Friday, May 3, 2024
Friday, May 3, 2024

అసాధారణ వాతావరణ మార్పులకు కారణమేమి..?

` మధుపాళి
హైదరాబాదు మహానగరంతో పాటు తెలంగాణలో అనేక జిల్లాలు, ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు అసాధారణ చలి గాలులతో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌ కన్న తక్కువగా నమోదు కావడం, ఉషోదయాన మంచు దుప్పట్లు కప్పడం లాంటి ప్రతికూల వాతావరణ మార్పులతో జనం గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణ మార్పులకు మూలాలుగా సహజ కారణాలతో పాటు మానవ- ప్రమేయ కారణాలు కూడా తోడయ్యాయని పర్యావరణ నిపుణులు వివరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో వాతావరణ ప్రతికూల మార్పులు క్రమంగా పెరగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా వేడిగా ఉండే దక్షిణ భారత రాష్ట్రాల్లో నేడు అసాధారణ అతిశీతల గాలులతో ఎముకలు కొరికే చలిలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాజెంద్రనగర్‌లో 7.8 డిగ్రీ సెల్సియస్‌, సికింద్రాబాదులో 8.9 డిగ్రీలు, అల్వాల్‌లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతారణ శాఖ హైదరాబాదు నగరంలో ‘‘ఆరెంజ్‌ అలెర్ట్‌’’ హెచ్చరిక చేసే వరకు పరిస్థితులు దిగజారడం జరిగింది. ఉత్తర మైదాన హిమాలయన్‌ శీతల పవనాలకు తోడుగా ఈశాన్య ప్రాంతాల నుంచి శీతల పవనాలు కూడా వీచడంతో నేడు తెలంగాణతో పాటు దక్షిణ భారతం తీవ్ర చలితో ముసుగేసి పడుకుంది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాలు, జంట నగరాల్లో మరి కొన్ని రోజులు ఇలాగే చలి గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. మానవ ప్రమేయ వాతావరణ మార్పులే ఈ శీతల గాలులకు కారణమని నిపుణులు వివరిస్తున్నారు. గతంలో ఇలాంటి ఉత్తర భారత మైదాన హిమాలయన్‌ పవనాలను దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు అడ్డుకునేవి. నేడు ఆధునిక డిజిటల్‌ యుగపు మానవుడు అనాలోచితంగా, విచక్షణారహితంగా, అవగాహన లేమితో, స్వార్థ చింతనతో అడవులను నరికి వేయడం, గ్రానైట్‌ వ్యాపార నెపంతో కొండలను, గుట్టలను మింగేయడంతో శీతల పవనాలు నేరుగా, వేగంగా దక్షిణ భారతాన్ని కమ్మేస్తున్నాయని వివరిస్తున్నారు. ప్రతి ఏట జనవరి మాసంలో హైదరాబాదు నగరంలో చలి గాలులు వీచేవని, నేడు రుతు మార్పులు జరిగే సంధి కాలంలో ఇలాంటి అతి శీతల వాతావరణం అనుభవంలోకి వస్తున్నట్లు తెలుపుతున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రకటించే ‘‘ఆరెంజ్‌ అలర్ట్‌’’తో ప్రజలు అసాధారణ ప్రమాదకర వాతావరణ మార్పులను తట్టుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలని, పొగ మంచు లేదా ఫాగ్‌ కమ్మేయడంతో రోడ్లు మసకబారి దారులు కనిపించవని, ట్రాఫిక్‌ కదలికలు మందకొడిగా ఉంటాయని అవగాహనకు రావలసి ఉంటుంది. హైదరాబాదు ప్రాంతంలో 2022లో రుతుపవనాలు అక్టోబర్‌ వరకు కొనసాగడంతో హరిత పరిసరాలు పెరగడం, చలి కాలం నవంబర్‌ చివర నుంచి ప్రారంభం కావడంతో ఫిబ్రవరి మాసంలో కూడా అసాధారణ అతి శీతల పవనాలు వీచడం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. శాస్త్రసాంకేతిక అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్న నవ్య నరుడు అతి తెలివి, అజ్ఞానం, అవగాహనలేమి, స్వార్థ వ్యాపార లాభాపేక్ష ఆలోచనలతో అడవులను నరకడం, పోడు సాగు కోసం హరిత వనాలను తొలగించడం, గ్రానైట్‌ వ్యాపారం పేరుతో గుట్టలు/ బండలను మింగే బకాసురులు పుట్టుకురావడం, గ్రానైట్‌ వ్యాపారులే రాజకీయ నాయకులుగా అవతారమెత్తడం, పారిశ్రామిక కాలుష్యం పెరగడం లాంటి అనేక కారణాలతో వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుం టున్నాయని తెలుసుకోవాలి.
ప్రకృతి మాతను పరిరక్షించుకుంటేనే మనిషి మనుగడ సాధ్యమని మరిచిన నడవంత్రపు నరుడు రాబోయే తరాల ఆవాసాలను నరక కూపాలుగా మార్చడం జరుగుతున్నది. అతి తెలివితో తాను కూర్చున్నా కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. తెలివి పెరిగిన కొద్దీ విచక్షణ తరుగుతోంది. తాను తొవ్విన గోతిలో తానే పడేందుకు సిద్ధం అవు తున్నాడు. అంతరిక్ష రహస్యాలను ఛేదించినా, ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చినా, సముద్ర లోతులను అన్వేషించినా తాను నేల మీద నిలకడగా నిలబడడం మరిచి కాలుష్య కత్తితో సాము చేస్తున్నాడు. ఇప్పటికైన వెంటనే కళ్లు తెరిచి దీపం (సానుకూల వాతావరణ మార్పులు) ఉండగానే ఇల్లును (భూమాతను) చక్కదిద్దుకోవాలి. రాబోయే తరానికి ఆస్తుల కన్న ముందు నివాసయోగ్య భూమాతను అమూల్య బహుమతిగా అందించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img