Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆధునిక బానిసత్వం ముప్పు ముంగిట…

జ్ఞాన్‌ పాఠక్‌

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకమైనది. ఇది 75వ స్వాతంత్య్ర దినోత్సవమో లేక దీనిని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరుపుకునే ఉత్సవాలు ప్రారంభమవుతున్నందుకో మాత్రమే కాదు… శ్రామిక వర్గం ఆధునిక బానిసత్వం ముప్పు ముంగిట ఉన్న ప్రమాదాన్ని ఇది మనకు గుర్తు చేస్తోంది. గౌరవనీయమైన పని, సామాజిక భద్రత కోసం వారి హక్కులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం పోరాటాలను మననం చేస్తున్నది.
మనదేశంలో శ్రామిక వర్గం తమ యాజమాన్యాల నుండి ఎప్పుడూ తీవ్ర ఇబ్బందులనే ఎదుర్కొంటోంది. కట్టు బానిసత్వం నుండి ఆధునిక బానిసత్వం దాకా అన్నీ జీవన సమస్యలే. బాల కార్మికులను మనం చూస్తున్నాం. అతి తక్కువ జీతాలకే నిర్బంధంగా పనిచేస్తున్న కార్మికులు ఎందరో. కార్మికుల్లో ఎక్కువమందికి సామాజిక భద్రతా చర్యలే లేవు. అసంఘటిత రంగంలోని లక్షలాదిమంది కార్మికులకు కనీసం కార్మికులుగా గుర్తింపులేదు. ఈ కారణంగా వారికి ఎలాంటి సామాజిక భద్రతా పథకాలు అమలు కావడం లేదు. కొవిడ్‌19 మహమ్మారి ప్రబలడం, అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఏడాదిన్నర కాలంగా ఆర్థిక బానిసత్వ పరిస్థితులు మరింత విషమంగా మారాయి. నిరుద్యోగిత, ఉపాధిలో అనిశ్చితి మనుగడను ప్రశ్నార్థకం చేయడమే కాదు, బతుకు బండిని సాగించేందుకు ఏ విధమైన పనిపాటలు లేని దుర్భర పరిస్థితిలో మరింత దోపిడీ, ఆర్థిక బానిసత్వం సంకెళ్ళల్లో చిక్కుకుపోనున్నారు. భారతదేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న ఈ కర్కశ పరిస్థితులను స్వాతంత్య్ర దినోత్సవం మనకు జ్ఞప్తికి తెస్తోంది. మనకు అదనపు సమస్యలూ ఉండనే ఉన్నాయి. గత ఏడాది కొవిడ్‌ సంక్షోభం దేశాన్ని విలవిలలాడిస్తున్న సమయంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలు చేసేందుకు హడావిడి పడిరది. ఒక పక్కన లాడ్‌డౌన్‌ అమలవుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. కార్మిక వర్గానికి ఉపాధి కరవైంది. వారి జీవన చక్రం ముందుకు సాగేందుకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి. లాక్‌డౌన్‌ విధించిన తొలి నెలల్లో వారు పొదుపు చేసిన కొద్దిపాటి సొమ్మును వాడుకున్నారు. ఎలాంటి సామాజిక భద్రతా పథకాలు లేని వీరికి ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం అత్యవసర సాయం చేయాలి, కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మికులకు సాయం అందించాలని యాజమాన్యాలకు కేంద్రప్రభుత్వం చెప్పింది కానీ ఇదేమీ వారిపై ప్రభావం చూపించలేదు. కార్మికులను రక్షించేందుకు ప్రత్యేకించి వలస కార్మికుల కోసం మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తమ తప్పేమీ లేకున్నా నానా యాతన పడుతున్న కార్మికులను ఉద్యోగాల్లో కొనసాగించేందుకు అవసరమైన మద్దతును అటు సంస్థలకూ కేంద్రం ఇవ్వలేదు. గత ఏడాది (2020) జూన్‌ 1వ తేదీ నుండి దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతను ప్రారంభించినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కాకపోవడంతో కార్మిక వర్గానికి బాధలు తప్పలేదు. 2020 సెప్టెంబరు మధ్యలో కరోనా తొలి దశకు తెరపడిరది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరణ కాకముందే ఈ ఏడాది (2021) ఫిబ్రవరి ప్రారంభం నుండి రెండో దశ ఊపందుకుంది. ఇది మే నెల మధ్యకాలానికి కొంత ఉపశమించింది. త్వరలోనే మూడో దశ ముంచెత్తే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఇప్పటికీ అనిశ్చితిలోనే ఉంది. ఇలాంటి కఠోర పరిస్థితుల్లో శ్రామికవర్గం తీవ్ర బాధలు పడుతుంటే... కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సమయంలో నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకొచ్చింది. కూడుగూడు కరవై బతుకు పోరాటం చేస్తున్న కార్మిక వర్గంపై మూలికే నక్క మీద తాటిపండు పడిన చందంగా కార్మిక