Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జాతి మరవలేని అమరవీరులు

నక్కి లెనిన్‌ బాబు

భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన భారతరత్నాలు సర్దార్‌ భగత్‌సింగ్‌, శివరాం రాజ్‌గురు సుఖదేవ్‌ థాపర్‌. ఎక్కడోపుట్టి ఎక్కడోపెరిగి ఒకేచోట చదివి స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితమైన పోరాటాలు నిర్వహించి, భారత యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఉద్యమకారులు. భగత్‌సింగ్‌ లాహోర్‌ సమీపంలోని బంగా గ్రామంలో జన్మించాడు. భగత్‌సింగ్‌ కుటుంబ నేపథ్యం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న విప్లవకారుల కుటుంబం. భగత్‌సింగ్‌ చిన్నాన్న అజిత్‌సింగ్‌ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా అజ్ఞాతవాసంలో ఉంటూ పోరాటాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అతి చిన్న వయసునుండి భగత్‌సింగ్‌లో బ్రిటిష్‌ వ్యతిరేకభావం పెరుగుతూ వచ్చింది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలన్న ఆలోచనతో తుపాకులు నాటితే మొలకెత్తుతాయి కదా అని భావించేవాడు. 1919లో పంజాబ్‌లోని జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన సంఘటన భగత్‌సింగ్‌పై తీవ్ర ప్రభావం పడిరది. సుమారు 20,000 మంది ప్రజలు జలియన్‌వాలాబాగ్‌ తోటలో రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సమావేశంకాగా, నిరాధారమైన ప్రజలపై పోలీసు అధికారి డయ్యర్‌ ఏకపక్షంగా సుమారు 1650 రౌండ్లు కాల్పులు జరపడంతో 379 మరణించారు. పదివేలకుపైగా ప్రజలు గాయపడ్డారు. తోట మొత్తం రక్తంతో తడిచిపోవడం, పక్కనఉన్న బావిలో తమ ప్రాణాలు కాపాడుకోవడంకోసం దూకడంతో అనేకమంది మరణించిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భగత్‌సింగ్‌ జలియన్‌ వాలాబాగ్‌ వెళ్లి అక్కడ రక్తంతో తడిచిన మట్టిని తీసుకుని ఒక సీసాలో పోసుకొని ప్రతిరోజూ నా భారత ప్రజల ప్రాణాలుతీసిన డయ్యర్‌పై ప్రతీకారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసేవాడు.
శివరాం రాజ్‌గురు మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పూనే దగ్గర కుగ్రామంలో జన్మించాడు. దేశభక్తి భావజాలం పెరగడంతో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలన్న లక్ష్యంతో నేషనల్‌ కాలేజీలో విద్యాభ్యాసం కొనసాగించాడు. అక్కడే భగత్‌సింగ్‌ పరిచయమయ్యారు. సుఖదేవ్‌ థాపర్‌ లూధియానాలోని నౌఘరలో జన్మించాడు. సుఖదేవ్‌ కూడా బ్రిటిష్‌ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్లారాచూసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేందుకు హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులకు పరిచయమయ్యారు. చంద్రశేఖర అజాద్‌, రాంప్రసాద్‌ బిస్మిల్లా ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న నాయకులు. 1928లో సర్‌జాన్‌ సైమన్‌కమిషన్‌ భారతదేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో లాలాలజపతిరాయ్‌ నాయకత్వంలో సైమన్‌ కమిషన్‌ గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న లాలాలజపతిరాయ్‌ని పోలీస్‌ అధికారి స్కాట్‌ తీవ్రంగా దాడిచేయడంతో ఆయన మరణించారు. వీరి మరణం హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపడంతో స్కాట్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న స్కాట్‌ను అనుకొని డిఎస్పీగా ఉన్న జె.పి సాండర్స్‌పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లను అరెస్టు చేయడంకోసం ప్రయత్నిం చడంతో మారువేషంలో భగత్‌సింగ్‌ అనేక ప్రాంతాలు తిరిగారు. శాసన సభలో అనేక చట్టాలు తీసుకొచ్చి భారత ప్రజలను అణిచివేసేందుకు జరుగుతున్న కుట్రల నేపథ్యంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 1929 ఏప్రిల్‌ 8 ఎవరికీ హాని జరగని బాంబులువేసి నిరసన తెలపాలని నిర్ణయించు కున్నారు. భగత్‌సింగ్‌ ఆ కార్యక్రమంలో పాల్గొంటానంటే చంద్రశేఖర్‌ ఆజాద్‌ భగత్‌సింగ్‌వద్దని చెప్పినా చివరకు ఒత్తిడిచేసి నేను పార్లమెంటులో పొగబాంబు వేసి నిరసన తెలుపుతానంటూ నిర్ణయించుకున్నాడు. పార్లమెంట్‌లో పొగబాంబువేసి బ్రిటిష్‌పాలన మాకొద్దు సంపూర్ణ స్వతంత్రం కావాలని నినాదాలుచేస్తూ స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అరెస్ట్‌ అయిన నేపథ్యంలో డిఎస్పి జె పి సాండర్స్‌ హత్యకేసు విచారణ ప్రారంభమైంది. జైల్లో ఉన్నకాలంలో భగత్‌సింగ్‌ కారల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగిల్స్‌, లెనిన్‌ రచనలు అనేకంగా చదివాడు. దేవుడుపై ఎప్పటికి నమ్మకం లేదని ప్రకటించారు. జైల్లో ఉన్న సర్దార్‌ భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు కూడా రాజకీయ ఖైదీలకు హక్కులు ఉండాలని 64 రోజులు పాటు నిరాహార దీక్ష నిర్వహించి విజయం సాధించారు. ఈ విచారణ నేపథ్యంలో వ్యక్తులను చంపడం సులువైనప్పటికీ సిద్ధాంతాలను సమాధి చేయలేరని నిరూపించారు. సామ్రాజ్యాలు కూలిపోయినా సిద్ధాంతాలు మాత్రం సజీవంగానే ఉన్నాయని భగత్‌సింగ్‌ అన్నారు. క్షమాభిక్ష కోరితే ఉరిశిక్ష రద్దుచేస్తావని అధికారులుచెప్పినా నా ప్రాణాలుపోయినా క్షమాభిక్ష దరఖాస్తుపై సంతకం చేయనని చెప్పిన వ్యక్తి భగత్‌సింగ్‌. నాకూ ఆశలూ, ఆకాంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలనిఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం అన్నారు.
కర్తార్‌ సింగ్‌ సారాభా ప్రభావం భగత్‌సింగ్‌పై తీవ్రంగా ఉంది. విదేశాలలో బ్రిటిష్‌ వారికి అనుగుణంగా పనిచేయడంకోసం వేలాది మంది భారతీయులను తీసుకెళ్లిన బ్రిటిష్‌ అధికారులు అక్కడ తీవ్రమైన హింసలకు గురిచేసేవారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలన్న లక్ష్యంతో విదేశాల్లో ఏర్పడిన ఏకైక పార్టీ గదర్‌పార్టీ. గదర్‌ అంటే తిరుగుబాటు. సోహాన్‌సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన గదర్‌ పార్టీలో 15 సంవత్సరాల వయసు కలిగిన కర్తార్‌ సింగ్‌ సారాభా సభ్యుడిగాచేరి భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనాలన్న లక్ష్యంతో ఒక ప్రత్యేక హోదాలో విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకుని భారతదేశానికి బయలుదేరిన సమాచారం ముందుగానే బ్రిటిష్‌ వారికి అందడంతో వారు ప్రయాణిస్తున్న ఓడపై కాల్పులు జరిపి కర్తార్‌సింగ్‌ సారాభాను ఉరితీసారు. కర్తార్‌సింగ్‌ సారాభా నీ చివరి కోరిక ఏమిటి అని జడ్జి అడిగితే దేవుడు ఉంటే భారతదేశంలో మళ్లీ జన్మించాలి, మీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మరణిస్తానే ఉంటానంటూ చెప్పడం యువతలో తీవ్ర ప్రభావం చూపించాడు. భగత్‌సింగ్‌ కర్తార్‌సింగ్‌ సారాభా ఫోటో జేబులో పెట్టుకుని ప్రతిరోజు చూసుకుంటూ పోరాటాల్లో పాల్గొనేవాడు. సాండర్స్‌ హత్య కేసు విచారణ నేపథ్యంలో ప్రతిరోజు కేసును స్వయంగా వారే వాదించుకుంటూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో యువత పాల్గొనాలని ప్రచార మాధ్యమాల ద్వారా తెలిపేవారు. విచారణ ఏకపక్షంగా నిర్వహించి చివరకు 1931 మార్చి 24న భగత్‌సింగ్‌ను ఉరితీయాలని తీర్పు ఇచ్చారు. ఉరితీసేముందు నీ చివరి కోరిక ఏమిటి అని భగత్‌సింగ్‌ను జైలు అధికారి అడగడంతో రష్యా పోరాటయోధుడు వి.ఐ.లెనిన్‌ జీవిత చరిత్ర చదువుతున్నాను ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడుతో మాట్లాడుతున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. దేశంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో లాహోర్‌ జైల్లో ఉన్న భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురులను మార్చి 23వ తేదీ నిబంధనలకు విరుద్ధంగా ఉరితీసి సట్లెజ్‌ నది దగ్గర అంతక్రియలు నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిన ప్రజలు పెద్దఎత్తున నది దగ్గరికి వెళ్లి అక్కడ కాలుతున్న భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురులకు ప్రజలే అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి.. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడి వీర మరణం పొందిన భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు స్వాతంత్య్ర ఉద్యమకారులు ఉద్యమస్పూర్తితో నేడు దేశాన్ని పరిపాలిస్తున్న మతోన్మాద పాలకపక్షాలు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్య, వైద్య, ఉపాధి, హక్కుల సాధనకోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 92వ వర్థంతి సందర్భంగా)
ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, సెల్‌: 8247806001

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img