Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

భారత్‌ రంగ్‌ మహోత్సవ్‌ 2023

ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనల్లో భాగంగా ఫిబ్రవరి 19`23 వరకు రాజమహేంద్రవరంలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఎన్‌ఎస్‌డీ) 22వ భారత్‌రంగ్‌ మహోత్సవ్‌ 2023(థియేటర్‌ ఫెస్టివల్‌) చేపట్టింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటీష్‌ వారిని గడగడలాడిరచిన ఘనత తెలుగు నాటకరంగానికి దక్కుతుంది. తెల్లవారి నిషేధాజ్ఞలకు వెరవకుండా తెలుగు రచయితలు చాలా నాటకాలను రాశారు. తెలుగు రంగస్థలాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి రాజమహేంద్రవరంలో ఎన్‌ఎస్‌డీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎన్‌ఎస్‌డీని 1959లో న్యూదిల్లీలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఎన్‌ఎస్‌డీ భారతీయ నాటకరంగానికి, ప్రపంచ నాటకరంగానికి గణనీయంగా దోహదపడిరది. ఎన్‌ఎస్‌డీ పూర్వ విద్యార్థులలో నసీరుద్దీన్‌ షా, ఓం పురి, అనుపమ్‌ ఖేర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, నవాజుద్దీన్‌ సిద్ధ్కి వంటి ప్రముఖ భారతీయ చలనచిత్ర నటులు ఉన్నారు. తెలుగు నాటకరంగం దాదాపు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి మూలాలను కలిగి ఉంది. సినిమారంగంపై ఆదరణ పెరగడంతో చాలా మంది దర్శకులు, నటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమకు వలస రావడంతో నాటకరంగంలో ఆవిష్కరణలు తగ్గాయి. జాతీయ నాటకరంగంతో పోలిస్తే పేలవమైన పనితీరు ప్రమాణాలు, నూతన ఆవిష్కరణలు లోపించడంతో ఆంధ్రప్రదేశ్‌ లోని నాటకరంగం అంతరించే దశలో ఉంది. 15వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో శ్రీనాథుడు రచించిన సంస్కృత నాటకం ప్రేమాభిరామం’’ ను అనుకరిస్తూ తొలి తెలుగు అనువాద నాటకం ‘క్రీడాభిరామం’ ను వెలువరించారు. 19వ శతాబ్దంలో, ఆధునిక నాటక రచనకు ఆద్యులైన కోరాడ రామచంద్ర శాస్త్రి 1860లో తొలి తెలుగు స్వతంత్ర నాటకం ‘మంజరీ మధుకరీయం’ను 1903లో ముద్రించారు. నాటక రంగంలో ‘‘సురభి’’ ప్రత్యేకతను సంతరించుకుంది. గ్రామాల్లో నాటకాలు వేస్తూ సంచారజీవనం సాగిస్తున్న కుటుంబ సమూహాల అరుదైన సంస్థలు సురభి నాటక సంస్థలు. మహిళలను తొలిసారిగా వేదికపైకి తీసుకొచ్చి, టికెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. జిమ్మిక్కులు, ట్రిక్‌ సన్నివేశాలు నాటకంలో ప్రవేశపెట్టింది ఈ సురభి బృందాలే. 1885 నుండి నేటికి దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. 1897వ సంవత్సరంలో ‘‘కన్యాశుల్కం’’ నాటకం రంగస్థలం మీదకు వచ్చింది. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం నాటక రంగ చరిత్రనే ఓ మలుపు తిప్పింది.
నిత్య జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో ప్రజానాట్యమండలి స్థాపించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసిన ప్రజానాట్యమండలి 1943లో స్థాపించడమైంది. ఇప్పటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది. భారత ప్రజానాట్యమండలి(ఇష్టా) వ్యవస్థాపక కార్యదర్శిగా గరికపాటి రాజారావు తదితరులు పనిచేశారు. 120 సంవత్సరాల తెలుగు నాటక చరిత్రలో ఉహాలోకంలో విహరిస్తున్న నాటకాన్ని భూమార్గం పట్టించి ఒక మలుపు తిప్పింది ప్రజా నాట్య మండలి. ‘‘నటన’’ నే వృత్తిగా తీసుకొని ప్రత్యేకంగా సాంఘిక నాటకాలు ప్రదర్శించటం ప్రారంభించాయి. ఏ ఊళ్ళో నాటక ప్రదర్శనలు జరిగినా చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి జనాలు బళ్ళు కట్టుకుని మరీవెళ్ళి వాటిని చూసొచ్చేవారు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందనతో సామాజిక పరిస్థితుల్ని, సంఘటనల్ని తీసుకుని పుంఖాను పుంఖంగా నాటకాలు రచించారు. ముఖ్యంగా ‘‘గరికపాటి’’ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘‘మా భూమి, ముందడుగు, ఇనుప తెరలు’’, గొల్లపూడి ‘‘రాగ రాగిణీ, కళ్ళు’’, బెల్లంకొండ రామదాసు ‘‘పునర్జన్మ’’, పినిశెట్టి గారి ‘‘పల్లెపడుచులు’’, ఉన్నవ ‘‘మాలపల్లి’’, ఎన్నార్‌ నంది ‘‘మరో మొహంజోదారో’ ఇలా ఎన్నో ఎన్నెన్నో 1950 నించి 1960 వరకు ఎన్నోచోట్ల ఎన్నెన్నో సార్లు ప్రదర్శించారు. ప్రజల్లో పోరాటస్ఫూర్తిని నింపాయి. తరువాత కాలంలో నాటకాలు టికెట్టు పెట్టుకొని హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రోజు రెండు ప్రదర్శనలతో అనేక ప్రదర్శనలు ప్రదర్శించిన చరిత్ర, టికెట్లు దొరకని వారు అర్ధరాత్రి గొడవచేసి మరో ‘‘షో’’ వేయించుకున్న సందర్భాలచరిత్ర ప్రజానాట్య మండలికి ఉంది.
