Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

ఇంకెప్పుడూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు?

వరికోతలు మొదలైన ప్రారంభంకాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

విశాలాంధ్ర, పార్వతీపురం: మన్యంజిల్లా ఆవిర్భావం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలులో గతంలో జరిగే లోటుపాట్లు పునరావృతం కాకుండా ఈఏడాది రైతుభరోసాకేంద్రాలుద్వారా నేరుగా దాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చేసిన ప్రకటనలు పత్రికలకే పరిమితమాఆని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ముందుగానే ప్రారంభంచేసి రైతు పండించే ప్రతీగింజను నేరుగా రైతుల కళ్ళాలదగ్గరే కొంటామని, రైతులకు గోనె సంచులు ఇస్తామని, మిల్లర్లు పాత్ర ఉండదని, హమాలీ రవాణా ఖర్చులు కూడా నేరుగా రైతులకు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో 310రైతు భరోసా కేంద్రాల పరిధిలో ధాన్యంపంట పండటం,వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు వరిపంట కోతలు ప్రారంభించారు. కొన్నిచోట్ల కోతమిషన్లుతో దాన్యాన్ని కూడా సిద్దం చేస్తున్నారు. కానీ ప్రభుత్యం ప్రకటించినట్లు ఎక్కడా ధాన్యం కొనుగోలు మాత్రం జరగడం లేదు. వారికి గొనుసంచులు రాలేదు. ఇంకాతమకు
ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని
ఆర్బికే  కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. దీనివల్ల కొన్నిచోట్ల పండిన దాన్యాన్ని కుటుంబ అవసరాల నిమిత్తం, కూలీల ఖర్చులుకోసం తక్కువధరకే రైతులు అమ్ముకోవడం ప్రారంబించారు.
వాతావరణంలో మార్పులు జరగకముందే, తుపాన్లురాక ముందు వరిపంటను కోసి, దాన్యాన్ని నూర్చి అమ్మడానికి రైతులు సిద్దపడుతున్నారు. ఖరీఫ్ కోతలు ప్రారంభంనాటికీ ధాన్యం సేకరణ, గోనె సంచులు ఇవ్వడం, గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, రవాణా ఖర్చులు చెల్లింపు, మద్దతుధర ప్రకటన తదితర అంశాలను ప్రకటన చేయాల్సిన అధికారులు ఇంతవరకు ఆదిశగా
ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మరో వైపు మిల్లర్లు కూడా దాన్యాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఇంతవరకు జిల్లాలోని సగం మిల్లర్లు కూడా అధికారుల ఆదేశాల మేరకు బ్యాంకుగ్యారంటీలు అందజేయక పోవడం గమనార్హం. గతంలో వారికి రావాల్సిన హమాలీ,రవాణాఖర్చులు, గోనె సంచుల తదితరఖర్చులు చెల్లింపు చేస్తేనే వారు ధాన్యాన్ని తీసుకుంటామని చెబుతున్నట్లు సమాచారం. ఒక్కొక మిల్లుకు గతరెండేళ్లుగా 25లక్షల నుండి కోటి రూపాయలు వరకు ప్రభుత్వము నుండి రావాల్సి ఉందని మిల్లర్లు చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కారంచేస్తేనే తామంతా అధికారులకు సహకారం అందిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: రైతుసంఘం, సీపీఐల డిమాండ్
ధాన్యంకోతలు ముమ్మరంగా జిల్లాలో ప్రారంభమయినందున జిల్లాలో ఆన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, మిల్లర్లపాత్ర లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలుచేయాలని, కళ్ళం దగ్గరనుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మద్దతుధర ప్రకటన చేయాలని, రవాణా ఖర్చులు కూడా చెల్లింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లాకార్యదర్శి బుడితి. అప్పల నాయుడు, సీపీఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్లు డిమాండ్ చేశారు. జిల్లా పౌరసరఫరాల,వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఉండి రైతులకు న్యాయంజరిగేలా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ధాన్యాన్ని కోనుగోలుతోపాటు ఈఏడాది సకాలంలో చెల్లింపులు కూడా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు మన్యం జిల్లాలో చెరకు కొనుగోలుకేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటుచేసి సంకిలి ప్యారీ చక్కెర కర్మాగారంకు తరలించాలని వారు డిమాండ్ చేశారు.  వరి,చెరకు పంటలలో దళారుల ప్రమేయం లేకుండా తగుచర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img