Friday, April 26, 2024
Friday, April 26, 2024

సామాజిక శాస్త్రాలను విస్మరించరాదు

ఐ.ప్రసాదరావు

ఈ రోజు మనం చూస్తున్న, నివసిస్తున్న ఈ నవ నాగరికత ప్రపంచం ఇలా ఉండటానికి కారణం అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలు. తద్వారా, నాగరికత రోజు,రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఒక సమాజం (లేదా) దేశం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి సాధించాలంటే సామాజిక శాస్త్రాలు, చరిత్ర, పౌరశాస్త్రం, రాజనీతి, ఆర్థిక, తత్వ,కళా,న్యాయ శాస్త్రాలు తప్పకుండా అధ్యయనంచేయాలి. చరిత్ర తెలుసుకోవడం ద్వారానే భవిష్యత్తును రూపుదిద్దుకోగలం. గతంలోజరిగిన మంచి, చెడు సంఘటనలు తెలుసుకోవడం ద్వారా వర్తమాన, భవిష్యత్తును తీర్చుదిద్దుకోగలరు.
ఇటీవల చాలామంది తల్లిదండ్రులు సామాజిక శాస్త్రాలు చదవడానికి తమ పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదు. త్వరితగతిన చదువు పూర్తి చేసుకుని, లక్షల డబ్బులు ప్యాకేజీలు చేతికి వచ్చే చదువులకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుత సమాజంలో అనేక అసమానతలకు కారణం అవుతుంది. ‘‘చదువు అంటే కేవలం డబ్బు సంపాదించడమే’’ అనే ధోరణి అందరిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ‘‘సమాజంలో అందరం బాగుండాలి-అందులో నేను ఉండాలి’’ అనే భావన మటుమాయం అవుతుంది. చివరికి తనను కన్న తల్లిదండ్రులను సైతం చివరి దశలో చూసే పరిస్థితి కనుపడుట లేదు. వ్రద్ధాశ్రమాలే శరణ్యం అవుతున్నాయి. ముక్కు పచ్చలారని మూడేళ్ల వయసులోనే కుటుంబ సభ్యులకు దూరంగా చదువు పేరుతో హాస్టల్లో చేర్పిచడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ అనురాగాలు దూరం అవుతున్నాయి. పెద్ద అయిన తరువాత కూడా తమ తల్లిదండ్రుల కోసం పరితపించే పరిస్థితి కనుపడుట లేదు. అంతా డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడమే…. దీనికి అంతటికీ కారణం సామాజిక శాస్త్రాల్లో కనీస అవగాహన లేకపోవడం. తల్లిదండ్రులు ప్రేమకు దూరంగా ఉండటం….
ఒక దేశాధినేత సరిగా పాలించడంలేదు అంటే మనం సింపుల్‌గా హిట్లర్‌తో పోలుస్తాం. హిట్లర్‌ చరిత్ర అలా మారడానికి కారణం, ప్రపంచ యుద్ధాలకు కారణాలు, ఫలితాలు వంటివి పూర్తిగా అవగాహన చేసుకోవాలి అంటే చరిత్ర చదవాలి. ఈఫిల్‌ టవర్‌, తాజ్‌ మహల్‌ వంటివి నిర్మాణాలు, ప్రపంచ భౌగోళిక స్వరూపాలు, వివిధ దేశాల స్వాతంత్య్ర సమరాలు, వివిధ వాతావరణాలు, భాషలు, మతాలు, ఖగోళ విజ్ఞానం, పరిపాలన, మానవ హక్కులు, బాధ్యతలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, విధులు, విదేశాంగ విధానాలు, ఉగ్రవాదం, మతతత్వం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాలు మానవ సంబంధాలు వంటివి తెలుసుకోవాలంటే సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మహాత్మా గాంధీ, నెల్సన్‌ మండేలా, అబ్రహం లింకన్‌, అంబేద్కర్‌ వంటి వారు ఎవరు అని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది…ఎంత బాధాకరం. పౌర సమాజమా ఆలోచన చేయాలి…? మానవ సంబంధాలను మట్టిలో కలిపేస్తున్నారు.
ప్రపంచాన్ని కుదిపివేసిన జాతి వివక్షత, నేటికీ మనదేశంలో కొనసాగుతోంది. కుల, మత, లింగ వివక్షత గూర్చి పూర్తి విషయాలపై అవగాహన కోసం, శరణార్థులు, వలసలు వంటి అంశాలపై నూతన పట్టుకొసం సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేయాలి. మన దేశ స్వాతంత్య్ర పోరాటం, మనదేశంలో, రాష్ట్రాల్లో ప్రస్తుత పరిపాలన, ప్రభుత్వ విధానాలు, అధిక ధరలు, నిరుద్యోగం, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా పోరాటాలు, నిరసనలు విశ్లేషణ చేయాలి. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవడం వంటి విషయాలు తెలుసుకోవడం కోసం సామాజిక శాస్త్రాల అధ్యయనమే ప్రధానం..అప్పుడు మాత్రమే ప్రతీ ఒక్కరూ సమసమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవడానికి అవకాశం ఉంటుంది. లేనిఎడల అసమానతల సమాజంలో మానసిక అశాంతితో బ్రతికే పరిస్థితే….’’ మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే’’ అని కార్ల్‌మార్క్స్‌ ఎప్పుడో తెలిపారు. మరి ఈ సమాజంలో మానవులు అంతా ఫ్రెంచ్‌విప్లవం ఆశయాలు శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వంతో జీవించాలంటే సామాజిక శాస్త్రాలు తప్పకుండా అధ్యయనం చేయాలి. ‘‘టర్న్‌ ది పేజ్‌ – లెర్న్‌ ది లెసన్‌’’ అనే నానుడి ఉంది. అనగా గత చరిత్ర, సంఘటనలు తెలుసుకోవడం ద్వారానే భవిష్యత్తును రూపుదిద్దుకోగలం. మానవుడు జీవించడానికి డబ్బులు కావాలి. కానీ డబ్బే సమస్తం అని భావించడం అతి ప్రమాదకరం. డబ్బు, ఆధిపత్యం, అధికారం ఈ మూడే ప్రపంచానికి పెనుప్రమాదం అని గ్రహించాలి అంటే సమాజంపై అవగాహన అవసరం. ఇప్పటి వరకూ ప్రపంచంలో సంభవించిన అనేక సంఘటనలకు ఈ మూడు అంశాలే కారణం. అరిస్టాటిల్‌ చెప్పినట్లు ‘‘మానవుడు సంఘజీవి’’ అనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణానికి మానవులు అందరూ ఒక క్రమ పద్ధతిలో తమ వంతు పాత్ర పోషించాలంటే, సామాజిక శాస్త్రాలు చదవాలి. మానవ సంబంధాలు ద్వారా మహోన్నత సమాజాన్ని నిర్మించగలం అని అందరూ భావిద్ధాం…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img