Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం మానుకోవాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర`మేడిపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం మానుకుని, బలహీన వర్గాలకోసం పాటుపడాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ నారాయణ అభిప్రాయపడ్డారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ గార్డెన్స్‌లో రెండురోజులపాటు జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్‌షాప్‌ బుధవారం ప్రారంభమైంది. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, రైతులు పనిచేస్తేనే దేశానికి ఆదాయం సమకూరుతుందన్నారు. మానవ వనరులను ఉపయోగించుకొని దేశం దేశమే కాదన్నారు. మంత్రి మల్లారెడ్డికి 600 ఏకారాలు ఎక్కడి నుంచి వచ్చిందో, దానికి రైతు బంధు పథకం ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న వారే లాండ్‌ మాఫియాగా మారి, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటు న్నారని విమర్శించారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించకుండా కాంట్రాక్టర్స్‌కు లబ్ధి చేకూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం లాండ్‌ మాఫియా వైపు ఉంటుందో, పేదలు, కూలీలు, కార్మికుల వైపు ఉంటుందో తేల్చుకోవాలని అన్నారు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సంఘాన్ని బలోపేతం చేయటం ద్వారా గ్రామీణ పేదల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ జనాకర్షక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కొందరికి లబ్దిచేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో 70 శతం మంది ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, చాలామంది కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు భూములు లేవని, ఇందులో దళిత, గిరిజనులే ఎక్కువగా ఉన్నారని, వారు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుర్తిగా విఫలమైయ్యాని ఆయన ఆరోపించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. బాల మల్లేశ్‌ స్వాగతం పలుకగా, రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య ఈ వర్క్‌ షాప్‌నకు అధ్యక్షత వహించారు. వర్క్‌షాప్‌ను పల్లా వెంకట్‌ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులకు మూడు ఎకరాల భూమిని, అర్హులైన పేదలకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు లేదా ఇళ్ళు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాడని, పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నాడని అయన విమర్శించారు. భారతీయ కేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు టి. వెంకట్‌ రాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటా బడ్జెట్‌ తగ్గిస్తూ ఉపాధి సమస్యలు పట్టించుకోకుండా పేదలకు ఉపాధి లేకుండా చేయడం కోసం కఠిన నిబం ధనలను తెచ్చి పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందని విమర్శించారు. బాలమల్లేశ్‌ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధికి బడ్జెట్‌ పెంచాల్సింది పోయి తగ్గించడం పేదలకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు. కలకొండ కాంతయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు రైతుబంధు పథకం మాదిరిగా కూలి బంధు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇవ్వాలని కోరారు. సీపీఐ సీనియర్‌ నాయకులూ రచ్చ వాసుదేవ్‌ ఎర్ర జండా ఆవిష్కరించారు. బీకేఏంయు జాతీయ సమితి సభ్యులు మోతె జాంగా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్‌ రావు, అక్కపల్లి బాబు, ఏం. తాజుద్దీన్‌, కార్యదర్శులు బుద్దుల జంగయ్య, సృజన కుమార్‌, చింతకుంట్ల వెంకన్న, యేసయ్య, దుబ్బాసు రాములు, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌. బాలరాజ్‌, ప్రధాన కార్యదర్శి టి. శంకర్‌, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రొయ్యల కృష్ణ మూర్తి, నేతలు లక్ష్మి, దామోదర్‌ రెడ్డి, బోడుప్పల్‌ సిపిఐ పార్టీ నగర కార్యదర్శి రచ్చ కిషన్‌, సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img