Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి

జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

పార్వతీపురం, నవంబరు 7 : అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. మండల అధికారులతో సోమ వారం సాయంత్రం వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల నిలుపుదలపై స్పందన కార్యక్రమంలో పలు అర్జీలు అందుతున్నాయని ఆయన అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాల్సిందేనని అన్నారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ నిలుపుదల చేయరాదని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే గ్రామ, వార్డు సచివాలయ సమన్వయ అధికారితో సంప్రదించి తక్షణం పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. సంబంధిత సంక్షేమ సహాయకులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. అవసరం మేరకు ఎం.పి.డి.ఓ పైన చర్యలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం అర్హులైన అందరికీ అందాలని స్పష్టం చేసిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఇదే విషయంపై అనేక సార్లు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పింఛను అందకుండా బాధ్యులు అయ్యే సంక్షేమ సహాయకుల జీతాల నుండి పంపిణీ చేయుటకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలను వెంటనే తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికార్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
గృహ నిర్మాణాలను ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పాలకొండ, సాలూరు పట్టణ గృహ నిర్మాణాల జాప్యం జరుగుతోందని, దానిపై సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, మునిసిపల్ కమీషనర్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలలో ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే సాధించడం జరిగిందని, వచ్చే ఐదు నెలల్లో శత శాతం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె.రాజ కుమార్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img