Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ప్రజలను మభ్యపెట్టే బీజేపీ మానిఫెస్టో

డా.జ్ఞాన్‌పాఠక్‌

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెడుతూ రానున్నకాలం బంగారు భవిష్యత్‌గా ఉంటుందన్నట్లుగా మాటల గారడీతో బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో (ప్రణాళికను) విడుదల చేసింది. దీనికోసం సామాన్యప్రజలు ఏనాడూ ఎదురుచూడరు. అయినా తమ మేనిఫెస్టోకోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. నిర్దిష్టంగా పరిష్కరించే ఒక్క సమస్యను కూడా పేర్కొనలేదు. కచ్చితంగా అమలుచేసే గ్యారెంటీ ఒక్కటీ లేదు. గతంలో ఇచ్చిన గ్యారంటీలలో (హామీలలో) ఒక్కటీ నెరవేర్చలేదు. ‘‘మంచి పాలన అందిస్తాము’’ అని పేర్కొన్నారు. ఇంతవరకు అందించినపాలన సరైందికాదని మోదీ అంగీకరించారని అనుకోవాలి. దీని అర్థమేమిటో ప్రజలే ఊహించుకోవలసిందే. తాను పాలించిన పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించానని అందమైన చిత్రాన్ని మనకు చూపించారు. ‘‘మోదీ గ్యారంటీ 2024’’ అని ప్రధానమైన కొత్త నినాదాన్ని మోదీ సృష్టించారు. హామీలు అమలు చేయకపోయినా ఆయన అనేక ఆకర్షణీయ నినాదాలు ఇస్తుంటారు. ఇక మేనిఫెస్టో పుస్తకం మీద ‘ఏక్‌ బార్‌, మోదీ సర్కార్‌’ అడంబరమే కనిపిస్తుంది గానీ హామీలు చట్టబద్దంగా నెరవేర్చేవి ఉండవు. అమలు జరిపేవీ కనిపించవు, విశ్వనీయమైనవీకావు. అన్నీ ‘మోసపు’ హామీలే. ఇక ప్రతిపక్షాలన్నీ అవినీతి, కుంభకోణాలలో మునిగిపోయాయని గత పదేళ్లనుంచి ఆరోపిస్తూ ప్రచారం నిర్వహించడంతో సరిపోయింది. తమ పార్టీ ప్రభుత్వాలు, మంత్రులు, నాయకులు చేసిన కుంభకోణాలు, అక్రమాలను గురించి అసలు ప్రస్తావించరు. ఎన్నికల ప్రణాళికలోని 25 అధ్యాయాలలో 24 అధ్యాయాలలో మోదీ గ్యారంటీలే కనిపిస్తాయి. వీటి అర్థం ఏమిటో ప్రజలే ఊహించుకోవాలి. అన్ని హామీలు, మాటలు అస్పష్టమైనవే. నిర్దిష్టమైంది ఒక్కటీ ఉండదు. వ్యాపార ప్రకటనలున్నట్లుగా మోదీ హామీలుంటాయి. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు కొత్తసమస్యలు లేవనెత్తి ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. తద్వారా ప్రభుత్వ తప్పిదాన్ని మభ్యపెడతారు. ఆయన గొప్పగా చెప్పే అభివృద్ధి అంతా సంపన్నులకేగానీ సామాన్య ప్రజలకు కాదు. 2014లో ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని, 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, 2025నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను మన దేశం సాధిస్తుందని గొప్ప, గొప్ప వాగ్దానాలు చేశారు. ప్రస్తుతం మూడు ట్రిలియన్ల డాలర్లకు ఆర్థికవృద్ధి సాదించామని ప్రచారం చేసుకుంటు న్నారు. భారతదేశంలో ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని అనేక జాతీయ, అంతర్జాతీయ సర్వేలు చెప్తున్నాయి.
