Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈసారి.. పతకం రంగు మారుతుంది

న్యూదిల్లీ: ఒలింపిక్‌ కాంస్యంతో తానేమీ మారిపోనని భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెన్‌ తెలిపింది. పతకం రంగు మారుస్తానని ఆత్మవిశ్వాసంతో పేర్కొంది. బాక్సింగ్‌ కోసం ఎన్నో త్యాగాలు చేశానని వెల్లడిరచింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజేందర్‌సింగ్‌, మేరీకోమ్‌ తర్వాత పతకం గెలిచిన మూడో బాక్సర్‌గా ఆమె అవతరించింది. ‘ఎనిమిదేళ్లుగా ఇంటికి దూరంగా ఉండటమే నేను చేసిన మొదటి త్యాగం. నా కుటుంబ కష్టాలను పంచుకోలేదు. దూరంగా చూస్తూనే ఉండిపోయాను. ఇంతకన్నా పెద్ద త్యాగం మరోటి ఉండదు. యువతిగా నాకుండే కోరికలను త్యజించాను. నా వయసులో వారిలా చిరుతిళ్లు తినలేకపోయాను. ఏకాగ్రత కోల్పోవద్దని సాధన నుంచి విరామమే తీసుకోలేదు. ఎనిమిదేళ్లు నిరంతరాయంగా ఇది కొనసాగింది’ అని లవ్లీనా తెలిపింది. టోక్యో నుంచి వచ్చిన లవ్లీనా కొన్ని రోజులు సెలవులు తీసుకోనుంది. కుటుంబంతో సమయం ఆస్వాదించనుంది. ప్రస్తుత ఒలింపిక్స్‌ అయిపోయాయని ఇక ప్యారిస్‌కు సిద్ధం కావాల్సి ఉందని ఆమె అంటోంది. ‘నేనిప్పుడు తాజాగా ఆరంభించాలి. నా ఆటలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడున్న బలం, దృఢత్వం ఉపయోగపడలేదని కాదు. ఉండాల్సిన స్థాయిలో లేవు. నిజానికి నాలుగేళ్లు పట్టే స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌పై నేను నాలుగు నెలలే పనిచేశాను. ఇది నాకు పనిచేసినా ఒలింపిక్స్‌కు అంతకన్నా ఎక్కువ శ్రమ అవసరం’ అని లవ్లీనా పేర్కొంది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ విజేత నీన్‌ చిన్‌ చెన్‌ను ఓడిరచిన ఆమె భయాన్నీ జయించింది. ఒలింపిక్స్‌కు ముందు బొర్గొహెన్‌ శస్త్రచికిత్స, కొవిడ్‌రూపంలో అడ్డంకులు ఎదుర్కొంది. ‘కష్టాలు నాకు కొత్తేం కాదు. ఎనిమిదేళ్లుగా పడుతూనే ఉన్నా. ఇక ముందూ ఉంటాయని తెలుసు. అందుకే నేనెప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అవాంతరాలను ఎదుర్కొంటానన్న ధీమా నాకుంటుంది. మనపై మనకు విశ్వాసం ఉంటే మానసిక వైద్యుడి అవసరం ఉండదని నా అభిప్రాయం. దేశంలో చాలామంది ఆదర్శనీయులు ఉన్నారు. అంచనాల భారాన్ని వారెలా మోస్తున్నారో తెలుసుకుంటాను. మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను. కాంస్యంతో వచ్చిన పేరుతో నేనేమీ మారిపోను. నా పతకం రంగు మారుస్తాను. నేనెప్పటికీ బాక్సింగ్‌ విద్యార్థిగానే ఉంటాను’ అని లవ్లీనా తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img