Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆరోగ్య హక్కు అపార ప్రయోజనం

టి.వి.సుబ్బయ్య

ఆరోగ్య హక్కు ప్రజలందరికీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. దేశానికి స్వాతంత్య్రం లభించి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఈ హక్కు కల్పించలేదు. పౌష్టికాహారం, స్వచ్ఛమైన గాలి, నీరు ఇందుకు ప్రధానమైన ప్రాథమిక అవసరాలు. అయితే నేటి వాతావరణ పరిస్థితులు ఇందుకు అనుకూలంగాలేవు. పర్యావరణం కలుషితమై భూతాపం అపారంగా పెరుగుతూ మానవాళి మనుగడనే ప్రశ్నిస్తోంది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆలోచన ఏమైనప్పటికీ ఆరోగ్య హక్కు చట్టం తీసుకు రావడానికి రూపొందించిన బిల్లును డాక్టర్లు వ్యతిరేకించడం, ఆందోళన చేయడం నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో గల ప్రమాదకరలోపం. ఈ చట్టంలో ప్రైవేటు ఆస్పత్రులనూ చేర్చారు. అందువల్ల వైద్యులు ఆందోళన చేయగా ప్రభుత్వం వారితో ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో వైద్యులతో అడ్డంకి తొలగి పోయింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించనుంది. ఆరోగ్య హక్కు (ఆర్‌టిహెచ్‌) కల్పించిన రాష్ట్రాలలో రాజస్థాన్‌ మొట్టమొదటిది అవుతుంది.
ఈ హక్కు కింద అత్యవసర వైద్య చికిత్సలకు డబ్బు చెల్లించలేకపోయి నప్పటికీ చికిత్స పొందవచ్చు. ఆ వ్యయాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు ఆస్పత్రులలోనూ అత్యవసర కేసులకు చికిత్స లభిస్తుంది. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విష ప్రయోగం లాంటివి అత్యవసర కేసులుగా నిర్ధారించారు. బయట ఉండి చికిత్స(ఓపిడి) ఆస్పత్రిలో చేరి(ఐపీడీ) చికిత్స పొందవచ్చు. చికిత్స పొందిన వ్యాధికి బిల్లు తీసుకోవాలి. అన్ని పభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ సౌకర్యం లభిస్తుంది. అయితే రాష్ట్రంలో రెండువేల ప్రైవేటు ఆస్పత్రులలో 47ఆస్పత్రులు మాత్రమే ఈ చట్ట పరిధి లోకి వస్తాయి. అంటే ప్రైయివేటు ఆస్పత్రులు, వైద్యులు ప్రత్యక్షంగా ప్రభుత్వాల నుంచి, పరోక్షంగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ప్రయోజనం, రాయితీలు పొందినప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ముందుకు రాకపోవడం శోచనీయం.
మన దేశంలో బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ‘అమృతోత్సవ కాలం’ అని గొప్పలు ప్రచారం చేసుకోవడంతోనే సరిపెట్టు కున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొందడానికే ఈ ప్రచారం పరిమితం. దేశంలో స్వేచ్ఛా జీవన హక్కును హరించే క్రమంలో ఉన్న ప్రభుత్వం ఆరోగ్య హక్కు కల్పిస్తుందని ఆశించడం భ్రమే. కోవిడ్‌`19 మహమ్మారి లక్షలమంది ప్రాణాలను హరిస్తున్న సమయంలో మోదీ ఆనాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సేవలో, రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచే మూడు వ్యవసాయం చట్టాలను ఆమోదింప చేసుకొనే ఆరాటంలో ఉన్నారు. ఆరోగ్య చికిత్స అందించడంలో ఆయన నిర్లక్ష్యం వెల్లడైంది. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల చికిత్సలో వందలు, వేల కోట్లు రోగుల నుండి వసూలు చేశాయి. 1966 లోనే ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఇది ఆచరణ రూపం దాల్చలేదు. ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలదే నేడు వైద్యరంగంలో ఇష్టా రాజ్యం. మోదీ ప్రభుత్వపాలనలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం పెరిగి ప్రభుత్వ వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం గుర్తించాలి. రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కొన్ని లోపాలు ఉండవచ్చు. అయినప్పటికీ కేంద్రం, రాష్ట్రాలు తమ మార్గంలో ప్రజలకు ఆరోగ్యం కల్పించవలసిన బాధ్యతను గుర్తించాలి. ఆరోగ్య బీమాను సామాన్యులు భరించడం తలకు మించిన భారం అవుతుంది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోన్న స్థితిలో ఆరోగ్య బీమాను పొందడం కొంతమందికే సాధ్యం. ఆరోగ్య చికిత్స పెద్ద వ్యాపారంగా మార్చిన ‘ఘనత’ నేటి పాలకులదే. సోషలిస్టు దేశాలలో వైద్యం, విద్య ఉచితంగా లభిస్తుంది. ఈ రెండూ దేశ అభివృద్ధికి మూలం. కార్పొరేట్‌ రంగం ప్రజల సంపదను పోగు చేసుకోవడంలోనే నిమగ్నమై ఉందని ఇప్పటికైనా జనం గుర్తించాలి. ప్రభుత్వ వైద్య చికిత్సా వ్యవస్థలో నామమాత్రం ఆరోగ్య సేవలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తదితర కొన్ని రాష్ట్రాలే ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నాయి.
దేశంలో లక్ష మందిలో 36.11 శాతం ప్రజలు టి.బితో మరణిస్తున్నారు. ఇక మెదడువాపు వ్యాధి, డయేరియా, మలేరియా ఇంకా అనేక సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులతో పిల్లలు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. అతి త్వరలోనే దేశం షుగర్‌ వ్యాధి ‘రాజధాని’ గా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా. అత్యవసర కేసులు అంటే ప్రమాదాలు తదితరాలలో ఆస్పత్రులు, వైద్యులు చికిత్స అందించడం తమ కర్తవ్యంగా గుర్తించాలని, ప్రమాదానికి గురైన వారిని ఆస్పత్రులలో చేర్పించి చికిత్స చేయించాలని, 1989 లోనే సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. అందరికి ఆరోగ్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆనాడే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థనే లోబరుచుకోవాలని ఆరాటపడే పాలకుల చెవికి ఈ వ్యాఖ్యలు వినిపిస్తాయా! రోగుల ఆర్థికశక్తితో సంబంధం లేకుండా పౌరులందరికీ ఆరోగ్య చికిత్స అందించాలని 1946 లోనే జోసెఫ్‌ భోరే కమిటీ సిఫారసు చేసింది. 75 శాతం మంది సొంతంగానే వైద్యం చేయించుకోవలసి రావడంతో ప్రతి యేటా 6.3 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటున్నారని 2017 లో ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య భద్రతా నివేదికలో వెల్లడిరచింది. సొంత నివేదికలను సైతం నేటి పాలకులు అంగీకరించే స్థితిలో లేరు. అంతేకాదు ఆరోగ్యరంగానికి ప్రపంచ దేశాల్లో అతి తక్కువ ఖర్చు చేస్తున్నది మన దేశమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీడీపీలో కనీసం 5 శాతం కేటాయించాలని సిఫారసు చేసినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 1.1 శాతం మాత్రమే కేటాయిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్రజల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి గల శ్రద్ధ తెలుస్తోంది. మన రాజ్యాంగం కూడా ఆరోగ్య సేవల హక్కు హామీ పొందుపరచలేదు. ఇప్పటికైనా ఈ హక్కును రాజ్యాంగంలో చేరుస్తూ సవరణ చేయవలసిన అవసరంఉంది. ప్రజల ఆరోగ్యాన్ని మార్కెట్‌ శక్తుల చేతుల్లో పెట్టడం పాలకుల బాధ్యతారాహిత్యం. ఆరోగ్య హక్కును ప్రాథమిక హక్కుగా కేంద్రం ప్రకటించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించాలి. ఆరోగ్య హక్కు చట్టం చేయాలని రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img