Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

దోచుకుంటున్న మోదీ ప్రభుత్వం

ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నరసింహ ఆరోపణ

విశాలాంధ్ర, హైదరాబాద్‌ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను నిరంతరాయంగా పెంచుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను బహిరంగంగా దోచుకుంటుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఏం.నరసింహ ఆరోపించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌, హిమాయత్‌ నగర్‌ సత్యనారాయణ రెడ్డి భవన్‌ నుండి ఆటోలను సైకిల్‌ రిక్షాలకు తాళ్లతో కట్టి తొక్కుత్తు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించి, ప్లకార్డులు చేతబూని పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఏం.నరసింహ మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ తోపాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల దేశంలో కొత్త రికార్డులను మోదీ ప్రభుత్వం సృష్టిస్తుందని, ఇప్పుడు ఆల్‌ టైం హై రికార్డును సైతం పెట్రోల్‌, డీజీల్‌ మించిపోయింది అయన ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ముడిచమురు ధర తక్కువగానే ఉన్నా ప్రభుత్వాలు పన్నులతో సామాన్యుడిపై బాదేస్తున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాక్‌డౌన్‌లోను, అనంతరం బేరాలు లేక ఆటో డ్రైవర్లు జీవితాలు చితికిపోయాయని, గత మూడునెలలుగా నిరంతరంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం వారి బ్రతుకులను బజారుకీడ్చిందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో భారాలు తగ్గించి ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రం ధరలు, పన్నులు పెంచి బ్రిటీష్‌ రాక్షస పాలనను తలపిస్తోందని అయన మండిపడ్డారు పెంచిన ఇంధన ధరలను తగ్గించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఏం. నరసింహ హెచ్చరించారు. ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.మల్లేష్‌ మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నా కూడా మోడీ సర్కార్‌ కళ్లు ఉండి చూడలేని కబోధుల్లా తయారయ్యారని, ఇంధన ధరల విషయంలో కేంద్రం ప్రభుత్వం రోజుకో అబద్దం చెబుతోందన్నారు. విమర్శించారు. కరోనా మహమ్మారి, లాక్‌ డౌన్‌ కారణంగా ప్రయాణ రవాణా రంగంలోని ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భరమయ్యాయని, ఇటువంటి సమయంలో ఆటో రంగ కార్మికులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా ధరలు పెంచి మరింత భారాలు మోపడం దుర్మార్గమని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా ఆటో డ్రైవర్లకు బేరాలులేక ఇంటివద్దే ఉంటున్నారని, పూటగడవడం కష్టంగా మరి పస్తులుంటున్నారని అయన తెలిపారు. పెట్రోల్‌, డీజల్‌తో పాటు నిత్యవసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచి పేదల జీవితాలతో చలగాటమాడుతున్నారని అయన మండిపడ్డారు. అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర అయన డిమాండ్‌ చేశారు. 2012 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఆటో మీటర్‌ రేట్‌ను పెంచలేదని రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన, నిత్యవసర వస్తువుల ధరలను అనుగుణంగా తక్షణమే ఆటో మీటర్‌ రేట్‌లను పెంచాలని ఆర్‌. మల్లేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శనలో ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఏ.బిక్షపతి యాదవ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి.ఒమర్‌ ఖాన్‌, నాయకులూ సిహెచ్‌.జంగయ్య, కృష్ణ మూర్తి, జె.కుమార్‌, షేక్‌ లతీఫ్‌, ఎండి. ఫరూక్‌, కొమురెల్లి బాబు, శ్యామ్‌ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img