Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సువిధ లో 48 గంటల ముందుగా దరఖాస్తు చేయాలి

పార్వతీపురం : ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్ లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్ సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. 48 గంటల కంటే తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు లభించవని చెప్పారు.  జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.

161 ఫిర్యాదులు అందాయి

జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 161 ఫిర్యాదులు అందాయని,  వాటిలో 20 సివిజన్ సంబంధించిన ఫిర్యాదులు, 1950 టోల్ ఫ్రీ నంబరుకు అందినవి 15, మీడియా ద్వారా అందినవి 39, వివిధ అంశాలకు సంబంధించి ఎన్నికల పిర్యాదు పోర్టల్ లో 71 పిర్యాదులు, ఇతర పిర్యాదులు 16 ఉన్నాయని వివరించారు. సి విజిల్ పిర్యాధులలో 12 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధించినవి కావని చెప్పారు.  సి.విజిల్ లో వచ్చిన ఫిర్యాదులను సరాసరి 38 నిమిషాల 42 సెకండ్లలో పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. మీడియా ద్వారా అందిన ఒక పిర్యాదు విచారణలో ఉందన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనాన్ని హిమావళి ఉల్లంఘన క్రింద ఒక ఎఫ్ఐఆర్ నమోదయిందని అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో గల 15,560 వివిధ బ్యానర్లు, పోస్టర్లు తదితర సామగ్రిని తొలగించడం జరిగిందని, ప్రైవేటు ప్రదేశాల్లో 8601 సామాగ్రిని తొలగించామని చెప్పారు.  ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన 13 మంది వాలంటీర్లను, ఒక కాంట్రాక్టు ఉద్యోగిని, ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడిపైన చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 7134 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని దీనివల్ల విలువ రూ .28.84 లక్షలుగా ఉందని చెప్పారు. పార్వతీపురం, కొమరాడ పోలీసులు ఒడిస్సా పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారని అందులో పులిసిన బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారని ఆయన వెల్లడించారు .

10 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు

జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో – ములిగూడ, బత్తిలి, భామిని, పి కోనవలస, కోనేరు కూడళ్ళ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. ఇవి ఇప్పటికే పనిచేస్తున్నాయని,  వీటన్నిటిలో వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. మరో ఐదు చెక్ పోస్టులు – గునుపూర్, పద్మాపూర్, దండిగాం, ఆర్ కె బట్టివలస, అడారు వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు

జిల్లాలో పరిస్థితులన్నిటినీ గమనిస్తున్నామని,  అవసరాలకు అనుగుణంగా 144 సెక్షన్ ను విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో కంట్రోల్ రూం (సహాయక కేంద్రం) ఫోన్ నంబర్లు :  08963-796126, 08963-293046,
సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం 8977519101 ఏర్పాటు చేశామని ప్రజలు వినియోగించు కోవాలని చెప్పారు.

ముద్రణ కర్తలు వివరాలు ప్రచురించాలి

కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు తదితర సామాగ్రిని ముద్రించే వారు విధిగా వారి చిరునామా,  ముద్రించిన ప్రతులు సంఖ్య ప్రచురించాలని ఆయన చెప్పారు.

కోటియా గ్రామాల్లో చారిత్రక సాంప్రదాయాన్ని పాటిస్తాం

కోటియా గ్రామాల్లో చారిత్రకంగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. సరిహద్దు జిల్లాలైన రాయగడ, కోరాపుట్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని, అందులో అన్ని విషయాలు చర్చించి పరస్పర సహకారం అందించుకోవడంలో అంగీకారం జరిగిందని అన్నారు. ఇరువైపులా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరుగుతుందని, ఆ ప్రాంత ప్రజలు తమ ఇచ్చానుసారం ఎక్కడైనా ఓటు వేయవచ్చని చెప్పారు. ఇందుకు రెండు జిల్లాల యంత్రాంగం ఎటువంటి అడ్డంకులు సృష్టించడం గాని, ఆటంకాలు కల్పించడం కానీ జరగదని అంగీకరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చారిత్రక సాంప్రదాయంగా వస్తుందని, దానిని పాటిస్తామని అన్నారు.

85 సంవత్సరాలు దాటిన వారికి దరఖాస్తు ద్వారా ఓటు

85 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి, దివ్యాంగులకు బిఎల్ఓ ద్వారా దరఖాస్తు అందించడం జరుగుతుందని తద్వారా ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు నిర్వర్తించుటకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ చెప్పారు.

షెడ్యూలు ప్రకటించిన తరువాత నుండే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన లబ్ధిదారుల కార్డులు, నిర్మాణ శిలా ఫలకాలు తదితర అంశాలలో ఉన్న ఫోటోలకు, పేర్లకు సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టంగా తెలియజేసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత నుండే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జరుగుతుందని అన్నారు. షెడ్యూలు ప్రకటించిన తేదీకి ముందు ఉన్న భవనాల రంగులు, శిలాఫలకాలు తదితర వాటిపై ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఫోటోలు పేర్లపై ఎటువంటి జోక్యం అవసరం లేదని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నాయని వివరించారు.

18న నోటిఫికేషన్

ఎన్నికల నోటిికేషన్ ఏప్రిల్ 18న విడుదల అవుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఆయన తెలిపారు. 29 వరకు ఉపసంహరణలు ఉంటాయని, మే 13న పోలింగ్, జూన్ 4న లెక్కింపు ఉంటాయని చెప్పారు. జిల్లాలో 48 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 36 ఎస్ ఎస్ టి బృందాలు, 16 వి ఎస్ టి బృందాలు ఉంటాయని చెప్పారు. నియోజక వర్గం స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ, సాలురులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోనూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాలుగు నియోజక వర్గాల లెక్కింపు కేంద్రం పార్వతీపురం ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. అరకు పార్లమెంటు రిటర్నింగ్ అధికారిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ను నియమించారని చెప్పారు. అరకు పార్లమెంటు లెక్కింపు ఆయా నియోజక వర్గాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాల్లో జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 144 సెక్టార్ లు, 151 రూట్ లు ఏర్పాటు చేశామని, ఇవిఎం లు సరిపడినన్ని ఉన్నాయని, ఏప్రిల్ 12న మొదటి రాండమైజేషన్, మే 1న రెండవ రాండమైజేషన్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు భద్రతపరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే జిల్లాకు మూడు కంపెనీల సిఆర్పిఎఫ్ దళాలువచ్చాయని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రెండు సమీకృత చెక్పోస్టులుగా పనిచేస్తున్నాయని అదనంగా మరో మూడు చెక్పోస్టులను సమీకృత చెక్పోస్టులుగా మార్చాలని చర్యలు చేపట్టామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించి ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు సహకరించాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img