Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బైటపడిన బీజేపీ అసలు స్వరూపం

వినయ్‌ విశ్వం

మణిపూర్‌ బీజేపీకి ట్రంప్‌ కార్డ్‌ లాంటిది. 2017లో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈశాన్య ప్రాంతమైన మణిపూర్‌లో తిష్టవేసేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. 60 మంది సభ్యుల మణిపూర్‌ అసెంబ్లీలో కేవలం బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 28 మంది సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, గవర్నర్‌ కార్యాలయం తారుమారు వ్యవహారాలు మణిపూర్‌లో బీజేపీ పట్టుకు దోహదపడ్డాయి. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో విద్వేష రాజకీయాలను ఒకదాని తర్వాత ఒకటిగా సమీప రాష్ట్రాలకు విస్తరించింది. మతపరమైన మైనారిటీవర్గాలు, గిరిజనులు బీజేపీకి సానుకూలంగా తమ అబద్ధాల ఫ్యాక్టరీలో కొత్త పథకం రూపొందించింది. దేశం నాలుగు దిక్కులా ఈ వ్యవహారాన్ని ప్రచారం చేసింది. ప్రస్తుతం తాను సృష్టించిన ఈ కథే ముక్కచక్కలైంది. మైనారిటీలు, గిరిజనులు, సమాజంలోని ఇతర వర్గాలలో బీజేపీ అసలు స్వరూపం బైటపడిరది. ఇది తాజాగా రాష్ట్రాన్ని కల్లోలంలోకి నెట్టింది. ఈశాన్య ప్రాంత ప్రజలకు అత్యంత సవాలుగా, కల్లోలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో ఓట్ల కోసం ప్రధాని తంటాలుపడటం చూశాం.
మొత్తం మణిపూర్‌లో హింసాకాండ చెలరేగడానికి హైకోర్టు ఉత్తర్వు కారణమైంది. మెయిటీలను ఎస్‌టీ జాబితాలో చేర్చేందుకుగాను కేంద్ర హోం శాఖకు సిఫారసు చేయాలని రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడంతో దీనిని రాష్ట్రంలోని గిరిజనులు నిరసించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు, నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వు రాష్ట్రంలో హింసకు ప్రేరేపణ కావచ్చు కానీ.. ప్రజలను విభజించి ఉద్రిక్తతలకు కారణమైన బీజేపీి విధానాలు రాష్ట్రంలో తీవ్ర గందరగోళానికి కారణమని స్పష్టమైంది. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే కుటిల నిరంకుశ ధోరణి రాష్ట్రాన్ని మరింత అగాధంలోకి నెట్టివేసింది. ఈ ఘర్షణలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రజల్లో విభేదాలు సృష్టించడం ద్వారా బీజేపీకి ఎన్నికలలో లాభించినప్పటికీ, సమాజంలో నెలకొన్న వినాశకరమైన పరిణామాలకు బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే బీజేపీ లక్ష్యం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌నే కాదు, మొత్తం ఈశాన్య భారతాన్ని ఛిద్రం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అశాంతితో మణిపూర్‌ ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం మొత్తం కర్నాటక ఎన్నికల రాజకీయాల్లో మునిగిపోయింది. ప్రజలను మత విద్వేషాలతో విభజించడం సమాజంలోని అన్ని వర్గాల వారి మధ్య బీజేపీ నాటుతున్న ద్వేషం, విభజన బీజాలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయనేది స్పష్టం. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడం, శాశ్వత శాంతిని నెలకొల్పడం కేంద్ర ప్రభుత్వం తక్షణ కర్తవ్యం. అయితే, తాజా సమస్యలపై బీజేపీకి సంకుచితత్వ ధోరణి ఫలితంగా ఇది కేవలం శాంతిభద్రతల సమస్యగా పరిగణించడమైంది. సాయుధ బలగాలు భారీగా మోహరించడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న అశాంతికి, హింసకు మూలమైన అంశాలను పరిష్కరించదు. తద్వారా ప్రజల్లో ప్రభుత్వం కలిగించిన తీవ్ర నిరాశా, నిస్పృహలు మణిపూర్‌లో హింసకు దారితీస్తున్నాయి. వీటిని రాజకీయంగా, సామాజికంగా పరిష్కరించుకోవల్సి ఉంది. ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రాతినిధ్య సంస్థలు, రాజకీయ పార్టీలను సంప్రదించి తగిన నిర్ణయాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలని సిపిఐ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మెయిటీలకు ఎస్టీ హోదాను సిఫారసు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంగీకరించినప్పటికీ, ఆ ఉత్తర్వుకు సంబంధించిన పరిధి పరిమితమైంది. సంప్రదింపులు ద్వారా దీర్ఘకాలిక సామాజిక సమస్యలను పరిష్కరించుకోవలసిఉంది. మణిపూర్‌లో ఈ విద్వేషం ఎలా, ఎందుకు పుట్టిందో దర్యాప్తు చేసి, దీనికి కారణమైన శక్తులను బయటపెట్టాలి. నిర్వాసితులైన వారికి తక్షణ పునరావాస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దారుణ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి తగిన పరిహారం కల్పించాలి. బీజేపీి-ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ మతతత్వ సైద్ధాంతిక ధోరణితో దేశాన్ని పాలించడానికి అనర్హులని దేశ ప్రజలకు గోచరిస్తోంది. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎన్నికల్లో తమ స్వప్రయోజనాల కోసం సమాజంలో చీలికలను సృష్టించడంద్వారా విద్వేషాలను రగిలిస్తున్నాయి. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ముఖ్యంగా కశ్మీర్‌, క్లిష్టమైన ఈశాన్య ప్రాంతాల్లో చర్చలు లేకుండా పరిపాలన అనుకూలించదు. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతికంగా, సంకుచిత మతతత్వధోరణితో ఏకఛత్రాధిపత్యానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ మతతత్వ సైద్ధాంతికత దేశంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలిగిస్తాయి. దేశంలో నెలకొన్న బీజేపీి పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కశ్మీర్‌లో బీజేపీ అమలుచేసిన విధానం ఘోరంగా విఫలమైన తర్వాత, ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితి మరింత జటిలం కాకుండా శాంతి, సామరస్యానికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఐక్య కార్యాచరణ యత్నాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయాల్సింది ప్రభుత్వాలే. మన రాజ్యాంగంలో నెలకొన్న లౌకికతత్వం, మన స్వాతంత్య్ర ఉద్యమ సమగ్ర వారసత్వంతో ప్రజలను ఐక్యం చేయడంద్వారా చైతన్యవంతులను చేయ వలసిన అవసరం ఉంది. మన దేశ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీపాలన ఆధారపడి ఉంది. ప్రజల మధ్య విద్వేషాల్ని రూపుమాపి ప్రేమ, కరుణ, సానుభూతితో మన దేశాన్ని శాంతి, పురోగతి, శ్రేయస్సుతో మున్ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img