Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

బ్రాండిక్స్‌ ప్రమాదాలపై ఇంత నిర్లక్ష్యమా…

జె.వి.సత్యనారాయణ మూర్తి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సెజ్‌లో వరుసగా జరుగుతున్న విషవాయువుల లీకేజీ ఘటనలు ప్రజాసమూహాల్ని, కార్మిక లోకాన్ని తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల్లో రెండు సార్లు విషవాయువులు లీక్‌ అవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. సెజ్‌లోని, బ్రాండిక్స్‌ వస్త్ర పరిశ్రమలో జూన్‌ 3 వ తేదీన లీకైన విషవాయువు కార్మిక లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పరిశ్రమలో పని చేస్తున్న వందల మంది ఆ విషవాయువు ప్రభావానికి లోనయ్యారు. విషవాయువు లీక్‌ అయిన తరుణంలో ఘాటైన వాసనలు ఆ చుట్టపక్కల వేగంగా వ్యాప్తి చెందిన క్రమంలో అక్కడ పని చేస్తున్న వందల మంది కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది పరిశ్రమ బయటకు పరుగులు పెట్టారు. శ్వాస తీసుకోవడంలోనే తీవ్ర ఇబ్బందులు పడుతూ పరిశ్రమ బయటకు పరుగులు తీయడాన్ని ప్రజలంతా గమనించారు. విషవాయువుల ప్రభావానికి లోనైన వారంతా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఎక్కడికక్కడ కుప్పకూలారు. వారందరినీ ఆసుపత్రికి తరలించినా వెంటనే కోలుకోలేనంతగా ఆ విషవాయువుల ప్రభావానికి లోనయ్యారనే విషయం తెలిసిందే. మంగళవారం నాటి ప్రమాదంలోనూ ఇదే తరహా సీన్‌ పునరావృతం అవడం చాలా విషాదకరం.
జూన్‌ 3న సెజ్‌లో ఉన్న సీడ్స్‌ ఇంటిమేట్‌ అప్‌రెల్‌ (బ్రాండెక్స్‌) సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వం, యాజమాన్యం చాలా చిన్న సమస్యగా పరిగణించినట్టు తాజా ప్రమాదంతో స్పష్టమైంది. నాడు విషవాయువులు లీక్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం అవడంతోనే వరుస ప్రమాదాలకు బ్రాండిక్స్‌ నెలవుగా మారింది. జూన్‌ 3 నాటి ప్రమాదంలో తొలుత అమ్మోనియా వాయువు లీక్‌ అవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, అనంతరం క్లోరిన్‌ వాయువు కారణమని రకరకాల కారణాల్ని ప్రస్తావిస్తూ అసలు ప్రమాదం జరిగిన సంస్థపై చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించలేదు. కేవలం వాయువులు లీక్‌ అవడానికి కారణం పోరస్‌ లేబరేటరీ అని భావించి దాన్ని రెండు రోజులు మూసివేయాలని ఆదేశించి చేతులు దులుపుకుంది. విషవాయువులు లీకైనట్టు చెబుతున్న పోరస్‌ ల్యాబ్స్‌లో అమ్మోనియా, క్లోరిన్‌ రసాయినాల వాడకం లేదని తెలుస్తోంది. పైగా ఆ ల్యాబ్‌ బ్రాండెక్స్‌కు పరిశ్రమకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజంగానే పోరస్‌ ల్యాబ్‌లో విషవాయువులు లీక్‌ అయి ఉంటే అక్కడున్న ఎమర్జెన్సీ విభాగం స్పందించి ఉండాలి. తప్పు వారిదే అయి ఉంటే సహాయక చర్యలు అయినా చేపట్టి ఉండాలి. అవేవీ జరుగలేదు. పైగా పోరస్‌ ల్యాబ్‌ వద్ద ఉన్న చెట్లపై లీకైనట్టు భావిస్తున్న విషవాయువుల ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఈ క్రమంలో విషవాయువులు బ్రాండిక్స్‌లోనే లీకైనట్టు తెలుస్తోంది. విశాఖలో జరిగిన ఘోర ప్రమాదం అయిన హిందుస్తాన్‌ పాలిమర్స్‌ ప్రమాదం ఉదంతంలో మనుషులే కాక పక్షులు, పశువులు, చెట్లు ఎలా నాశనమయ్యాయో అందరి కళ్ళముందు ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరగుతున్న ప్రమాదాలపై యాజమాన్యాలు సహా ప్రభుత్వం వైపు నుంచి కూడా వాస్తవ విరుద్దమైన ప్రకటనలు వెలువడు తున్నాయి. ప్రమాదం ఎక్కడ, ఎలా జరిగిందన్న అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్పందించినా చేపట్టింది తూతూ మంత్రం చర్యలే.
