Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చివరి టెస్టుకు టీమిండియాలో మూడు మార్పులు!

అహ్మదాబాద్‌ : నాలుగు టెస్టుల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా.. చివరిదైన నాలుగో టెస్టు మార్చి 9న అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి ఉత్సాహం మీదున్న టీమిండియాను ఇండోర్‌లో ఆస్ట్రేలియా కంగు తినిపించింది. టీమిండియా బ్యాటర్లు స్పిన్‌ ఉచ్చులో విలవిల్లాడగా… పర్యాటక జట్టు 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌లో గెలుపొందింది. దీంతో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలంటే… చివరి టెస్టులో భారత్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో చివరి టెస్టు కోసం టీమిండియాలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. తుది జట్టులో రెండు లేదా మూడు మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మహ్మద్‌ సిరాజ్‌ స్థానంలో మహ్మద్‌ షమీని ఆడిరచే అవకాశం ఉంది. అలాగే మూడో టెస్టులో రాణించిన ఉమేశ్‌ యాదవ్‌ను చివరి టెస్టులోనూ కొనసాగించే ఛాన్స్‌ ఉంది. మొదటి రెండు టెస్టులు ఆడిన షమీ ఏడు వికెట్లు తీశాడు. తెలుగు వాడైన వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌… బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఇప్పటి వరకూ వికెట్ల వెనుక మెరుగైన ప్రదర్శన చేశాడు. క్యాచ్‌లు అందుకోవడంలో, స్టంపింగ్‌ చేయడంలో చురుగ్గా వ్యవహరించాడు. కానీ బ్యాటింగ్‌ విషయంలో మాత్రం భరత్‌ ఇబ్బందిపడ్డాడు. దిల్లీ టెస్టులో ఫర్వాలేదనిపించినప్పటికీ… ఇండోర్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. జార్ఖండ్‌ తరపున దేశవాళీ క్రికెట్లో ఆడిన ఇషాన్‌ కిషన్‌కు స్పిన్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్‌ విభాగానికి వస్తే.. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులే 26. దీంతో చివరి టెస్టులో అతడ్ని తప్పించి.. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆడిరచే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఒక్క టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడినప్పటికీ సూర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌కు పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. నాలుగో టెస్టులో ఒక్క పేసర్‌ను మాత్రమే బరిలోకి దింపాలని భావిస్తే… సిరాజ్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌కు జట్టులో చోటు దక్కొచ్చు. గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో కుల్దీప్‌ యాదవ్‌ 8 వికెట్లతో సత్తా చాటాడు. ఒక వేళ ఇద్దరు పేసర్లను ఆడిరచాలని భావిస్తే మాత్రం… ఈ సిరీస్‌లో బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను ఆడిరచే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img