Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారమైన రవాణా కార్మికుల బతుకుబండి

రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనది, రవాణా మౌలిక సదుపాయాలు దేశం పురోగతికి వేగం సామర్థ్యాన్ని పెంచుతుంది. వస్తువుల రవాణా, పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం రవాణా రంగం. అంతటి ప్రాధాన్యత కలిగిన రవాణా రంగానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవస్థలో రవాణా రంగం అతి కీలకమని గుర్తించి ప్రభుత్వాలు తోడ్పాటు నిచ్చినట్లయితే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. రవాణారంగంలోకి రోజురోజుకీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించడంతోపాటు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల ఆ మార్పులకు అనుగుణంగా సిబ్బందిని సిద్దం చేయడం కష్టమవుతోంది. గత రెండు సంవత్సరాలుగా డీజిల్‌, పెట్రోల్‌ ధరలు డెబ్భై శాతం పెరగడంతో రవాణారంగానికి గడ్డుకాలం ఏర్పడిరది. మరోవైపు రవాణ, పోలీసు అధికారులు వేస్తున్న ఫైన్లు, చలాన్లు బాణాలై గుచ్చుకుంటున్నాయి. ఫైనాన్స్‌ కంపెనీలు పెనాల్టీలు, అధిక వడ్డీల రూపంలో జలగలై రక్తం జుర్రేస్తున్నాయి. ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆగిన మూడుచక్రాల బతుకు బండిని చూసి వెక్కిరిస్తున్నాయి. వెరసి ఆటోవాలా బతుకు బండి ప్రయాణం అతుకుల గతుకుల్లో అస్తవ్యస్తంగా సాగుతోంది. రెండు తెలుగురాష్ట్రాలలో ప్రత్యేక పరిశ్రమలు పెద్దగా లేకపోవడంతో యువకులు, నిరుద్యోగులు ఉపాధి కోసం రాష్ట్రం విడిచి వలస వెళ్లే కన్నా ఉన్న ఊరిలో జీవించడం మేలు అన్న చందంగా చాలా మంది యువకులు నిరుద్యోగులు ఆటోరంగాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవాణా రంగం అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారింది. ప్రతి జిల్లాలో సుమారు 50 వేల దాకా ఆటోలు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి సుమారు 50 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం ఉపాధి చూపకపోయినా ఆటో నడపడం ద్వారా వచ్చే కాస్తంత ఆదాయంతో బతుకుబండిని లాగుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే ఆటో డ్రైవర్లు కోలుకుంటుండగా పోలీసులు, ఆర్‌టిఎ అధికారులు చలాన్ల పేరుతో అస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. అసలే పెంచిన పెట్రోల్‌ డీజిలు ధరలు అటో డ్రైవర్ల నడ్డి విరుస్తుండగా మరో వైపు అధికారుల వేధింపులు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పరిస్థితి తయారయింది.
కొత్తగా ప్రవేశపెట్టిన వాహనాల చట్టాలను అనుసరించి జరిమానాల ఛార్జీలు రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు మించి ఉండడంతో నెలంతా సంపాదించిన సొమ్ము పైన్లకే చెల్లించాల్సివస్తోంది. దీనితో ఫైనాన్స్‌ కింద వాహనాన్ని తెచ్చుకుని నిర్వహించే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. వచ్చినదంతా చలాన్లకే చెల్లించాల్సి రావడంతో నెలనెలా ఫైనాన్స్‌ కంపెనీలకు చెల్లించాల్సిన కంతులు పెండిరగ్‌ పడుతున్నాయి. ఏ ఒక్క నెలకంతు గడువు కాలంలో చెల్లించకపోయినా రూ.వందలు, వేలు పెనాల్టీ పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. లేదంటే బండిని సీజ్‌ చేసి గోడౌనుకు తరలిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది ఆటో డ్రైవర్లు ఫైనాన్స్‌ కంపెనీలో లోన్లు తీసుకుని నడుపుతున్నారు. జిల్లాల్లో పదుల సంఖ్యలో అక్కడక్కడా ఆటో జీవనం సాగించలేక అప్పుల బాధతో బలవన్మరణాలకు పూనుకన్న ఘటనలూ తారసపడ్డాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితులు కుదుటపడే వరకు వారి పట్ల అధికారుల వేధింపులు, ఫైనాన్షియర్ల వేధింపులు లేకుండా అండగానిలిచి అదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. దేశీయ రవాణా అనేది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం, రవాణా సమస్యలు మరియు మౌలిక సదుపాయాల జాప్యాలు దేశం యొక్క పురోగతిని ప్రభావితం చేస్తాయి. లారీ యజమానులు, డ్రైవర్లు లోడ్‌మెన్‌ సరుకులను నిర్వహించడంలో రవాణా చేయడంలో విశేషమైన సేవ అందిస్తున్నారు. వారికి ప్రభుత్వం మౌలిక కనీస సౌకర్యాలు కల్పించాలి. భద్రతా చర్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత లారీ యజమానులు, ప్రభుత్వంపై ఉంది. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. అధికశాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోడ్డు భద్రతపై ప్రజలందరికీ అవగాహన కల్పించేలా ప్రతి యేటా వారోత్సవాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘రోడ్డు భద్రత-ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే నినాదం మాటలకే పరిమితమవుతోంది. రయ్‌ రయ్‌ మంటూ వేగంగా దూసుకెళుతుండడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలను పాటించాల్సిన బాధ్యత వాహనదారులపై ఉంది. నిబంధనలు పాటించడం లేదని విషయం ఇటీవల జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే తెలుస్తోంది. రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడం మానవ తప్పిదం అయితే, రోడ్లు, ఫ్లైఓవర్లను ఇంజనీరింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించకపోవడం ఆయా ప్రభుత్వ శాఖలది తప్పు. ఎవరో చేస్తున్న తప్పును మరొకరు బలవుతున్న పరిస్థితులు రోడ్డు ప్రమాదాల వల్ల స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప తర్వాత మళ్లీ ఆ విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చాల నగరాలలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో డిజైన్‌ లోపం ఉందనే విషయాన్ని రోడ్దు భద్రత అంశంపై పనిచేస్తున్న నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. దీనిపై సలహాలు, సూచనలు ఇస్తున్నా వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంజనీరింగ్‌ తప్పిదాలు, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించక పోవడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో ఇంజనీరింగ్‌ తప్పిదాలు చాలా ఉంటున్నాయి. ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగిస్తూ రోడ్డు నిబంధనలను పాటించాలనే విషయాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించాలి. అలాగే ట్రక్కు, రవాణా డ్రైవర్లకు ప్రతి పదిహేను కిలోమీటర్లకు టీ, కాఫీ, మంచినీరు, మజ్జిగ, లస్సి, బిస్కెట్‌, బ్రెడ్‌ బేకరీ ఐటమ్స్‌ అందుబాటులో ఉండాలి. ప్రతి యాభై కిలోమీటర్లకు కనీసం మూడు క్యాంటిన్లు ఉండేట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
డాక్టర్‌ ముచ్చుకోట సురేష్‌బాబు,
ప్రజాసైన్స్‌ వేదిక, అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img