజా రవాణాను మెరుగుపర్చారు. నూతనంగా బస్‌ లైన్లను తీసుకొచ్చారు. పార్టీ మంత్రి గ్రజ్‌ను సంక్షేమ నమూనాగా తీర్చిదిద్దారు. నగరంలో సాయం అవసరమైన వృద్ధులు నర్సింగ్‌ హోమ్‌లకు వెళ్ళే పని లేకుండా ఇళ్ళ వద్దకే ఆ సాయం అందేలా చేసారు. వైద్య విభాగం అధిపతిగా ఉన్న క్రోట్జర్‌ కొవిడ్‌ కాలంలో ప్రజలు గుర్తించదగిన స్థాయిలో సేవలు అందించారు.
వామపక్ష రాజకీయాలు కింది స్థాయి నుంచి మెరుగు పడాల్సిన అవసరం ఉంది. అంటే మున్సిపాలిటీలు అంతకంటే కింది స్థాయి నుంచి పురోగతి సాధించాలి. ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండాలి. ఈ విషయాల్లో వర్కర్స్‌ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపాలిటీలు, అంతకంటే కింద స్థాయిలో వామపక్ష రాజకీయాలు విజయవంతమైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఒక ఉదాహరణ చూస్తే పోర్చుగల్‌లో అలెన్‌తేజో, ఇక్కడ 1974లో విప్లవం తర్వాత నుంచి పోర్చుగీసు కమ్యూనిస్టు పార్టీ పాలన సాగిస్తోంది. అలాగే గ్రీసులో పేమ్‌ (కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘం).
ఇప్పుడు అత్యంత ఉత్కంఠ కలిగించే తాజా పరిణామం ఏమంటే బెల్జియంలో వర్కర్స్‌ పార్టీ విజయం. ఈ పార్టీ క్షేత్రస్థాయిలో తన మూలాలను పటిష్టపర్చుకుంది. రెండేళ్ళ క్రితం 2019లో జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించడానికి ముందు మున్సిపల్‌ రాజకీయాల్లో ఈ పార్టీ ఒక పెద్ద శక్తిగా అవతరించింది. ఈ విజయం నిజంగా అత్యంత ప్రభావితమైనది. స్థానిక మూలాలు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.
అట్టడుగు స్థాయిలో, మున్సిపాలిటీల్లో ప్రజల డిమాండ్లను తీర్చేందుకు గట్టి కృషి చేయడం ద్వారా మాత్రమే వామపక్ష రాజకీయాలు పురోగమించగలవనే విషయాన్ని ఈ ఎన్నికల్లో విజయం రుజువు చేస్తోందంటున్నారు ఆస్ట్రియా కమ్యూనిస్టు నాయకులు. ఇది సుదీర్ఘ కాల ప్రక్రియ అయినప్పటికీ ఈ గట్టి కృషి ఫలితం మనకు జాతీయ స్థాయిలో కనిపిస్తుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img