Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏటా పెరుగుతున్న ఆత్మహత్మలు

రుద్రరాజు శ్రీనివాసరాజు

మార్కులు, రాంకులే పరమావధిగా కొనసాగుతున్న విద్యా వ్యవస్ధలో నైతిక విద్యకు కానీ మనోవికాసానికి చెందిన అంశాలపై బోధన చేసే అవకాశం ఉపాధ్యాయులకు లేదు. తల్లితండ్రులు కూడా కోరుకోవడం లేదు. ఇటువంటి వాతావరణంలో పిల్లల్లో సున్నిత మనస్కులు ఎక్కువగా తయారు కావడం కూడా ఒక కారణం. మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, మద్యం తాగేవారు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. మద్యం, డ్రగ్స్‌ మనిషిలో విచక్షణకోల్పోయేలా చేస్తాయి. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పుతాయి. అభిమాననటులు, నాయకులు మరణించినా లేదా ఓటమి పాలైన తట్టుకోలేని మితి మీరిన అభిమాన గణం ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో రైతు ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయి. పంట కోసం కుటుంబ పోషణ కోసం తీసుకున్న రుణాలు పెరిగి రుణగ్రస్తతకు గురైనపుడు, అవి తీర్చలేం అనే భీతితో ప్రాణాలు తీసుకుంటున్న చిన్న రైతులు అనేక మంది. వరుసగా పంటనష్టపోతున్న రైతులు కూడా ఈ దురాఘతానికి పాల్పడుతున్నారు. కుటుంబం మొత్తాన్ని అనాధలు చేస్తున్నారు.
మన దేశ ప్రజానీకంలో 48.9 శాతం ప్రజలు పూర్తిగా వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయం వెనకబడి రైతాంగం ఆత్మహత్యలు ఏటేటా ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దూసుకుపోతున్న చేదు వాస్తవాన్ని మనం కళ్లారా చూస్తున్నాం.
కొవిడ్‌ మహమ్మారి మానవాళిపై తీవ్ర మానసిక ఆర్థిక, సామాజిక ప్రభావాలను చూపిస్తూ ఉంది. దీనివలన ఆత్మహత్యలు ఇటీవల పెరిగాయి. కోవిడ్‌ సోకితే మరణం తధ్యం అనే ప్రచారం పెరిగి పోవడం. కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని కనీసం నిర్దారణ పరీక్షలు కూడా చేసుకోకుండా లేదా కోవిడ్‌ వైద్యం పొందుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనితో పాటు కోవిడ్‌ సోకితే కుటుంబ సభ్యులతో సహా సమాజం కూడా వెలివేసినట్లు చూస్తారని ఈ సమయంలో ఉపాధి కోల్పోవడం, డబ్బు లేకపోవడం తదితర కారణలన్నీ కలసి ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, స్నేహితులతో, సన్నిహితులతో సమస్యలు, అనుకున్న ఉద్యోగం రాకపోవడం, తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం రాకపోవడం. ఉద్యోగుల మధ్య జరిగే సంఘటనలు, ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజికహోదాను కోల్పోవడం, నిరాశ, నిద్రలేమి, వంటరితనం, మతిస్ధిమితం కోల్పోవడం కొన్ని కారణాలు. వ్యాపారంలో నష్టపోయామని, తనను దూషించారని, ఇతరులకు వచ్చిన పదోన్నతి తనకు రాలేదని, చేయని తప్పునకు తనపై నేరం మోపారని ఇలా చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం. మరొక విచిత్రం ఏమిటంటే ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో ఎక్కువశాతం మంది అక్షరాస్యులు, విద్యాధికులు. ఎందుకు అలా చేస్తున్నారంటే మానసిక దౌర్బల్యమే కారణం. విరక్తి, అనాసక్తి జీవితాన్ని చాలించేలా చేస్తున్నాయి.
ప్రపంచం అంతటా రోజుకు 3వేలమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరి ప్రాణాలు పోతున్నాయన్నమాట. ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది యువతీయువకులే. అదీ 15-29 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంతో అనుభవం గడిరచిన వృద్దుల, మధ్య వయస్కుల ఆత్మహత్యలు కూడా తక్కువేం కాదు. 1996 నుంచి 2006 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు 60 నుంచి 90 శాతం పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో ప్రతి 100 మరణాలలో ఒకటి ఆత్మహత్యల వల్ల సంభవిస్తోంది. ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆత్మహత్యల విషయంలో మనదేశం 22వ ర్యాంకులో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా లక్షా 35 వేలమంది ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భారతదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడిరచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఆత్మహత్య కేసులు మహిళల్లో కంటే పురుషులలో రెండు రెట్లు ఎక్కువ. మహిళల్లో, ఈ సంఖ్య లక్షకు 5.4 శాతం. కాగా, అదే సమయంలో ఇది పురుషులలో 12.6 శాతంగా ఉంది.
అన్ని దేశాలు, ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు, జాతులు, సమాజాలు, సామూహికంగా ఎలుగెత్తి ఆత్మహత్యలు కూడ దంటున్నాయి. ప్రజల్లో చైతన్యం రగిల్చి ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా.. ది ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ సూయిసైడ్‌ ప్రివెన్షన్‌ (ఐఎఎస్‌పి), వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ (డబ్ల్యుఎఫ్‌ ఎమ్‌హెచ్‌) సంస్థలతో కలసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సెప్టెంబర్‌ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని దాదాపు 40 దేశాలు అధికారికంగా ఆచరించాయి. ర్యాలీలు, చర్చాగోష్టులు, సదస్సులు ఈ సందర్భంగా నిర్వహించారు. మానసిక ఆరోగ్యం వల్ల బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయచ్చన్నది ప్రధాన అంశం. దీనిపై విస్తృత ప్రచారం చేశారు. ప్రతీ ఏటా ఒక నినాదాన్ని ప్రకటించి దానికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం యుద్ధం, హత్యలు, నేరాలు, దాడులు వంటి వాటికన్నా ఆత్మహత్యల వల్లే ఎక్కువమంది చనిపోతున్నారన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రతీ సమస్యకి ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు అని గమనించాలి. ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతీ అడుగుని ఒక సవాల్‌గా తీసుకోవాలి. చావు దేనికీ సమాధానం కాదు. కష్టాలను, సమస్యలను మిత్రులతోనో, కుటుంబ సభ్యులతోనో పంచుకుంటే తప్పక పరిష్కారం దొరుకుతుంది. బతికి సాధించాలి తప్ప చావు ఎప్పటికి పరిష్కారం కాదు కానేరదు.
వ్యాసరచయిత సెల్‌: 9441239578.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img