Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అన్ని శాఖలు తెలుగు భాషను అమలు పరచాలి

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: అన్ని శాఖల అధికారులు తెలుగు భాషను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. తెలుగు ఆధునిక భాషా వేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. శ్రీకాకుళం జిల్లా వాసిగా వ్యవహారిక భాషా ఉద్యమానికి ఊరురా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన గిడుగు రామమూర్తి కృషి ఫలితంగానే తెలుగు భాషకు గ్రాంథికం నుంచి సరళత లభించిందన్నారు. తెలుగు భాష తాను నేర్చుకున్నానని, తెలుగు భాషలో స్పష్టత ఉంటుందని కొనియాడారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ  తెలుగు భాష కమ్మనైనది, తీయనిది తెలుగు భాష అని కొనియాడారు.   కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి మాట్లాడుతూ కార్యాలయాలకు సంబంధించి అందరు అధికారులు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని కోరారు. డిఆర్డిఎ పిడి విద్యాసాగర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img