Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

భారత్‌లో పత్రికాస్వేచ్ఛకు గడ్డుకాలం

డాక్టర్‌ సి.ఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి, 9059837847

ఒక పత్రిక పదివేల సైన్యంతో సమానం అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఇదే పద్ద్ధతిలో ఒక పత్రిక స్వేచ్ఛను హరిస్తే పది వేల గొంతుకల నుంచి వ్యక్తమయ్యే అసమ్మతిని అణచివేయవచ్చునని భారత ప్రభుత్వ పెద్దలు తలచినట్టున్నారు. ఇందుకు అనుగుణం గానే దేశంలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే పనిని తమ రాజకీయ అజండాలో భాగం చేశారు. మరో పక్క భారత ప్రధానిగా నరేంద్ర మోదీ విశ్వవేదికలపై భారత్‌ పత్రికా స్వేచ్ఛకు ఆలంబనగా, ఆలవాలంగా నిలుస్తున్నదని ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. గత ఏడాది జీ 7 దేశాల సదస్సుకు ఆహ్వానితుడిగా వెళ్లిన సందర్భంలో చేసిన ప్రసంగాన్ని చూస్తే ఆహా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఇంతగా వర్థిల్లుతోందా అనే సందేహం రాకమానదు. అయితే దేశంలోని వాస్తవపరిస్థితి ఇందుకుభిన్నం. కేంద్ర ప్రభుత్వం వ్యవహారశైలిని నిత్యం ఎండగడుతున్న ప్రత్యామ్నాయ మీడియాను కూడా తమ అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్న మోదీ, అమిత్‌ షాల ధ్వయం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మీడియాపై అణచి వేతను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితి మీడియా రంగానికి గడ్డుకాలమే.
రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అనే మాధ్యమాల పర్యవేక్షణ పరిశోధనా సంస్థ ప్రపంచంలోని 180 దేశాలకు సంబంధించి ఆయా దేశాల్లో అమలవుతున్న పత్రికాస్వేచ్ఛపై జరిపిన సర్వేను విడుదలచేసింది. పత్రికాస్వేచ్ఛలో భారతర్యాంకింగ్‌ 161గా తేల్చింది. 2023 రిపోర్టును పత్రికాస్వేచ్ఛ దినం నేపథ్యంలో బుధవారం విడుదల చేసింది. ఈ నివేదికను పరిశీలిస్తే దేశంలో పత్రికా స్వేచ్చ పాలకుల మాటల్లో తప్ప నిజం కాదని తేలిపోయింది. ఇదే సంస్థ 2022లో విడుదల చేసిన నివేదికలో భారత్‌ 150వ స్థానంలోనూ, 2021లో 142వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే గత మూడేళ్లుగా భారత్‌లో పత్రికా స్వేచ్ఛ అడుగంటిపోతున్న విషయం బహిర్గతమవుతోంది. నార్వే లాంటి చిన్నదేశం పత్రికాస్వేచ్చలో ఉన్నతమైన ర్యాంకింగ్‌ పొందడం… భారత్‌కు పక్కనే ఉన్న శ్రీలంక, భూటాన్‌ వంటి దేశాలు మనకన్నా మెరుగైన స్థానాల్లో ఉండడం నిజంగా ప్రభుత్వం తలదించుకోవలసిన అంశమే. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు సన్నగిల్లు తున్న పత్రికాస్వేచ్ఛ వార్తలను ప్రధానపత్రికల్లో రాకుండా అపగలరేమో కానీ ప్రపంచస్థాయిలో పోతున్న మన పరువును కాపాడలేరు.
ఈ దారుణపరిస్థితికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. జర్మలిస్టులపై, తమకు గిట్టని పత్రికల యాజమాన్యాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కక్ష కడుతున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవు తోంది. తమ విధానాలను గుడ్డిగా సమర్థించే సంస్థలను ఒక విధంగా, తమ విధానాలను ప్రశ్నించే మీడియాసంస్థలను మరోవిధంగా చూడడం తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా ప్రధానంగా పాత్రికేయులే లక్ష్యంగా దాడులు తీవ్రమయ్యాయి. ఒక సర్వే ఆధారంగా జర్నలిస్టు లపై నమోదవుతున్న అనేక క్రిమినల్‌ కేసుల్లో బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ అగ్రస్థానంలో ఉంది. 2018లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ఘటనకు సంబంధించిన సమాచార సేకరణకోసం కేరళకు చెందిన జర్నలిస్ట్‌ సిద్ధికప్పన్‌ ఆ ప్రాంతానికి వెళుతుండగానే అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారు. అనంతరం ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీరులోనే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులపై నిర్భందాలకు దిగుతున్నాయి. జర్నలిస్టులకు సాధారణంగా మంజూరు చేసే అక్రిడేషన్లు పెద్ద ప్రహసనంగా మార్చి వేస్తున్నాయి. జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలి కొదిలేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ పని చేయకుండా అడ్డుకునేలా ప్రభుత్వాలే వివిధజీవోలు విడుదల చేయిస్తున్నాయి. ఏపీలో పాఠశాలల విలీనం అంశంపై ఎవరు వార్తలు రాసినా ఆ జర్నలిస్టులపై కేసులు పెట్టాలని గత ఏడాది ఏపీ విద్యాశాఖ వివిధ జిల్లాల డీఈవోలను ఆదేశించిన స్థాయికి ప్రభుత్వ నియంతృత్వం పెరిగింది. పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక సందర్భంలో మాట్లాడుతూ…పత్రికా స్వేచ్ఛలేకపోతే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందదని…ప్రజాస్వామిక డిమాండ్లు ఎన్నటికీ నెరవేరవని అన్నారు. ప్రభుత్వాలకు పదునైన కలాలు అంటే గిట్టడం లేదు. దేశంలో పత్రికాస్వేచ్ఛ రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం బహిర్గతం అవుతున్నా తమ పాలనలో పత్రికా స్వేచ్ఛకు కొదవ లేదని పాలకులు చేస్తున్న వాదన వితండవాదమే అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img