కోడ్‌లనే బాంబును పడేసింది కనికరం లేని కేంద్రం. ఇవి కార్మిక వ్యతిరేకం`కార్పొరేట్‌ అనుకూలం అని కేంద్ర కార్మిక సంఘాలు అంటుంటే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి కోసం అని చెబుతోంది. వీటిని ఇంకా అమలు చేయలేదు కానీ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటిని అమలు చేయవచ్చు. కొవిడ్‌ సంక్షోభ నివారణా చర్యల్లో తీరిక లేకుండా ఉన్నందున రాష్ట్రాలు ఎలాంటి నియమావళిని రూపొందించనందున కేంద్రం వీటిని ఇంతవరకూ అమలు చేయలేదు. ఈ నియమావళి నోటిఫికేషన్‌ లేకుండా కేంద్రం వీటిని అమలు చేయడం సాధ్యం కాదు. దీనికి తోడు కార్మిక కోడ్‌లకు సానుకూలంగా ఉన్న పరిశ్రమలు, వ్యాపార వర్గాలు వీటిని అమలు చేసేందుకు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఇందుకు ప్రధానమైన కారణం ఇవి సంక్షోభంలో చిక్కుకుపోయి ఉండడం, రెండోది ఈ కోడ్‌లను అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేని స్థితిలో ఉండడం. ఈ కోడ్‌లను అమలు చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉండగా, కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని పరిశ్రమలు, కార్మికవర్గం మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడంలో మరో నూతన దశ ప్రారంభమవుతుందనడానికి ఇదొక సంకేతం.
భారతదేశంలో కార్మికోద్యమానికి పెద్ద చరిత్రే ఉంది. పెను పోరాటం తర్వాతా కార్మిక వర్గానికి దక్కింది స్వల్పమే. ఆ ప్రయోజనం కూడా సంఘటిత కార్మికులకే పరిమితమైంది. అసంఘటిత రంగ కార్మికులు కనీసం సామాజిక భద్రతకు కూడా నోచుకోక కఠిన దీనావస్థలో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మరి ఎవరి పరిస్థితి మారిందన్నది ప్రశ్నార్థకం. సంఘటిత కార్మికుల హక్కులు సంస్థాగతంగా తుడిచిపెట్టేస్తున్నారు. కుదిరితే చట్టబద్ధంగా లేదంటే అక్రమంగా ఇష్టానుసారం ఈ హక్కులను హరించేస్తున్నారు. కుట్రలు, మాయోపాయాలతో చివరకు ‘సమ్మె చేసే హక్కు’, సమైక్యమయ్యే హక్కు’ను కూడా లేకుండా చేస్తున్నారు.
చాలా ఏళ్ళుగా పని పరిస్థితులు క్షీణించిపోతున్నాయి. గౌరవప్రదమైన పని అవకాశాలూ వేగంగా తుడిచి పెట్టుకుపోతున్నాయి. సంఘటిత రంగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు కార్మిక వర్గానికి అందకుండా పనులను ఔట్‌సోర్సింగ్‌ చేస్తున్నారు. క్రమ పద్ధతులు తగ్గిపోతున్నాయి. నేడు లక్షలాదిమంది కార్మికులు కనీసం రాతపూర్వక నియమాక లేఖ లేదా కాంట్రాక్టు కూడా లేకుండానే పని చేస్తున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని పని, సేవల పరిస్థితులూ దిగజారిపోతున్నాయి.
కార్మిక వర్గానికి ఉన్న బాధలను కొవిడ్‌ మరింత పెంచింది. పని పోకడలు మారడంతో చదువు, నైపుణ్యాలు తక్కువగా ఉన్న వారికి పని కరువైంది. డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌లు పెరిగాయి. మహిళా కార్మికుల పరిస్థితి మరింత హీనంగా మారింది. లింగ సమానత్వం, మహిళా సాధికారత మచ్చుకైనా కనిపించడం లేదు. పురుషులు, మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా మొత్తంగా కార్మికవర్గమంతా అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్న కాలమిది. దేశంలో నెలకొన్న అన్ని రకాల ఆధునిక బానిసత్వాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం మనకు గుర్తుచేస్తోంది. కార్మికవర్గం మరింత గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోకుండా చూసేందుకు మనమంతా కలిసికట్టుగా ఏదో ఒకటి చేయాలి. పనికి, పనిచేసే వారికి గౌరవాన్ని పునరుద్ధరించాలి. వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కొత్త లేబర్‌ కోడ్‌ నిబంధనలను కేంద్రం మార్చాలి. ఇందులో ఎలాంటి దుర్మార్గానికి తావు లేకుండా, ఇటు కార్మికుడికి అటు యజమానికి ఎవరికీ పూర్తి అనుకూలం కాకుండా సమానత్వ ప్రాతిపదికన తీసుకురావాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు. కేవలం సంబరాలు చేసుకుంటే సరిపోదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img