1880లో మహారాష్ట్రకు చెందిన ‘‘ధార్వాడ నాటక సమాజం’’ మన రాష్ట్రానికి వచ్చి హిందీ నాటకాల్ని గోదావరి, కృష్ణా జిల్లాలలో ప్రదర్శించారు. వీరు రాజమండ్రి శ్రీ విజయనగరం మహారాజా బాలికా పాఠశాలలో నాటకాల్ని ప్రదర్శించారు. అలా వీరు తెలుగు నాటకకారులలో ప్రేరణ కలిగించారు. ధార్వాడ వారి నాటకాలతో స్ఫూర్తిపొందిన కందుకూరి వీరేశలింగం పంతులు ధార్వాడప్రదర్శించిన వేదికపైనే తొలిసారిగా వ్యవహారిక భాషలో రాసిన ‘వ్యవహార ధర్మబోధిని’ నాటకాన్ని ప్రదర్శించారు. వేదం వెంకటరాయ శాస్త్రి చారిత్రాత్మక నాటకం ‘‘ప్రతాప రుద్రీయం’’ కూడా బహుళా ప్రేక్షకాదరణ పొందటంతో చాలామంది కవులు తమ దృష్టిని నాటక రచనవైపు సారించారు. చిలుకమర్తి, పానుగంటి, కాళ్ళకూరి, శ్రీపాద, బలిజేపల్లి వంటి ప్రముఖ కవులు ‘‘కావ్యేషు నాటకం రమ్యం’’ అంటూ నాటక రచనకు మూడు దశాబ్దాల పాటు చారిత్రక, సామాజిక, పౌరాణిక, గద్య పద్య, గేయాత్మక నాటక ప్రదర్శనలు ఆంధ్ర దేశమంతా కొనసాగాయి. 1960 తర్వాత తెలుగు నాటకం మరింత ఆధునికతను సంతరించుకుంది.
నాటక రంగాన్ని, ఒక మహానటుడ్ని ఆంధ్రలోకం ఎలా నిరాదరిస్తుందో రంగస్థలంపై ఆవిష్కరించిన భమిడిపాటి వారి ‘కీర్తిశేషులు’ వంటి నాటకం వచ్చిన కాలమది. ఈ కాలంలోనే గొల్లపూడి మారుతీరావు, దాసం గోపాలకృష్ణ, ఆర్‌.వి.యస్‌.రామస్వామి, మోదుకూరి జాన్సన్‌, గన్పిశెట్టి వెంకటేశ్వరరావు, భీశెట్టి లక్ష్మణరావులాంటి రచయితలు వారి కలాల్ని సంధించారు.1980 తర్వాత కూడా నాటికల జోరు కొనసాగుతూనే ఉంది. 20వ శతాబ్దం చివరలో అంటే 1998 సంవత్సరంలో ప్రభుత్వం నంది నాటకపోటీలు ప్రారంభించింది. ప్రతీ సంవత్సరం కొత్త సాంఘిక నాటకం రావాలనే నిబంధన నాటకాల జీవితాన్ని ఒక సంవత్సరానికే కుదించేసి, కొన్ని సందర్భాల్లో ఒక్క ప్రదర్శనకే తగ్గించేసి సాంఘిక నాటకం నడుము విరిగినట్టు చేస్తున్నది. ఈ నిబంధన పౌరాణిక నాటకాలకు లేని కారణంగా నంది నాటకాల్లో పౌరాణిక నాటక ప్రమాణాలు పెరుగుతువచ్చాయి.
ఆర్‌.మల్లికార్జునరావు, 9491659899
భాషా సాంస్కృతికశాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img