Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆదివాసీలపై పాలకుల కుట్ర

చత్తీస్‌గఢ్‌ బస్తర్‌లోని బీజాపూర్‌ జిల్లా ఆదివాసీ (మూలవాసులు)లపై భద్రతా దళాలు ఏప్రిల్‌ 7న వైమానిక బాంబు దాడులు చేయడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మోర్కెమెట్ట కొండల్లో ఉన్న నాలుగు గ్రామాలపై భారత వైమానికదళం అనధికారికంగా ఆదివాసీలపై పదేపదే బాంబు దాడులను చేయడం కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న బీభత్సంలో కొత్త కోణం. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించిన ఈ బాంబు దాడి జరిగిన వెంటనే, ప్రభుత్వ బలగాలు వారి సాధారణ కార్యకలాపాలకు వెళుతున్న గ్రామస్తులపై భారీ మెషిన్‌గన్‌తో కాల్పులు జరిపేందుకు మూడు హెలికాప్టర్లను మోహరించారు. అయితే ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఒక వ్యక్తికి అనేక గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన ఆదివాసీ ప్రజలలో భయాందోళనలను సృష్టించి, వారు గ్రామాలను విడిచిపెట్టేలాచేసి మైనింగ్‌ కార్పొరేషన్‌లకు ఆ ప్రాంతాలను కట్టబట్టే ప్రభుత్వ ప్రయత్నంలో భాగం. గతంలో మాదిరిగానే, పోలీసులు ఈ ఆరోపణలు అవాస్తవమని, స్థానికులను ‘‘తప్పుదోవ పట్టించే’’ ప్రయత్నం జరుగుతోందని అసలు వాస్తవాలను మరుగుపరుస్తున్నారు.
‘‘మేము తెల్లవారుజామున మహువ (వనమూలికలు) సేకరించడానికి బయలుదేరాము, అకస్మాత్తుగా పై నుండి డ్రోన్‌ వచ్చి మాపై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు…’’ ‘‘సర్కార్‌ మా నుండి ఏమి కోరుకుంటున్నది, మేము అడవుల్లో నివసించే ప్రజలం, సర్కార్‌ మాపై ఈ దాడులు ఎందుకు చేయిస్తున్నారు? మమ్మల్నందరినీ ఇక్కడి నుంచి తరిమికొట్టిన తర్వాత సర్కార్‌ ఏం చేస్తుంది? ఇప్పుడు అడవిలోకి వెళ్లాలంటే మాకు భయంగా ఉంది. ఆకాశం నుంచి డ్రోన్‌ల దాడులు జరుగుతుంటే, అడవిలోకి వెళ్లేదెవరు? ఇక్కడ గ్రామాల్లో నివసించేందుకు కూడా భయంగా ఉంది…’’ అని గ్రామస్థులు వాపోయారు.
ఏప్రిల్‌ 7న జరిగిన దాడి గత మూడేళ్లలో జరిగిన నాల్గవ వైమానిక దాడి. ఇంతకు ముందు ఇదే జిల్లాలో 11 జనవరి, 2023న వైమానిక దాడులు జరిగాయి. కో ఆర్డినేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఆర్‌ఓ) ద్వారా ఏర్పాటు చేసిన నిజ-నిర్ధారణ బృందం దాడులు జరిగిన ప్రదేశాలను ఆ నెలలో సందర్శించకుండా నిరోధించడంతో మార్చి 2023లో బాంబు దాడులు జరిగిన గ్రామాలను సందర్శించి, ఈ దాడులకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను సేకరించింది. ‘‘నక్సల్స్‌’’ను తుదముట్టించే కార్యక్రమంలో భాగంగా మధ్య భారత్‌లోని అడవుల నుంచి ఆదివాసీలను తొలగించే వ్యూహంతో ఒక దశాబ్ద కాలం నుంచి సైనిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆదివాసీలపై జరిగిన తాజా దాడి, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా జరుగుతున్న ఆపరేషన్‌ ‘సమాధానన్‌-ప్రహార్‌’. 2017లో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌, ఆదివాసీలపై సాల్వజుడుమ్‌ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ను తలపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఇది చట్టవిరుద్ధమని ప్రకటించడంతో సాల్వజుడుం నిలిపివేయడమైంది. ఆదివాసీలకు చెందిన భూమిలో అతి విలువైన ఖనిజాలు ఉండటంతో కార్పొరేట్లు తమ వ్యాపారాల కోసం ఈ భూములను ఆక్రమించేందుకు కుట్ర పన్నుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కార్పొరేట్లు ఆదివాసీలకు చెందిన భూమిని బుల్‌డోజర్లతో చదునుచేసి ఆదివాసీల జీవనోపాధిని కొల్లగొడుతున్నారు. అయితే ఆదివాసీలు తమ పూర్వీకుల భూమి కబ్జా కాకుండా ప్రభుత్వంతో పోరాడుతూనేఉన్నారు. మైనింగ్‌ కార్పొరేషన్‌లు ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించడాన్ని భద్రతా బలగాలు సమర్థించడంతో ఆదివాసీలు, కార్పొరేట్‌ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ ప్రతిఘటనల్లో వందలాది మంది ఆదివాసీలు బూటకపు ఎన్‌కౌంటర్‌లలో హతులయ్యారు. మహిళలపై లైంగిక హింసకు పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఆదివాసీలపై జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన సామాజిక కార్యకర్తలు కూడా జైళ్ల పాలయ్యారు. ప్రొఫెసర్‌ జి ఎన్‌ సాయిబాబా, పాండు నరోటే, మహేష్‌ తిక్రీ, హేమ్‌ మిశ్రా, ప్రశాంత్‌ రాహి, విజయ్‌ టిక్రిలు మార్చి 2017 నుండి నాగ్‌పూర్‌ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాండు నరోటే జైలులోనే మరణించారు. జి ఎన్‌ సాయిబాబా తన జీవితాన్ని ఆదివాసీలు వారి భూమి హక్కుల పరిరక్షణకోసం పోరాటం చేశారు. భీమా కోరేగావ్‌ కేసులో పదహారు మంది ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను 20182020 మధ్య అరెస్టు చేశారు.. వారిలో ఒకరైన, ఆదివాసీ భూమి హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఫాదర్‌ స్టాన్‌స్వామి 5 జూలై 2021న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపట్టిన వైద్య నిర్లక్ష్యం కారణంగా జైలులో మరణించారు. అనంతరం జరిగిన పోరాటంలో ముగ్గురు మాత్రమే బెయిల్‌ పొందారు. దశాబ్దాలుగా, నక్సలైట్ల నిర్మూలన ముసుగులో ఆదివాసీలను వారి భూములనుండి తొలగించేందుకు ప్రధానమంత్రులు,హోం మంత్రులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆదివాసీలు ప్రభుత్వ కుట్రలను, కుతంత్రాలను ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆదివాసీలను వలసదారులుగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కుట్రలు విఫలమయ్యాయి. అయితే మైనింగ్‌ కార్పొరేషన్లకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు ఆదివాసీల్లో భయాందోళనలు కలిగించలేదు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌ అడవుల్లో నివసిస్తున్న ప్రజలపై జరుగుతున్న ఈ బాంబు దాడులు ఆదివాసీల్లో ఎటువంటి ఆందోళనకు తావివ్వలేదు. మైనింగ్‌ సంస్థల లాభాల కంటే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే అవగాహనతో ప్రభుత్వాలు పాలన సాగించవలసి ఉంది. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర దుష్పరిమాణాలు ఎదుర్కోవలసింది ప్రభుత్వాలే. డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img