Friday, April 26, 2024
Friday, April 26, 2024

టీ20 కెప్టెన్‌ ఎంపికపై దృష్టి

కివీస్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికపై కూడా..

కోల్‌కతా : టీమిండియా టీ20 సారథి ఎంపికపై జాతీయ సెలెక్షన్‌ కమిటీ దృష్టిసారించనుంది. మరో రెండు, మూడు రోజుల్లో సెలెక్షన్‌ కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టీ20ల సిరీస్‌, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతుంది. ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత టీ20ల కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతానని ఇప్పటికే విరాట్‌ కోహ్లి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోహ్లినే నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తు న్నాడు. దీంతో టీ20 జట్టుకు కొత్త సారథి ఎంపికతో పాటు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. కోహ్లికి ప్రత్యామ్నాయంగా కెప్టెన్సీ రేసులో రోహిత్‌ శర్మ ముందున్నాడు. రోహిత్‌ ఇప్పుడు వైస్‌-కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. గత ఏప్రిల్‌ నుంచి ఐపీఎల్‌ సహా ఎడతెరిపి లేకుండా క్రికెట్‌ ఆడటంతో వారికి విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని భావిస్తోంది. మరి తాత్కాలికంగా కివీస్‌తో టీ20 సిరీస్‌కు, అలానే టీమిండియా టీ20 జట్టు శాశ్వత కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి. అదే క్రమంలో కోహ్లి టీ20 కెప్టెన్సీని మాత్రమే వదిలేస్తుండటంతో మిగతా ఫార్మాట్లపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చు. సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ, సభ్యుడు అబే కురువిల్లా దుబాయ్‌లోనే ఉండగా.. మిగిలిన సభ్యులు భారత్‌లో ఉన్నారు. కివీస్‌తో సిరీస్‌లకు జట్టు ఆటగాళ్ల ఎంపికకు నవంబర్‌ 10లోపు రిపోర్ట్‌ ఇవ్వాలని కమిటీ సభ్యులను చైర్మన్‌ చేతన్‌ శర్మ ఆదేశించారు. ఈలోపు భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవిని బీసీసీఐ భర్తీ చేయనుంది. హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గత అక్టోబర్‌ 26వరకు మాత్రమే బీసీసీఐ గడువునిచ్చింది. రాహుల్‌ ద్రవిడ్‌ సహా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ద్రవిడ్‌ ఎంపిక లాంఛనమే కావొచ్చు. మరోవైపు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌, ఇతర సిబ్బంది నియామకం కోసం దరఖాస్తుల సమర్పణకు నవంబర్‌ 3 (బుధవారం) వరకు గడువు ఉంది. నవంబర్‌ 10లోపు బీసీసీఐ ఇంట ర్వ్యూలు పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ తీసు కున్న నిర్ణయాలను క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆమోదించాల్సి ఉంది. వచ్చేవారం సీఏసీ సభ్యుడు మదన్‌లాల్‌కు 70 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో ఆయన స్థానంలో మరొకరి నియామకం జరగాల్సి ఉంది. కాబట్టి ఈ వారంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 17వ తేదీ నుంచి భారత్‌లో న్యూజిలాండ్‌ పర్యటన ప్రారంభమవుతుంది. 17న జైపుర్‌ వేదికగా తొలి టీ20, 19న రాంచీలో రెండో టీ20, 21 కోల్‌కతాలో మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. నవంబర్‌ 25-29 వరకు మొదటి టెస్టు(కాన్పూర్‌), డిసెంబర్‌ 3-7 వరకు రెండో టెస్టు మ్యాచ్‌ (ముంబై)లో భారత్‌, కివీస్‌ జట్లు తలపడతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img