Friday, April 26, 2024
Friday, April 26, 2024

మన్యం జిల్లాలో మొదటిసారి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఉపాధ్యాయులు సమాజాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం/పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయులు సమాజాన్ని ఉన్నతంగాతీర్చిదిద్ధాలని,ఉపాధ్యాయులు ఉన్నత లక్ష్యాల కోసం పనిచేయడమే కాకుండా భావిభారత పౌరులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపు నిచ్చారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సోమవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గిరిమిత్ర సమావేశమందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మొదటి సారి మన్యం జిల్లాలో జరిగాయి.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రేరణతోనే తాను అల్ ఇండియాలో ఉన్నత విద్యలో రెండో ర్యాంకర్ కావడమే గాక ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగానన్నారు. తల్లిదండ్రులు జడ్జి కావాలని, తానుకూడా అదే దృష్టితో ఉన్న సమయంలో ప్రజలకు మేలు చేయడానికి ఐఏఎస్ మార్గదర్శకం గూర్చి ఉపాధ్యాయులు చెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకొని ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగాను అన్నారు. సమాజానికి మార్గదర్శకులుగా, ప్రామాణిక విద్యకు చిరునామాగా ఉపాధ్యాయులు నిలవాలని సూచించారు. ఉన్నత విలువలకు పాఠశాల ప్రథమ సోపానం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఉప రాష్ట్రపతిగా పదేళ్లు పనిచేసిన  డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారన్నారు.ఉపాధ్యాయులకు  సమస్యలు ఉంటే పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. అందరూ సమయాన్ని అనుసరించాలని, విద్యార్థులకు సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ముఖగుర్తింపు హాజరును ప్రవేశ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ముఖహాజరుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులుగా సమాజానికి దిశాదశ నిర్దేశం చేయడంలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొన్ని విద్యా సంస్థలలో బాలికల పట్ల వివక్ష, లైంగిక వేదింపులు జరుగుతున్నాయని, అటువంటి సంఘటనలలో ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. జిల్లాలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులు నిబద్దతతో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు. ఆనంతరం జిల్లాలోని 54మందికి సత్కారం చేసి వారికి ప్రశంసా పత్రాలు సమర్పించారు.
ఈకార్యక్రమంలో పార్వతీపురం మునిసిపల్ చైర్ పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లా విద్యాశాఖఅధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యాశాఖఅధికారి డి. మంజుల వీణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img