Friday, April 26, 2024
Friday, April 26, 2024

దింపుడు కళ్లం ఆశలు

మామూలే. దింపుడు కళ్లం ఆశలు ప్రతి ఏటా చర్విత చరణమే. ఈ ఏడాది బాగుంటుందని ఆశ పడడం, అబ్బే గతమెంతో మేలు వచ్చే ఏటి కంటే అని సమాధానపడడం. బడ్జెట్‌లో ఏముంటాయో, దాని వల్ల ఎవరికి ఎంత లాభమో, ఎంత నష్టమో, ఎంత మేలో, మరెంత కీడో లెక్కలు చెబుతాయి. కాని, 150 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతావనిలో ఆ లెక్కలు అర్ధం అయ్యేది మాత్రం ఎంత మందికి. రూపాయి రాక, అదే రూపాయి పోక…. పొద్దున్నే పత్రికల్లో సున్నాకి రంగులు వేసి చూపిస్తారు. మనిషి ముఖానికి వేసుకున్న రంగుల వంటివే అవి. అర్ధం కావు. అర్ధం చేసుకోలేం. ప్రయత్నించడం వృధా. సర్దుకుపోవడమూ, వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడడం వినా బతుకులో పెద్ద మార్పు ఉండదు. మరో రెండు దశాబ్దాల తర్వాత భారత భవితకు ఈ బడ్జెట్‌ పునాది అంటుంది ఏలిక. ఇక్కడ కదిలిపోతున్న పునాదుల గురించి మాత్రం పల్లెత్తుమాట మాట్లాడరు. మాట్లాడలేరు. మాట్లాడకూడదు. మాటంటే రెండు పెదవుల నుంచి వచ్చే శబ్ధం కాదు కదా. మాటంటే ఎదుటి వారికి వినపించే పదం కాదు కదా. మాటంటే అణుబాంబు. మాటంటే ఏలికల ఆరాధ్యం శ్రీరాముని శాసనం. మాటంటే నిలబెట్టుకోవాల్సిన ప్రమాణం. అందుకే పెదవి విప్పరు. భవిష్యత్‌ చిత్రపటం గురించి కలలు కలలుగా, అలలు అలలుగా వర్ణిస్తారు. నేటి వృద్ధులకు భవిష్యత్‌ గురించి పట్టించుకునే అవసరం ఉండదు. నేటి యువతకు భవిష్యత్‌ హామీ గుర్తుండదు. ఈనాటి బాలలకు భవిష్యత్‌లో ఈ అమృత్‌ కాల్‌ చేరే అవకాశం ఉంటుందనే ఆశా ఉండదు. అందుకే వర్తమానాన్ని గాలికి వదిలేసి భవిష్యత్‌ గురించి పూల గుత్తుల వంటి సువాసనలు సృష్టిస్తారు. వీళ్లే కాదు… దేశాన్ని ఏలిన వారంతా చేసింది ఇదే. చరిత్ర చదువుకోవడానికి, మననం చేసుకోవడానికి కూడా భయపడే స్థితికి వచ్చేసాక ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్‌ గురించి కలలు కనడం కాసింత ఊరట. అవును, ఊరడిల్లడం తప్ప, ఊరికే అలా జీవించడం తప్ప ఇంకేం చేయగలం.
ఓ ప్రయోజనాన్ని ముందే నిర్ణయించుకుని అందుకోసం ఆ దిశగా పరుగులు పెట్టడం, ప్రజలను అటువైపే పరుగులు పెట్టేలా చేయడం నయా ఏలికల నూతన రాజ్యాంగం. చూపుడు వేలుపై చుక్క తప్ప మిగిలిన దేహమంతా దిశమొలగా కనిపించాల్సిన సమయం దగ్గరవుతున్నప్పుడు ఇలాంటి లెక్కలే కనిపిస్తాయి. సామాన్యుడు అనే పదం, పేదవారు అనే మాట ఇక్కడ నిషేదించి చాలా కాలమైంది. కార్పొ’’రేట్లు’’ భవితను నిర్ణయిస్తున్న సందిగ్ధ సంధ్యలో జీవిస్తున్నాం. సెల్‌ ఫోన్‌ ధరలు తగ్గాయి. నాకు ఆకలేస్తోంది. దేశ రక్షణ చాలా ముఖ్యం. నాకు ఆకలేస్తోంది. ఆకాశయానం మరింత సులభతరం. అమ్మా నాకు ఆకలేస్తోంది. అందరికీ అందుబాటులో వజ్రాలు. తల్లీ నాకు ఆకలేస్తోంది. బడ్జెట్‌లో అన్ని హంగులూ ఉన్నాయి. ఒక్క సామాన్యుడి ఆకలి తీర్చడం తప్ప.
వ్యవసాయం దండగగా మారి రెండున్నర దశాబ్దాలైంది. ఇంతకాలం దేశ ప్రజంతా మూడు పూటలా భోజనం చేస్తోంది. వ్యవసాయం దండగగా మారిన సందర్భంలో ఈ భోజనం ఎక్కడి నుంచి వస్తోందో మాత్రం పెదవి విప్పలేకపోతున్నాం. ఉరితాళ్లు వరిని పండిస్తున్నాయి. పురుగుల మందు మనకి పెరుగన్నం పెడుతోంది. రైతులు, వారి కుటుంబాలు ఏటీఎం సెంటర్ల ముందు తమకు నప్పని యూనిఫాంతో ఒకచోట, తలలు దించుకుని చేతులు మాత్రమే ముందుకు చాచి దేహీ అంటూ దేవాలయాల ముందు కూర్చుంటున్న అపురూప దృశ్యం నేడు దేశమంతా కనిపిస్తున్న వర్తమానం. వారందరికీ భవిష్యత్‌ చిత్రపటం చిగురేస్తుందని మాత్రం పత్రికలు, చానెళ్లు చర్చలు జరపడం కళ్ల ముందు కదలాడుతున్న విషాదం.
సీనియర్‌ జర్నలిస్టు, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img