Friday, April 26, 2024
Friday, April 26, 2024

పొరుగు దేశాలపై అఫ్గాన్‌ ప్రభావం

బుడ్డిగ జమిందార్‌

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైన ఆగస్టు 15 నుంచి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ఉండదని, మహిళలుపై వివక్ష చూపమని, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తామని వాగ్దానం చేశారు. ఆచరణలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి. మరోవైపు కాబూల్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలకు తాత్కాలికంగా తాళాలు వేసుకొని స్వదేశాలకు దౌత్య సిబ్బంది ప్రయాణమవుతున్నారు. విదేశస్థులతో విమానాశ్రయం కిటకిటలాడుతోంది. అనేక వేలమంది స్వదేశం నుంచి వలస పోవటానికి ప్రయత్నిస్తున్నారు. విదేశీ వలసలకు గత 30.. 40 సంవత్సరాల అఫ్గాన్‌ చరిత్ర కొత్తేమీ కాదు. ఆ మాటకు వస్తే అఫ్గాన్‌ పౌరులు సుమారు 60 లక్షల వరకూ ఇప్పటికే పాకిస్థాన్‌, ఇరాన్‌ వంటి దేశాల్లో తలదాచుకొంటున్నారు. సామ్రాజ్యవాద యుద్ధాల ఫలితంగా మధ్యప్రాచ్యం నుంచి, అఫ్గానిస్థాన్‌ నుంచి 6 కోట్లకు పైగా ప్రజలు వలస పోయి పొరుగు దేశాల్లో నివసిస్తున్నారు. అనేకమంది సొంత దేశాల్లోనే వేరే ప్రాంతాలకు పోయి ప్రాణాలను గుప్పిట పట్టుకొని బతుకుతున్నారు.
ప్రస్తుత అఫ్గానిస్థాన్‌ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే 3 మార్గాలు కనిపిస్తాయి. మొదటిగా తాలిబన్లు వారి ఇస్లామిక్‌ స్టేట్‌ లక్ష్యాన్ని విడనాడకుండా మతోన్మాదంతో పాలించటం. ఇదేగానీ జరిగితే దేశాభివృద్ధి ఇంకా నాశనమవుతుంది. అమెరికా మిత్ర దేశాల సైనికులు తిరిగి రంగ ప్రవేశం చేయొచ్చు. దేశంపై బాంబుల వర్షం కురిపించవచ్చు. దీంతో అఫ్గానిస్థాన్‌లో ప్రజలకు గడ్డుకాలమే మిగలనుంది. రెండవ మార్గంగా నూతన ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసి ముఖ్యంగా దేశం చుట్టూ ఉన్న ఇరాన్‌, పాకిస్థాన్‌, చైనాలతో సఖ్యతగా ఉండి వాణిజ్య లావాదేవీలు జరుపుకుంటూనే చారిత్రాత్మక మిత్రదేశాలైన రష్యా, భారతదేశాలతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండడం. 3వ మార్గంగా ఊహించని అనూహ్య రీతిలో చైనా, రష్యా, పాకిస్థాన్‌, ఇరాన్‌ వ్యతిరేక కూటమిగా అమెరికాతో రాజీపడటం. ఈ మార్గం అంత సులభం కాకపోవచ్చు. ఇప్పటికే చైనా, రష్యా, పాకిస్థాన్‌, ఇరాన్‌లతో తాలిబన్లు మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మొత్తం ఎపిసోడ్‌లో చైనా ఎక్కువ లబ్ధి పొందు తున్నట్లుగా కనబడుతున్నది. ఉగ్రవాద సంస్థలతో తాలిబన్లకు ఉన్న సంబంధాలను రద్దు చేసుకోవాలని చైనా, రష్యాలు సూచిస్తున్నాయి.
చైనాతో
తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకొంటామని చైనా ఇప్పటికే ప్రకటించింది. చైనాఅఫ్గానిస్థాన్‌ల మధ్య శతాబ్దాల క్రితం ఉన్న సిల్కు రోడ్డును పునరుద్ధరించుకొని మధ్యప్రాచ్య దేశాలతో ఈ నూతన సిల్కు రోడ్డును కలుపుకోవాలనుకొంటోంది. ఇప్పటికే ఖషఘర్‌ (చైనా), గాండార్‌ (పాకిస్థాన్‌) వరకు నిర్మితమవుతున్న చైనా, పాకిస్థాన్‌ ఎకనామికల్‌ కారిడార్‌ను మధ్య నుంచి కాబూల్‌ను కలుపుతూ ఇరాన్‌ వరకూ విస్తరించాలనే ‘ఆలోచన’ ఇటీవల వెలిబుచ్చారు. దీంతో ఇరాన్‌తో కుదుర్చుకున్న 40 వేల కోట్ల డాలర్ల వాణిజ్య ఒప్పందాన్ని చైనా సులువుగా మళ్ళించుకొనే అవకాశాలున్నాయి. క్సిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉన్న చైనా ముస్లింల జోలికి మాత్రం ఇస్లామిక్‌ స్టేట్‌ ఆలోచనను తీసుకురావద్దని చైనా కోరింది. ఇది ఆ దేశ షరతు. ఇందుకు ప్రతిఫలంగా అఫ్గానిస్థాన్‌ మౌలిక వసతులను నిర్మిస్తామని, నూతన ప్రాజెక్టులలో అఫ్గానిస్థాన్‌ పునర్నిర్మాణానికి దోహదపడతామని ఇటీవల చైనా రాజధానిలో విదేశాంగ మంత్రిని కల్సినప్పుడు హామీ పొందారు. తూర్పు టుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ ఉద్యమం చైనా ఉగుర్స్‌ ప్రాంతానికి సోకకుండా జాగ్రత్తపడుతోంది. రష్యాతో 1980 నుంచి పది సంవత్సరాలపాటు సోవియట్‌ యూనియన్‌ సేనలు అఫ్గానిస్థాన్‌లో ఉన్నాయి. శాంతి ఒడంబడికతో 1989లో ఉపసంహరించుకున్నాయి. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి అఫ్గాన్‌ పరిణామాలపై మాట్లాడుతూ, ‘20 సంవత్సరాల పశ్చిమ దేశాల ఆక్రమణతో సత్ఫలితాలను సాధించలేకపోగా, ఉన్న అభివృద్ధిని కుంటుపరిచాయని, అఫ్గానిస్థాన్‌ అభివృద్ధి, సుస్థిరత కోసం రష్యా పాటు పడుతుందని’ అన్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా పుతిన్‌ చొరవతో శాంతి చర్చలను మాస్కోలో జరిపారు. తాలిబన్లకు రష్యాతో సఖ్యత ఉంది. మరోవైపు తాలిబన్ల అమెరికా వ్యతిరేకతను ఇరాన్‌ తనకు అనుకూలంగా మరల్చుకోటానికి ప్రయత్నిస్తున్నది.
ఇటువంటి కీలక పరిణామాలు భారత్‌`ఇరాన్‌లతో అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న వేళ భారతదేశం తన అపార అనుభవంగల దౌత్య సంబంధాలకు అనుగుణంగా పరిస్థితులను మరల్చుకోలేకపోయింది. మాస్కో శాంతి చర్చలకు భారత దేశానికి ఆహ్వానం కూడా అందలేదు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంతో అఫ్గానిస్థాన్‌కు సరిహద్దుఉంది గనుక అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న ప్రతీ కదలిక రానున్న కాలంలో మన కశ్మీర్‌ సుస్థిరతకు, శాంతికి కీలకం కానుంది. కనుక అఫ్గానిస్థాన్‌ సుస్థిరత మనదేశానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇరాన్‌ చాబహార్‌ నౌకాశ్రయం నుంచి మధ్య ఆసియా, యూరో ఆసియాలకు మన దేశం వాణిజ్యం చేయాలన్నా తాలిబన్లతో మంచి సంబంధాలు అవసరం ఉంది. ఇప్పటికే మనదేశం అఫ్గానిస్థాన్‌లో పలు ప్రాజెక్టులకు భారీగా నిధులను వెచ్చించింది కూడా. ‘క్వాడ్‌’ కూటమి సంబంధాలు పటిష్టపర్చే కొలదీ మన సరిహద్దుల చుట్టూ ఉన్న దేశాలలో మన సంబంధాలు పలుచబడటమేగాక మన పరపతి కూడా దిగజారే అవకాశాలే ఎక్కువ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img