Friday, April 26, 2024
Friday, April 26, 2024

వెంకటపురం- బూర్జ గ్రామాలమధ్య పంట పొలాల్లో ఏనుగుల గుంపు

ఏనుగు హరి క్షేమమే: అటవీఅధికారులు

విశాలాంధ్ర, సీతానగరం: జిల్లాలోని ఏనుగులగుంపు సీతానగరం మండలంలోని వెంకటాపురం- బూర్జ గ్రామాల మధ్యలో చెరకుతోటలో ఉన్నాయి. అనంతరాయుడుపేట గ్రామానికి దగ్గరలోని పంటపొలాల్లో వారంరోజులుపాటు తిష్ఠవేసి పంటలను త్రొక్కిపెట్టి నాశనం చేసిన ఏనుగులగుంపు సోమవారం సాయంత్రం ఒక్కసారిగా సువర్ణముఖినది దాటి పెదబోగిలివైపు అడుగులు వేశాయి.వెంటనే పెదబోగిలి రైతులు మంటలు పెట్టగా ప్రక్కనేఉన్న బుడ్డిపేట పొలాల్లోకి చేరాయి. సోమవారం రాత్రి తొమ్మిదిగంటల సమయంలో వాటికి మార్గదర్శిగాఉండే”హరి” అనే పెద్దఏనుగు ఒక్కసారి జారిపడి పావుగంటపాటు లేవలేక ఉండిపోయింది. వెంటనే విద్యుత్ ను రెండుగంటలపాటు తీసివేసారు. ఏమీ జరిగిందోనని అంతా టెన్షన్ పడ్డారు. చీకట్లో హరి ఏనుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఢీకొని విద్యుత్ షాక్ కు గురైందని రైతులు, అటవీసిబ్బంది, స్థానికులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.మన్యంజిల్లాలో ప్రజలందరికీ హరి ఏనుగు గూర్చి తెలిసినందున వాట్సప్లో రకరకాల పుకార్లు షికార్లుచేయడంతో రాత్రి 10గంటల సమయంలో జిల్లాఅటవీ అధికారులు ప్రసూన,రాజారావు, రాజ బాబు తదితరులు హుటహుటీన బుడ్డి పేట చేరుకొని జరిగినసంఘటనపై ఆరా తీసారు.చివరకు ఏమీజరగలేదని, హరి ఏనుగు క్షేమంగా ఉందని నిర్ధారించి వారు వెనుదిరిగారు.దీంతో అటవీ, విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో విద్యుత్ ను కూడా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయంనాటికి ఇక్కడనుండి లక్ష్మిపురం- వెంకటాపురం గ్రామాలమధ్యలో పంటపొలాల్లోకి చేరి అక్కడ సాయంత్రంవరకు ఉండి పంట పొలాల మీదుగా ఇక్కడకు చేరాయి. చేతికి పంట అందివచ్చేసమయంలో ఏనుగుల రాకతో తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు లబోదిబో మంటున్నారు.పంటలవైపు రాకుండా ఉండాలని వారంతా పొలాల్లోనే దూరంగాఉండి కాపు కాస్తున్నారు కూడా. ఇక్కడనుండి తరలించి పంటలను కాపాడాలని పలుగ్రామాల రైతులు కోరుతూ, పంటనష్టపరిహారాన్ని సకాలంలో అంచనావేసి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఏనుగుల గుంపు తమప్రాంతానికి మొదటిసారి రావడంతో తండోపతండాలుగా జనాలు తరలివచ్చి చూస్తున్నారు. వారికి నచ్చజెప్పి పంపించడానికి అటవీ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.గతపది రోజుల నుంచి తిష్టవేసి వరిని కుమ్ముతూ, చెరకు, అరటి, పామాయిల్ పంటలను నాశనంచేస్తున్నాయని పలువురురైతులు లబోదిబో మంటున్నారు. ఎప్పుడు ఎటు వైపు అడుగులు వేస్తాయో ఎవరు ఊహించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాటినిఅనుసరిస్తూ వాటి ఉనికిని తెలుసుకొంటూ వాటిని సంరక్షణ కోసం అటవీసిబ్బంది రాత్రనక, పగలనక పడే ఇబ్బందులు వర్ణనాతీతం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img