76పేజీల ఎన్నికల ప్రణాళికలోనూ 67 చోట్ల మోదీ పేరు వచ్చింది. బీజేపీ నాయకులంతా మోదీ భజన చేస్తారు. అధికారమంతా మోదీ పరిధిలో కేంద్రీకృతమైంది. ఎన్నికల ప్రణాళిక వ్యాపారప్రకటన కరపత్రంలాగా ఉంది. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకుంటారు. అదెక్కడా కనిపించదు. మోదీ చెప్పినట్లు వినడమే కనిపిస్తుంది. మేనిఫెస్టోలో ఒకే ఒకపేజీలో మాత్రమే ‘‘పదేళ్ల మంచి పరిపాలన, వికాస్‌(అభివృద్ధి) ఉన్నాయి. ఇందులోనూ పొగడ్తలు, మోదీ పాలన సాధించిన కొన్ని విజయాలంటూ ఎంపికచేసినవిగా పేర్కొన్నారు. పైగా దీని పేరు ‘సంకల్ప యాత్ర’ అంటూ పేరుపెట్టారు. 25కోట్లమందిని పేదరికం నుండి బైటపడవేశామని, 2013 వరకు అనేకమంది ఆహారభద్రతా చట్టపరిధిలో ఉన్నారని తమ ప్రభుత్వ గొప్పతనమని పేర్కొన్నారు. మరోవైపు 80కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇస్తున్నామని మోదీ చెప్పారు. పేదరికం నుండి 25కోట్లమంది బైటపడిఉంటే, 80కోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ ఎందుకు? అన్నిటిలోనూ ఇలా ప్రజలను మభ్యపెట్టడంలో మోదీ ఆరితేరిన నాయకుడు. మోదీ ప్రకటనల్లో ‘ప్రియమైన’, ‘కుటుంబ సభ్యుల్లారా’ అనేపిలుపు మన దేశానికి సంబంధించిన వారిని ఉద్దేశించింది కాదు. ఆయన చర్యలు అత్యంత అధ్వాన్నంగా ఉంటాయి. రాజ కీయంగా, సైద్ధాంతికంగా అన్నీ తిరోగమ నాలే. ఆయనపాలన తరచుగా నియంతృత్వంగా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రణాళికలో మంచి పరిపాలన అని పేర్కొన్నారు. ఇది విచిత్రమైన వ్యవహారం.
ఎన్నికల ప్రణాళిక వాగ్దానాల సమీకరణలా ఉంది. అంతేకాదు, వాగ్దానాల సమీకరణ కాకుండా సేకరించిన ఆకాంక్షలు, లక్ష్యాలు అని చెప్పవచ్చు. మోదీ గ్యారంటీలు అనే మాటకు అర్థంలేకుండా పోయింది. గతపదేళ్లలో మోదీ ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చినట్లుగా పేర్కొన్నారు. మోదీ పదేళ్లకాలంలో పెట్టుబడీదారీ విధానం మరింత గాఢమైంది. పెట్టుబడీదారీ వ్యవస్థలో మోదీ కాలంలో 60శాతం జాతీయ సంపత్తిలో కేవలం 20కంపెనీలు ఎక్కువ స్వాయత్తం చేసుకున్నాయి. 70శాతం జాతీయ ఆదాయం వీరికే లభించింది. ఇక పేదలు ఎక్కడున్నారని మోదీ ప్రశ్నిస్తున్నారు. 97కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందడంలేదు. వలసలు వెళ్లిన 8కోట్ల మంది కార్మికులకు ఆహారధాన్యాలు సబ్సిడీ రేట్లపైన అందడంలేదు. వీరందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల కష్టాలకు సంబంధించిన వాస్తవాలు భీతిగొల్పుతున్నాయి. అయితే వీటన్నింటినీ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించకుండా కప్పిపెడుతున్నారు. కేవలం కొత్తకొత్త నినాదాలతోనే పరిపాలన సాగిస్తున్నారు. మన దేశ పథాన్ని 2024సార్వత్రిక ఎన్నికలు నిర్వచిస్తాయని నడ్డా చెప్పారు. ఎన్నికల ప్రణాళిక కమిటి చైర్‌ పర్సన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ, 140కోట్లమంది భారతీయుల అకాంక్షలను సంకల్ప పత్ర ప్రతిబింబిస్తుందని చెప్పారు. మన ఆకాంక్ష లను, కలలను నెరవేర్చేందుకు మోదీ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని రాజ్‌నాథ్‌సింగ్‌ మోదీని పొగిడారు. గత పదేళ్లకాలంలో విశిష్టతరహా సమ్మిళిత అభివృద్ధిని సాధించి ప్రపంచానికి చూపించామని పేర్కొన్నారు. అయితే ప్రణాళికలో చెప్పిన అభివృద్ధి క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించదు. అంతేగాక, ఆర్థిక, సామాజిక అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిమంది చేతుల్లోనే సంపద, ఆదాయాలు కేంద్రీకృతమైనప్పుడు అది సమ్మిళిత అభివృద్ధి ఎలా అవుతుంది? అసలు బీజేపీ మానిఫెస్టో అర్థం ఏమిటో నిజంగా ఎవరికీ అర్థంకాదు. తనపాలనలో పేదకుటుంబాలకు అనేక ప్రయోజనాలు కల్పించినట్లుగా ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మహిళా సాధికారత, యువతకు కొత్తఅవకాశాలు, రైతులకు ఊరట కల్పించినట్లుగా పేర్కొన్నారు. అలాగే వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలను 90శాతం వెనుకబడిన తరగతులకు కల్పించామని పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్‌సీ,ఎస్‌టీ వర్గాలకు మంత్రిపదవులు ఇచ్చామని ప్రణాళికలో చేర్చారు. అయితే వాస్తవంగా ఈ మంత్రులకు ఆచరణలో ఎలాంటి అధికారాలు కనిపించవు. అన్నీ మోదీ చేతులమీదుగానే జరుగుతాయి. ఎందుకంటే ఆయన పాలన ఏకవ్యక్తి పాలన.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img