Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కోహ్లి, శాస్త్రిపై బీసీసీఐ ఫైర్‌..?

న్యూదిల్లీ : టీమిండియాలో కరోనా కలకలానికి హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ‘స్టార్‌ గేజర్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ ప్రారంభానికి ముందు ఈ బుక్‌ లాంచింగ్‌ కార్యక్రమం జరగ్గా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రితో పాటు మరికొంతమంది టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రవిశాస్త్రి కరోనా వైరస్‌ బారిన పడగా అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ సైతం పాజిటివ్‌గా తేలారు. సన్నిహితంగా ఉన్న ఫిజియో నితిన్‌ పటేల్‌తో పాటు వీరిని ఐసోలేషన్‌కు తరలించారు. దాంతో ఈ నలుగురు సెప్టెంబర్‌ 10(శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌కు దూరమయ్యారు. ఆటగాళ్లందరికి నెగటివ్‌ వచ్చినప్పటికీ బబుల్‌ నిబంధనలకు విరుద్ధంగా బుక్‌ లాంచింగ్‌ ఫంక్షన్‌కు హాజరవ్వడంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లడం, కరోనా వైరస్‌ బారిన పడటంపై సమగ్ర దర్యాప్తు జరపనుందని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితోపాటు కోచ్‌ రవిశాస్త్రిలను వివరణ కోరనుందని చెప్పారు. టీమ్‌ మేనేజర్‌ గిరీష్‌ పాత్రపై కూడా దర్యాప్తు జరపనుంది. బయో బబుల్‌ నిబంధనలకు విరుద్ధంగా బుక్‌ లాంచింగ్‌కు ఎలా అనుమతించారని ప్రశ్నించనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బీసీసీఐ పెద్దల దగ్గరకు వెళ్లాయి. ‘బుక్‌ లాంచింగ్‌ హాజరవ్వడం పై బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడంపై కెప్టెన్‌, కోచ్‌, మేనేజర్‌లను వివరణ కోరడంతో పాటు దర్యాప్తు జరపనున్నారు’అని బీసీసీఐకి చెందిన అధికారి తెలిపారు. రిషభ్‌ పంత్‌ కరోనా బారిన పడిన తర్వాత ఆటగాళ్లనుద్దేశించి బోర్డు సెక్రటరీ జైషా లెటర్‌ రాశాడు. అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అయినా అతని హెచ్చరికలను బేఖాతరు చేసిన ఆటగాళ్లు.. ప్రైవేట్‌ ఫంక్షన్‌కు హాజరుకావడంపై బీసీసీఐ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించిందంట.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img