ఆ పరిశ్రమలో జరుగుతున్న వరుస ప్రమాదాల పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనేది సుస్పష్టం. గతంలో ప్రమాదం జరిగిన తరుణంలో ఆ పరిశ్రమలో పని చేస్తున్న బాధితులను పరామర్శించినప్పుడు అనేక విషయాలను సీపీఐ ప్రతినిధి బృందంగా గమనించాము. వాయువుల ప్రభావానికి లోనైన బాధితుల్లో పురుషులు మాత్రం రెండు రోజుల్లో కోలుకున్నట్టు గుర్తించాం. మహిళలపై ఆ విషవాయువుల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. విషవాయువులు మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిన కారణంగానే వారు చాలా ఆలస్యంగా కోలుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బాధిత మహిళలు దీర్ఘకాలంలో కేన్సర్‌ వంటి భయంకర వ్యాధుల బారినపడే అవకాశం ఉందనే భయం నెలకొంది. శ్వాసకోశ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటు గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలుంటాయనే ఆందోళనా ఉంది. రుతుక్రమంలోనూ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
సీపీఐ అంచనాలకు, ఆ ప్రమాదంపై పరిశీలన జరిపిన రసాయనిక శాస్త్రవేత్తల అంచనాలకు దగ్గర సంబంధం వెలుగులోకి వచ్చింది. జూన్‌ 3న జరిగిన ప్రమాదంపై 24 మంది రసాయన శాస్త్ర ఆచార్యులు ఒక పరిశీలన చేపట్టారు. తాము గ్రహించిన అంశాలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారికి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో పరిశ్రమల్లో వినియోగించే రసాయినాల కారణంగా విడుదలయ్యే విషవాయువుల ప్రభావం బాధితులపై ఏ మేరకు ఉండే అవకాశం ఉందో సవివరంగా ప్రస్తావించారు. ప్రధానంగా బట్టల పరిశ్రమల్లో వినియోగించే రసాయినాల ద్వారా ఏర్పడే ప్రమాదాలపై పరిశోధనాత్మకంగా ఆ లేఖలో పొందుపరచారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పరిశోధనల ఫలితాలను కూడా ఆ లేఖకు జతపరిచారు. తాజా ప్రమాదంలో విషవాయువులు పీల్చుకున్న వారు క్యాన్సర్‌ ముప్పును ఎదుర్కొనే అవకాశాలు బలంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బట్టలు తయారు చేసే పరిశ్రమలలో చేసిన పరిశోధన పత్రాలు కూడా జత చేశారు. వస్త్ర పరిశ్రమలోనే వివిధ ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్టు తెలిపారు. వస్త్ర పరిశ్రమల్లో వినియోగించే రసాయినాల వివరాలను ముందుగానే అక్కడ పని చేయాలని భావించే వారికి వివరించి వారి ఇష్ట ప్రకారమే పని చేయించుకోవాల్సిన నియమాలున్నట్టు గుర్తు చేశారు. సీపీఐ ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అర్థమవుతోంది.
ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక ఇచ్చినా దాన్ని బహిర్గతం చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అవుతుంది. రెండు నెలల కిందట జరిగిన ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టి ఉంటే మళ్లీ అదే పరిశ్రమలో మరో ప్రమాదం జరిగి ఉండేది కాదు. గాలి నాణ్యతను పరిశీలించేందుకు సాధారణ యంత్రాలనే యాజమాన్యం వాడుతోందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నిర్దుష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ఆ పరిశ్రమలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా యాజమాన్యం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం దారుణం. ప్రజలు ప్రాణాలు పోతే తప్ప ఏపీ ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి సరైన చర్యలు తీసుకోలేమనే చందాన వ్యవహరిస్తున్నదని భావించాలి. ఇప్పటికైనా వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారిన ఆ పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img