Friday, May 10, 2024
Friday, May 10, 2024

ఇక ‘వన్డే’ సమరం!

17న ముంబైలో భారత్‌`ఆసీస్‌ తొలి వన్డే

ముంబై: బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీని వరుసగా నాలుగోసారి గెలుచుకున్న ఆనందంలో ఉన్న టీమిం డియా ఇక ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి సారించింది. మరోమూడు రోజుల్లో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ మూడు మ్యాచ్‌లు ఆడనంది. ముంబై, విశాఖపట్నం, చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే భారత జట్టును కూడా ఎంపిక చేశారు సెలక్టర్లు. కానీ ఇప్పుడు గాయం కారణంగా అహ్మదాబాద్‌ టెస్టుకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌.. తొలి వన్డేకు కూడా దూరమయ్యా డని తెలిసింది. దీంతో అతడి స్థానంలో జరగబోయే సిరీస్‌లో సంజూ శాంసన్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ కూడా తొలి వన్డేకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో భారత జట్టుకు తొలి వన్డేలోనే హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ వీరులు శుభమన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. వన్డేలకూ స్మిత్‌ సారథ్యం: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌ బాధ్యతలను మోయనున్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వన్డే సిరీస్‌లో కూడా ఆడేది అనుమానమే. దాంతో, అతని స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ జట్టును నడిపించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ఒక ప్రకటనలో వెల్లడిరచాడు. ‘వన్డే సిరీస్‌ కోసం ప్యాట్‌ కమిన్స్‌ భారత్‌ రావడం లేదు. అతను ఇంటి వద్దనే ఉండనున్నాడు. ప్రస్తుతం కష్ట సమయంలో ఉన్న కమిన్స్‌ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం’ అని మెక్‌డొనాల్డ్‌ ఒక ప్రకటనలో తెలిపాడు. తల్లి అనారోగ్యంతో ఉండడంతో కమిన్స్‌ రెండో టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అయితే... ఆమె చనిపోవడంతో అతను అక్కడే ఉండిపోయాడు. కమిన్స్‌ గైర్హాజరీలో స్మిత్‌ మూడో టెస్టులో ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తెలివైన వ్యూహాలతో జట్టును గెలిపించాడు. కాగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన కీలకమైన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో, తొలి రెండు టెస్టులు నెగ్గిన టీమిండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు వరుసగా నాలుగోసారి బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీని దక్కించుకోవడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
గాయాల బెడద: భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆసీస్‌ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయంతో పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమ వగా, ఇటీవలే గాయపడిన జై రిచర్డ్‌సన్‌ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. రిచర్డ్‌సన్‌ స్థానంలో నాథన్‌ ఎల్లిస్‌కు చోటు దక్కింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌లు కూడా గాయంతో వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. ఇక మోచేయి గాయంతో చివరి రెండు టెస్టులు ఆడని ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డేలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
భారత్‌`ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ షెడ్యూల్‌…: భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. మార్చి 17న ముంబైలో తొలి వన్డే ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే ఉంది. చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌ మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు వన్డే సిరీస్‌కు జట్లను ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img