Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాడు ప్రశాంతత`నేడు కల్లోలం

టి.లక్ష్మీనారాయణ

నాగరిక సమాజ నిర్మాణం, సమాజాభివృద్ధి, మానవ హక్కులు, ఇరుగు పొరుగు దేశాల మధ్య శాంతియు సహజీవనం, ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రగతిశీల శక్తులకు, ప్రజాస్వామ్యవాదులకు ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలు తీవ్ర ఆవేదన, ఆందోళన కలిగిస్తున్నాయి. 1988 ఫిబ్రవరి 11-12 తేదీలలో కాబూల్‌లో ‘‘విద్య, అభివృద్ధి, సమాజం – విద్యార్థుల దృక్పథం’’ అన్న అంశంపై ఆసియా స్టూడెంట్స్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌(ఏసిక్‌) ఆఫ్గానిస్థాన్‌ ప్రజాతంత్ర యువజన సంఘం(డివైఓఏ) సంయుక్తంగా నిర్వహించిన సెమినార్‌ లో పాల్గొనాను. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌.) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆసియా స్టూడెంట్స్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌(ఏసిక్‌) సమన్వయకర్తగా ఆ కార్యక్రమంలో భాగస్వామినైనాను. సెమినార్‌లో పాల్గొనడంతో పాటు పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌ విద్యాలయాలు కొన్ని పరిశ్రమలను సందర్శించే సదవకాశం నాకు లభించింది. స్త్రీ, పురుష భేదం లేకుండా విద్యనార్జించే సమాన అవకాశాలను, యువతి యువకులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నాటి దేశాధ్యక్షుడు నజీబుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన సాగించింది. నాడు స్త్రీ, పురుషుల వేష ధారణపై ఎలాంటి నిషేధం లేదు. బురఖా ధరించిన మహిళను నేను చూడలేదు. ఆధునిక దుస్తులు ధరించి, పాఠశాలలు, కళాశాలకు వెళుతున్న విద్యార్థినులను, ఉద్యోగాలు చేస్తున్న యువతులు, మహిళలను చూశాను. ఆఫ్గానిస్థాన్‌ ముస్లిం సమాజంలో కమ్యూనిస్టు భావజాలంతో నిర్మాణంలో ఉన్న ఆధునిక సమాజాన్ని చూసి మురిసిపోయాను. ఒక వైపున కాబూల్‌ నగరవాసులు ఎవరి వృత్తుల్లో, పనుల్లో వాళ్ళు నిమగ్నమై ప్రశాంత జీవితం గడుపుతున్నా, కాబూల్‌ శివారు ప్రాంతాల్లో తాలిబాన్ల బాంబుల, తుపాకుల పేలుళ్ల శబ్దాలు కూడా మా చెవుల్లో నాడు ప్రతిధ్వనించాయి. నజీబుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబాన్ల దుశ్చర్యలను దీటుగా ఎదుర్కొంటూ పాలన సాగించింది. ధైర్య సాహసాలతో పాలన సాగిస్తున్న ఆనాటి ఆఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు నజీబుల్లాతో సమావేశం, ఆప్ఘనిస్థాన్‌ కోసం ప్రాణ త్యాగాలు చేసిన త్యాగధనుల స్మారక స్థూపం వద్ద సైనిక వందనంతో శ్రద్ధాంజలి ఘటించే గౌరవం లభించింది. కాబూల్‌ పర్యటన నా జీవితంలో ఒక మధురానుభూతి. ఉద్యమ స్ఫూర్తిని నింపిన మరపురాని పర్యటన. 1990 దశకం ప్రారంభం నుండి ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన రాజకీయ పరిణామాలు, దేశాధ్యక్షుడు నజీబుల్లాను అత్యంత దారుణంగా చంపిన ఆటవిక చర్య, తాలిబాన్ల మధ్యాయుగాల నాటి కరుడుగట్టిన మత ఛాందసపాలన -దుష్ఫలితాలు, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పోషించిన పాత్ర-సైనికచర్యలు-దుష్పరిణామాలు, గడచిన ఇరవై సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, మళ్ళీ తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకొన్న తాజా పరిణామాలను గమనిస్తున్న నాకు నజీబుల్లా పాలన ఆధునిక ఆప్ఘనిస్థాన్‌ చరిత్రలో స్వర్ణయుగమనిపిస్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img